Jul 15,2023 21:35

వీరఘట్టంలో జరిగిన బస్సు యాత్రలో బాహాబాహీకి దిగిన టిడిపి కార్తకర్తలు, నాయకులు (ఫైల్‌)

ప్రజాశక్తి, పాలకొండ,పాలకొండ రూరల్‌ : ఒకప్పుడు పాలకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. 2009 నుంచి టిడిపికి ఎదురుగాలి వీస్తుంది. అయితే రాను రాను పార్టీ పరిస్ధితి అయోమయంగా మారుతుంది. ఈ నియోజకవర్గంలో కేడర్‌ బలంగా ఉన్నప్పటికీ, నాయకుల మధ్య సమన్వయం కుదరక కార్యకర్తలు చెల్లాచెదురవుతున్నట్లు ఆ పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు. 2019 ఎన్నికల నుంచి పార్టీలో ఈ గ్రూపు పోరు ఎక్కైంది. అధికారంలో లేకపోయినా నేతలు ఐక్యమత్యంగా లేకపోవడంతో కార్యకర్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణకు వ్యతిరేకంగా కొంతమంది నాయకులు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఇన్‌ఛార్జిగా జయకృష్ణ తమకు వద్దు అని, బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు పట్టుపట్టారు. అయితే ఇటీవలే రాష్ట్ర రాజధానిలో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు పాలకొండ నియోజకవర్గ నేతలతో జరిపిన సమీక్షలో అందరూ ఏకతాటిపైకి రావాలని, ఐక్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఇన్‌ఛార్జి జయకృష్ణ అసమ్మతి నేతలను కలుపుకుని పోవాలని సూచించారు. అధినేత చెప్పినా ఇక్కడ పరిస్థితి ఇసుమంతమాత్రం మారలేదు. యధావిధిగా గ్రూపు విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే జరిగిన బస్సుయాత్రలో ఈ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జయకృష్ణను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని ఆయన గ్రూపీయులు చెబుతుండగా, అభ్యర్థిగా ఇంకా ఎవర్నీ ప్రకటించలేదని అసమ్మతి నేతలు బహిరంగంగా చెబుతున్నారు. దీంతో అధినాయకుడు చెప్పినా కూడా గ్రూపుల పోరు తగ్గలేదు. ఎవరికి వారే యమునతీరే అన్నట్లు పార్టీ పరిస్థితి ఉంది. నాయకులే ఇలా ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏంటి అని, ఇలా అయితే పార్టీకి గత వైభవం తీసుకురావటం కష్టమని రాజకీయనాయకులు అభిప్రాయపడు తున్నారు.
కళాకు దూరం అవుతున్న నేతలు
ఈ ప్రాంతంలో బలమైన సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేత కిమిడి కళావెంకటరావుకు ఆ పార్టీ నేతలు దూరవుతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో టిడిపిలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆయన మీదే ఆధారపడి, ఇష్టం ఉన్నా లేకున్నా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉండేవారు. అటువంటిది తాజాగా ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అదే సామాజికవర్గానికి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. వర్గపోరును చక్కదిద్దాల్సిన నేత మౌనంగా ఉండడంతో పాటు ఒక వర్గాన్ని వెనకేసుకొస్తున్నారని, మరో గ్రూపునకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా టిడిపికి ఈ గ్రూపువిభేదాలు ఇబ్బందికరంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.