ప్రజాశక్తి - మోతుగూడెం
చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పరిధి ఇంతలూరు వాగులో శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ నిర్వహించారు. మోతుగూడెం పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాలను వినతిపత్రాల రూపంలో సెక్రటరీకి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోర్బాయి, ఇంతులూరువాగు, ఒడయాక్యాంప్, ఎంసిడి క్యాంపు, రాజ్ క్యాంపు గ్రామాల ప్రజలు ఎపిజెన్కో పవర్ ప్లాంట్ కట్టినప్పటి నుండి ఇక్కడే ఉంటున్నామని తెలిపారు. అల్లూరి జిల్లాలోని పాడేరు, ముంచుంగిపుట్టు తదితర గ్రామాలలో ఉన్న తమ తెగ వారికి ఎస్‌టి పోర్జ, గౌడ, కొందు, వాల్మీకి కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని దష్టిలో తమ పిల్లల భవిష్యత్తు కోసం తమకు కూడా ఎస్‌టి, ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. మోతుగూడెం, సుకుమామిడి, తూలుగొండ, గొడ్లగూడెం, దబ్బగూడెం, కొత్తపల్లి, గూడూరు, గొందిగూడెం గ్రామాల చెందిన వారు కూడా ఇక్కడే పుట్టి పెరిగారని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. వలస వచ్చిన ఒడియా తెగవారికి ఎస్‌టి కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని, కానీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసే ముందు వారి కుటుంబ సభ్యలు దగ్గర నుంచి విచారణ జరిపి ఇవ్వాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు. ఈ గ్రామసభలో తహశీల్దారు, పంచాయతీ సెక్రెటరీ, సచివాల సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










