Nov 10,2023 00:26

వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న మంత్రి పీడిక రాజన్న దొర తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను కుల, మత, వర్గాలకు అతీతంగా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని ఉపముఖ్య మంత్రులు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో గురువారం రాష్ట్ర పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అధ్యక్షతన వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్ర ముగింపు బహిరంగ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రులు మాట్లాడుతూ జగనే తిరిగి ఎందుకు కావాలి అనేదానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. 2014-19 మధ్య టిడిపి పాలనలో సామాజిక న్యాయం చచ్చిపోయిందన్నారు. చంద్రబాబు మాయ మాటలతో ప్రజలను మోసగించినందుకే నేడు చిప్ప కూడు తింటున్నాడని, మళ్లీ అధికారం కోసం కల్లబొల్లి హామీలు ఇస్తున్నారని ఆరోపించారు.
ముందుగా వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మారేడుపూడి నుంచి భారీ ప్రదర్శనగా కసింకోట మండలం తేగాడ గ్రామం చేరుకుని అక్కడ జగనన్న గృహాలను, రైతు భరోసా కేంద్రం, సచివాలయం, వెల్నెస్‌ సెంటర్లను ప్రారంభించారు. సామాజిక సాధికార యాత్ర ముగింపు సందర్భంగా పైలాన్‌ ఆవిష్కరించారు. అనంతరం అనకాపల్లి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ బివి.సత్యవతి, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, పెట్ల ఉమా శంకర్‌, అదీప్‌ రాజు, వైసిపి జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్‌, నాయకులు దంతులూరి దిలీప్‌ కుమార్‌, గొల్లవిల్లి శ్రీనివాసరావు, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బీవీ సత్యవతి, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వైసిపి ప్రభుత్వంలోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం
కశింకోట : రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు న్యాయం చేసింది వైసిపి ప్రభుత్వమేనని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. కసింకోటలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగున్నరేళ్లగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఆర్థికంగా చేయూతనిచ్చినట్లు చెప్పారు. సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్‌, వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి, ఎంపీ సత్యవతి ఇతర నాయకులు పాల్గొన్నారు.
బస్సు యాత్రకు మద్దతుగా బైకు ర్యాలీ
పరవాడ : అనకాపల్లిలో జరిగిన వైసిపి బస్సు యాత్రకు మద్దతుగా గొన్న హేమచంద్‌ నాయుడు ఆధ్వర్యంలో సుమారు 100 బైకులతో యువకులు పరవాడ మండలం గొన్నవానిపాలెం నుండి లంకెలపాలెం జంక్షన్‌ మీదుగా అనకాపల్లి వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. లంకెలపాలెం వద్ద స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, హేమ్‌చంద్‌ నాయుడు బండి వెనక కూర్చుని కొంత దూరం ఈ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు.
జనసేన నాయకుల ముందస్తు అరెస్టు
అనకాపల్లి : వైసిపి సామాజిక సాధికార యాత్ర సందర్భంగా జనసేన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, సుగర్‌ ఫ్యాక్టరీలను ఆధునికీకరిస్తామని గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీపై సమాధానం చెప్పి సభ నిర్వహించాలని, లేదంటే అడ్డుకుంటామని జనసేన నాయకులు హెచ్చరించిన నేపథ్యంలో ఈ అరెస్టులకు పూనుకున్నారు. జనసేన నాయకులు దూలం గోపి, మళ్ల శ్రీనును అరెస్టు చేసే చోడవరం పోలీస్‌ స్టేషన్‌కు, తాడి రామకృష్ణ, తాడి శాంతి కుమారి, బర్నికాన రాము, తాకాశీ సత్‌ సత్యం దొర, గంగుపాం జగదీశ్‌ను అనకాపల్లి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
వైసిపిది దొంగల యాత్ర : పీలా
అనకాపల్లి : వైసిపి మంత్రులు చేస్తున్నది ఇసుక, గ్రావెల్‌, భూములు దోచే దొంగల యాత్ర అని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకుండా మంత్రులకు యాత్రలు చేసే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మాధంశెట్టి నీలబాబు, మళ్ళ సురేంద్ర, కాయల మురళి, సబ్బవరపు గణేష్‌, పోలారపు త్రినాధ్‌ పాల్గొన్నారు.