Nov 17,2023 20:42

సీతానగరం లో సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న ఎంపిడిఒ కృష్ణమహేష్‌రెడ్డి

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం :  ఈనెల 27 నుంచి మండలంలో నిర్వహిస్తున్న వివిధ సామాజిక వర్గాల జనాభాను తెలుకొనే లక్ష్యంతో కులగణన సర్వేను కార్యదర్శులు సక్రమంగా పూర్తి చేయాలని ఎంపిడిఒ సాల్మన్‌రాజు, తహశీల్దార్‌ జె.రాములమ్మ తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణలో పాల్గొని పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా కులగణన ప్రారంభం కానున్న నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాటించి సర్వేను పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను రూపొందించేందుకు సంక్షేమ పథకాలు అమలుకు ఈ కులగణను సర్వే దోహదపడతాయన్నారు. అలాగే కులగణన గురించి ముందుగానే వాలంటీర్ల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించి అపోహలను తొలగించాలన్నారు. ఈ సర్వేలో కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలనే నమోదు చేయాలని, వాటికీ సంబంధించిన ధ్రువపత్రాలను అడగనవసరం లేదని అన్నారు. అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఎవరి కులం వారికే నమోదు చేయాలన్నారు. సర్వేలో ఎవరైనా కులం పేరు చెప్పేందుకు ఇష్టపడకపోతే వారిని బలవంతం చేయవద్దన్నారు. సేకరించిన సమాచారం ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటుందన్నారు. ఈ సర్వేను ఈనెల 27 నుంచి వారం రోజుల పాటు మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రతి ఇంటికి సర్వే నిర్వహించాలన్నారు. ప్రతి కుటుంబానికి సర్వే పూర్తి చేసిన తర్వాత సచివాలయ సిబ్బంది వాలంటీర్లు బయోమెట్రిక్‌ వేసి వివరాలను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సర్వేను తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఇఒపిఆర్‌డిలు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేస్తారని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి జగదీష్‌ కుమార్‌ ఉన్నారు.
సీతానగరం : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో కులగణనపై శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా ఎంపిడిఒ బి.కృష్ణమహేష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కుల గణన పగడ్బందీగా చేయాలన్నారు. ప్రతి కుటుంబాన్ని సర్వే చేయాలన్నారు. వారి ఆర్థిక పరిస్థితులు వివరాలు పొందుపర్చాలన్నారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి కెకె వర్మ, సతీష్‌ గ్రామ సచివాలయ కార్యదర్శిలు సిబ్బంది పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్‌ : మండలంలోని 20 సచివాలయాల సిబ్బందికి ఈనెల 27 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కులగణనపై శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ఎంపిడిఒ అకిబ్‌జావేద్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ కుల గణనపై ముందుస్తుగా ఆయా సచివాలయాల పరిధిలోని వాలంటీర్ల సహకారంతో గ్రామస్తులకు అవగాహన కల్పించి ప్రభుత్వం నిర్ధేశించి మార్గదర్శకాలకు అనుగుణంగా గణన చేపట్టి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో పరిపాలన అధికారి రమణమూర్తి పాల్గొన్నారు.
వీరఘట్టం : కుల గణనపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపిడిఒ వై.వెంకటరమణ సచివాలయాల కార్యదర్శులను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సిఎఫ్‌ఎంఎస్‌ లాగిన్‌ ద్వారా వాలంటీర్లతో సర్వే చేపట్టేందుకు చొరవ చూపాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ యజమానితో పాటు సభ్యులు వివరాలు నమోదు చేయాలని సూచించారు. కుటుంబం వివరాలు, నమోదైన అనంతరం యజమాని, వాలంటీర్ల ఇకెవైసి తప్పనిసరిగా వేయించాలన్నారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి కె.సూర్యనారాయణ, మేజర్‌ పంచాయతీ ఇఒ వి.రామచందర్రావు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.