
* ప్రజాభిప్రాయ
సేకరణలో
స్పీకర్ సీతారాం
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : సామాజికంగా సంక్షేమ పథకాలను మెరుగ్గా రూపొందించడానికి, వాటిని అమలు చేయడానికి జనాభాలోని అన్ని వర్గాల సామాజిక, విద్య, ఆర్థిక, జీవనోపాధి తదితర అంశాలతో కుల ఆధారిత సమగ్ర గణనను చేపట్టడం అత్యవసరమని శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాలు, కుల సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆధ్వర్యాన బృందావనం ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కులాలకు సంబంధించిన సమగ్ర సమాచారం గత 92 ఏళ్లలో ఎప్పుడూ సేకరించ లేదని అన్నారు. ఈ గణన వల్ల చిన్న తరగతులనూ గుర్తించి వారి సమస్యలు, స్థితిగతులు తెలుసుకుని అభివృద్ధి ఫలాలను అందించడానికి దోహదపడుతుందన్నారు. కుల గణన సర్వే పూర్తయితే సామాజిక తరగతుల వారీగా జనాభా ప్రతిపదికన సంక్షేమ పథకాలను అందించేందుకు వీలవుతుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలను అందించడానికి వీలవుతుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని తరగతులకు చెందిన కులాల వారి సంఖ్యను ఈ నెల 27 నుంచి లెక్కించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. అందులో భాగంగానే వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో పాటు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ తదితర కుల సంఘాల నాయకులతో కుల గణన సర్వేపై సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనా పథకాలకు, మానవవనరుల అభివృద్ధికి, పేద, ధనికుల మధ్య తారతమ్యాలు తగ్గించేందుకు, సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు ఈ డేటా మున్ముందు ఎంతగానో వినియోగపడుతుందని తెలిపారు. కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలు తెలియజేసిన వివరాలు మాత్రమే నమోదు చేస్తామన్నారు. ఇందుకు ఎటువంటి ఆధారాలు ఇవ్వవాల్సిన అవసరం లేదన్నారు. ఈ సర్వే ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులందరికీ అవసరమైన శిక్షణ ఇస్తున్నామన్నారు. సేకరించిన సమాచారం అత్యంత భద్రతలో ఉంచుతామన్నారు. ఈ విషయమై సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, జెడ్‌పి చైర్‌పర్సన్ పిరియా విజయ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, పి.తిలక్, అంధవరపు సూరిబాబు, డి.పి.దేవ్ పాల్గొని కులగణన ఆవశ్యకతను వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, పొందర కూరాకుల చైర్‌పర్సన్ రాజాపు హైమావతి, వెలమ కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిది పంగ భావాజీనాయుడు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు, దళిత సంఘాల జెఎసి నాయకులు కంఠ వేణు, టైక్వాండో శ్రీను, కోరుపూరు గజపతి రావు, రౌతు శంకరరావు, చింతాడా రామ్మోహన్, మహ్మద్ రఫీ, బాడాన దేవ భూషన్, జుత్తు నీలకంఠం, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్, మెప్మా పీడీ కిరణ్‌కుమార్, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, బిసి కార్పొరేషన్ ఈడి గెడ్డమ్మ, ముఖ్య ప్రణాళిక అధికారి వి.ఎస్.ఎస్. లక్ష్మీప్రసన్న, జిల్లా బిసి సంక్షేమ అధికారి అనురాధ పాల్గొన్నారు.