- కె.వి.పి.ఎస్ ఆవిర్భావ దినోత్సవం నేడు
ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన...పోరాట లక్ష్యాలతో 1998 అక్టోబరు 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కె.వి.పి.ఎస్) ఏర్పడింది. గ్రామాలలో దళాలుగా ఏర్పడి దళిత, గిరిజనులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై సర్వేలు చేసి పరిష్కారం కోసం రాజీ లేని పోరాటాలతో పలు విజయాలు సాధించింది. సర్వే చేసిన కుల వివక్ష రూపాలపై అర్జీ ఇవ్వడానికి వెళ్ళిన కె.వి.పి.ఎస్ బృందంతో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'కుల వివక్ష ఎక్కడ వుంది? నా మంత్రివర్గంలో ఉందా? చూడండి. మీరు లేనిపోని విమర్శలు చేస్తార'న్నారు. అయితే అసెంబ్లీ లోపలా బయటా ఉద్యమం చేయడంతో ఆయనకు ఏకసభ్య కమిషన్ వేయక తప్పలేదు. 'కె.వి.పి.ఎస్ ఇచ్చిన రిపోర్ట్ కరెక్టు. ఇంకా మన రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన కుల వివక్ష, అంటరానితనం రూపాలు కొనసాగుతున్నాయి. వాటి పరిష్కారం కోసం ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాల'ని 1992 పేజీల రిపోర్టును జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి అందించింది. అయితే చంద్రబాబు నాయుడు ఆ రిపోర్టును బీరువాలో పెట్టారు.
రాష్ట్రంలో పర్యటించి కుల వివక్షను కళ్ళారా చూసి చలించి పోయిన జస్టిస్ పున్నయ్య...కె.వి.పి.ఎస్ వ్యవస్థాపకులు పాటూరు రామయ్య, జాన్ వెస్లీలను పిలిచి 'మీరు ఇచ్చిన రిపోర్టు చాలా కరెక్టు. నేను రాష్ట్రంలో పర్యటించిన సమయంలో మీ రిపోర్టు కన్నా అదనంగా వచ్చిన సమాచార రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాన'ంటూ నివేదిక మరో ప్రతిని వారికి అందించారు. సీ.ఎం బీరువాలో వున్న రిపోర్టును బహిర్గతం చేసి...రాష్ట్రంలో కులవివక్ష నిర్మూలన కోసం ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున మరలా రెండవసారి... అసెంబ్లీ లోపల, బయట వేలాది మందితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడం జరిగింది. ఉద్యమ ప్రభావం వల్ల రిపోర్టును అంగీకరించి రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసింది. ఇది కె.వి.పి. ఎస్ పోరాడి సాది óంచిన రెండవ విజయం.
రిపోర్టు లోని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే కుల వివక్ష సుమారు 64 రూపాలలో వున్నట్లు వెల్లడి అవుతోంది. దళితులను గుడి లోకి రానివ్వక పోవడమే కాకుండా గ్రామాలలో రచ్చబండ అరుగులపై కూడా కూర్చో నివ్వకపోవటం, చెప్పులు వేసుకొని, కొంగు పంచెలు విడిచి కనీసం సైకిల్‌పై కూడా నడి వీధుల్లో తిరగనివ్వక పోవడం... వంటి అనేక దుర్మార్గమైన రూపాలు కొనసాగుతు న్నాయని జస్టిస్ పున్నయ్య కన్నీళ్ళు పెట్టుకున్నారు. కొన్ని ప్రాంతా లలో ప్రత్యక్ష పోరాటం ద్వారా దళితులకు మనోధైర్యం కల్పించి స్ఫూర్తినిచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మొదటి చైర్మన్‌గా పున్నయ్యను నియమించగా...42 సూచనలు, జీవోలు, సిఫారసులు రూపం లో విడుదల చేశారు. ప్రభుత్వాలు, వ్యక్తులు మారుతున్నారు. కానీ సిఫార్సులు నేటికీ అమలు కావడంలేదు. వీటి అమలు కోసం మరో పోరాటం చేయాల్సి వుంది. సంఘం చేసిన సర్వేలో వెలుగులోకి వచ్చిన మరో సమస్య అనేక ప్రాంతాలలో దళితులకు కనీసం శ్మశానాలు లేకపోవడం. ఒకవేళ ఉన్నా అవి ఆక్రమణలకు గురికావడం ప్రధాన సమస్యగా వచ్చింది. వీటి కోసం మరో పోరాటం చేయాల్సి వచ్చింది. దాంతో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి శ్మశానాల సమస్య పరిష్కారం కోసం జీవో 1235 ఇచ్చారు. ఇది కె.వి.పి.ఎస్ మూడవ విజయం.
రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో దళాలుగా ఏర్పడి చేసిన సర్వేల్లో మరో ముఖ్యమైన అంశం బైటపడింది. కేంద్రం నుండి రాష్ట్రాలకు వచ్చిన దళిత, గిరిజన నిధులను...దళిత, గిరిజనులకు సంబంధం లేని ప్రాంతాల్లో ఖర్చు చేసి గ్రామాల్లోని పల్లెలను మురికి కూపాలుగా మార్చారన్న విషయం సర్వేల్లో వెలుగులోకి వచ్చింది. దీనిపై దళిత, గిరిజనులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని అందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం తీసుకురావాలని మరో ఉద్యమం చేయడం జరిగింది. సుమారు 10 సంవత్సరాల పాటు ఉద్యమం దశలవారీగా కొనసాగింది. అర్జీలతో ప్రారంభమైన ఉద్యమం...రాస్తారోకో, ఆఫీసుల ముట్టడి, పాద యాత్రలు, సైకిల్ యాత్రలు, అసెంబ్లీ ముట్టడి సందర్భంగా నిరవధిక దీక్షల వరకు కొనసాగింది. ఉద్యమంలో అన్ని రకాల ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు, దళిత, గిరిజన ప్రజా సంఘాలు కలిసి వచ్చాయి. వేలాది మంది అసెంబ్లీ బయట బైఠాయించారు. వామపక్ష ఎంఎల్‌ఏ లు అసెంబ్లీ లోపల బైఠాయించారు. ఉద్యమం ఫలితంగా 2013లో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సబ్‌ప్లాన్ చట్టం చేస్తూ అసెంబ్లీలో ప్రకటించారు. ఇది కెవిపిఎస్ నాల్గవ విజయం.
పూలే, అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు, గుర్రం జాషువా, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహనీయుల స్ఫూర్తి తో ఏర్పడిన కె.వి.పి.ఎస్ నాటి నుండి నేటి వరకు దళిత, గిరిజ నులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తోంది. దళితులపై జరుగుతున్న కుల వివక్ష, దాడులు, హత్యలు, సాంఘిక బహిష్క రణలపై పని చేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం కృషి చేస్తున్నది. దళిత, గిరిజనులను చైతన్యం చేసేందుకు కషి చేస్తోంది. స్పోకెన్ ఇంగ్లీషు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం లాంటి సేవా కార్య క్రమాలు చేస్తోంది. మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళుతోంది. ఈ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
/ వ్యాసకర్త - కె.వి.పి.ఎస్ రాష్ట్ర కార్యదర్శి /
ఆండ్ర మాల్యాద్రి











