May 15,2022 08:44

తాటి ముంజలను (ఐస్‌ యాపిల్‌) తీసుకుంటే దాహం తీరడంతో పాటు డీహైడ్రేషన్‌, వడదెబ్బ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్‌- ఏ, బీ, సీ, ఐరన్‌, జింక్‌, ఫాస్పరస్‌, ఫొటాషియం, క్యాల్షియం, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిని నేరుగా తినడంతో పాటు రకరకాల వెరైటీలూ వండుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..!
 

కొబ్బరి కూర
కావా ల్సిన పదార్థాలు : ముంజలు-ఒక కప్పు, పచ్చికొబ్బరి పేస్టు- అర కప్పు, నువ్వుల పొడి- ఒక టీస్పూను, నూనె- రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి పేస్టు- రెండు టీస్పూన్లు, ఉప్పు-తగినంత, ఉల్లిపాయ-ఒకటి (సన్నగా తరిగినవి), కసూరిమేథీ- అర టీస్పూను, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను, గరంమసాలా- ఒక టీస్పూను, పసుపు- చిటికెడు, కొత్తిమీర- కొద్దిగా, టమాటా ముక్కలు- అరకప్పు, చింతపండు గుజ్జు- తగినంత.
తయారుచేసే విధానం : పాన్‌లో నూనె వేడెక్కాక, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించాలి.

  •  ఇందులో పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్టులో వేసి, వేగించాలి.
  •  తర్వాత గరంమసాలా, కసూరిమేథీ, పచ్చిమిర్చి పేస్టు, టమాటా ముక్కలు కూడా వేసి, కొద్దిసేపు వేగించాలి.
  •  ఈ మిశ్రమంలో పచ్చికొబ్బరి పేస్టు, నువ్వులపొడితో పాటు కొన్ని నీళ్లు పోసి, ఉడికించాలి.
  •  తర్వాత పొట్టు తీసిన ముంజల ముక్కలను ఈ మిశ్రమంలో వేసి కలపాలి.
  • తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి.
  •  ముంజలు మెత్తబడ్డ తర్వాత దానిపై కొత్తిమీర చల్లాలి. అంతే... తాటిముంజల కొబ్బరికూర రెడీ.


ఐస్‌ క్రీమ్‌

ice


కావాల్సిన పదార్థాలు :
ముంజలు- నాలుగు, చిక్కటి పాలు- 200 మి.లీ., కార్న్‌ఫ్లోర్‌- చెంచా, పాలపొడి- పెద్ద చెంచా, చక్కెర- నాలుగు పెద్ద చెంచాలు, క్రీమ్‌- రెండు పెద్ద చెంచాలు.
తయారుచేసే విధానం :
అర కప్పు పాలను పక్కన పెట్టి, మిగతా పాలను చిన్న మంటపై కాసేపు వేడి చేయాలి.

  •  మరుగుతున్న పాలలో చక్కెరను వేసి కలపాలి.
  • అర కప్పు పాలలో కార్న్‌ఫ్లోర్‌, పాల పొడి వేసి ఉండలు లేకుండా కలపాలి.
  •  ఈ మిశ్రమాన్ని మరిగే పాలల్లో వేసి, చిన్న మంటపై మరికాసేపు మరిగించాలి.
  •  పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చి, గాలి చొరబడని డబ్బాలో ఉంచి, ఫ్రిజ్‌లో నాలుగు గంటలు ఉంచాలి.
  • ముంజలను చిన్న ముక్కలుగా కోసి, గంట ఫ్రిజ్‌లో పెట్టాలి.
  •  ఫ్రిజ్‌లో పాలు, ముంజలను బయటకు తీయాలి. పెద్ద గిన్నెలో పాలు పోసి, ముంజల ముక్కలను వేయాలి.
  •  వీటిపై క్రీమ్‌ వేసి, బాగా గిలకొట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని మరోసారి గాలి చొరబడని డబ్బాలో పెట్టి, నాలుగు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత రోజ్‌ సిరప్‌తో గార్నిష్‌ చేసి, సర్వ్‌ చేసుకోవచ్చు.


పాయసం

పాయసం


కావాల్సిన పదార్థాలు : పాలు- అర లీటరు, లేత ముంజలు- 8, బాదం పప్పులు- 12, పంచదార - 3 టీ స్పూన్లు, కుంకుమపువ్వు - 4 రెమ్మలు.
తయారుచేసే విధానం : శుభ్రం చేసిన ముంజలను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

  • బాదం పప్పుల్ని గంటసేపు నానబెట్టి, పొట్టు తీసి మెత్తగా రుబ్బుకోవాలి.
  • పాలను సగమయ్యే వరకూ మరిగించాలి. బాదం పేస్టు, పంచదార కలిపి చిన్నమంటపై మూడు నిమిషాలు ఉంచి, దించేయాలి.
  • పాలు గది ఉష్ణోగ్రతకు వచ్చాక ముంజుల ముక్కలు కలిపి, మూడు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి.
  • సర్వ్‌ చేసేముందు కుంకుమపువ్వుతో అలంకరించాలి. ఈ పాయసాన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.



సలా డ్‌..

 

సలా డ్‌..


కావాల్సిన పదార్థాలు : చల్లని ముంజలు- నాలుగు (చిన్న ముక్కలుగా), పుచ్చకాయ ముక్కలు- ఒకటిన్నర కప్పు, బీట్‌రూట్‌ తరుగు- రెండు చెంచాలు, వేయించిన నల్ల నువ్వులు- ఒకటిన్నర చెంచా, పుదీనా ఆకులు- రెండు పెద్ద చెంచాలు.
డ్రెస్సింగ్‌ కోసం.. చెరకు రసం- కప్పు, మిరియాల పొడి- కొద్దిగా, చిల్లీ గింజలు- కొన్ని, నిమ్మరసం, నువ్వుల నూనె- చెంచా చొప్పున, నల్ల ఉప్పు- రుచికి సరిపడా.
తయారుచేసే విధానం : నిమ్మరసం తప్ప డ్రెస్సింగ్‌ కోసం ఉపయోగించే అన్ని పదార్థాలనూ కలిపి, మూడో వంతు అయ్యేలా బాగా మరిగించాలి.

  • పొయ్యి కట్టేసి చల్లారిన తర్వాత నిమ్మరసం కలిపి పక్కన పెట్టాలి.
  • పెద్ద గిన్నెలో ముంజలు, పుచ్చకాయ ముక్కలు, సన్నగా తరిగిన బీట్‌రూట్‌, నల్ల నువ్వులు, పుదీనా ఆకులు వేసి బాగా కలపాలి.
  • ఈ మిశ్రమంలో తయారు చేసి పెట్టుకున్న ద్రవం పోసి, చక్కగా కలిపి చల్లచల్లగా అందించాలి.