ప్రజాశక్తి-చెరుకుపల్లి: కుల రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మానుకోవాలని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆదివారం ఉప్పాలవారిపాలెం గ్రామంలో ఉప్పాల అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామ ర్శించి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కులాలను అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడం చంద్రబాబు నాయుడుకు అలవాటని, కులాలను తాకట్టు పెట్టే సంస్కతి రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్ మానుకోవాలని, కుల గౌరవాన్ని పెంచాలని ఆయన హితవు పలికారు. సంఘట న జరిగిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబానికి తగిన సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారని జోగి రమేష్ పేర్కొన్నారు. కులాలను బీసీ కులాలను తన కాళ్ల దగ్గర తాకట్టు పెట్టుకున్న సంస్కతి చంద్రబాబు నాయుడుదని, తాము అందిం చే పథకాలకు ఎలాంటి కులము మతము లేవని తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నేపథ్యంలో కుల రాజకీయాలు చేయడం అనగాని సత్యప్రసాద్ నైజానికి నిదర్శనమని ఎంపీ మోపిదేవి విమర్శించారు. కార్యక్రమంలో బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










