Nov 22,2023 00:12

సమావేశానికి హాజరైన వివిధ సంఘాల నాయకులు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో ఈ నెల 27 నుండి డిసెంబర్‌ 3 వరకు వారం రోజులపాటు చేపట్టనున్న కుల గణనను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని ప్రజా ప్రనిధులు, కులసంఘ నాయకులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ కోరారు. ఈ మేరకు నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ స్పందన హాలులో ప్రజా ప్రతినిధులు, కుల సంఘ నాయకులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇది కేవలం సంఖ్యా గణన మాత్రమేనని, దీనితో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధం లేదని అన్నారు. వలస దారులు, ఎక్కడో పనిచేసే వారి వివరాలు సేకరించాలని పలు కుల సంఘాల వారు కోరగా కలెక్టర్‌ స్పందిస్తూ అందరి వివరాలు సేకరిస్తామన్నారు. వాలంటీరు, ఇంటి పెద్ద, ఫంక్షనల్‌ అసిస్టెంట్‌ల సమూహ వేలిముద్రల అనంతరం మాత్రమే నమోదు చేస్తారని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కుల గణనను షిఫ్ట్‌ డ్యూటీలలో నిర్వహించేలా చూడాలని కోరగా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : ప్రజల వద్ద నుంచి సమగ్ర సమాచారం సేకరించి కులగణన నిర్వహిం చాలని కులగణన సర్వే ప్రత్యేక అధికారి షమ్మీ అన్నారు. కుల గణన సర్వేపై సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు స్థానిక మార్కెట్‌ యార్డులో మంగళవారం శిక్షణి చ్చారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ చైర్మన్‌ సుబ్బారావు, వైస్‌చైర్మన్‌ కొమ్ముముక్కంటి హాజరయ్యారు. కార్యక్రమానికి పిడుగురాళ్ల మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ కులగణన కేవలం ఒక కులం ప్రాతిపదికనే కాకుండా ప్రజల సామాజిక ఆర్థిక వివరాల కోసం నిర్వహిస్తున్నామనే విషయాన్ని ప్రజలకు తెలపాలన్నారు. సర్వేలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కలిసి పని చేయాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్సైట్లో ప్రజల పూర్తి వివరాలు నమోదు చేయాలని అన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, వారికున్న ఆస్తి వివరాలు గతంలో కుల ధ్రువీకరణ పత్రాల వివరాలన్నీ పూర్తిగా వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పారు. సర్వేను బిఎల్‌ఒలు పర్యవేక్షించాలన్నారు. 27 నుండి వచ్చేనె 3వ తేదీ వరకూ మాత్రమే సర్వే ఉంటుందని, సర్వేలో సిబ్బందికి ఏమైనా అనుమానాలొస్తే తమ దృష్టికి తేవాలని అన్నారు. సర్వే పనులు కారణంగా చూపి రోజువారి విధులు ఆటంకం కలిగించకూడదని చెప్పారు.