May 09,2023 00:51
కలెక్టర్‌ కార్యాలయం వద్ద దళితులు ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లి, గొర్రెపాడు దళితుల భూములు దళితులకే ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళితుల భూములు దళితులకు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ గత 30 యేళ్లకు పూర్వం కూకట్లపల్లి, గొర్రెపాడు గ్రామ దళితులకు అప్పట్లో అటవీ భూములను డీనోటిఫై చేసిన భూములు దళితులకు హక్కు కల్పిస్తూ పాస్‌ పుస్తకాలు లబ్ధిదారులకు అందజేశారు. గ్రామంలో అగ్రవర్ణ రెడ్డి కులస్తులు దళితుల వద్ద ఉన్న భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని సాగు చేసుకున్నారని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్‌ నుంచి మండల స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. గతంలో చేసిన పోరాటాల ఫలితంగా అక్రమంగా సాగులో ఉన్న వారికి పేరుకు మాత్రమే నోటీసులు ఇచ్చారు. భూములు ఖాళీ చేయించలేదు. ఇప్పటికైనా నూతనంగా వచ్చిన కలెక్టర్‌ చొరవ చూపి దళితుల భూములను అక్రమంగా అనుభవిస్తున్న పెత్తందారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే గ్రామంలో దళితులకు భూముల అప్ప చెప్పాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్‌, ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు, బల్లికురవ మండల కార్యదర్శి గొల్లపూడి అంజయ్య, భూ పోరాట కమిటీ నాయకులు వేల్పుల యోబు, తంగిరాల రాణమ్మ, తంగిరాల సామేలు, ఎం బాలేంద్ర, అంజిబాబు, యోహాను, నాగేంద్రం, బాబు, దళిత రైతులు పాల్గొన్నారు.