Oct 31,2021 13:14

'వెతకండి.. వెతికి పట్టుకోండి.. కొట్టండి..కొట్టి చంపేయండి' అరుపులకు మెలకువ వచ్చేసింది నాకు.
'అబ్బా.. సెలవు రోజు నిద్ర పోనీకుండా పొద్దునే ఈ వెర్రి అరుపులు ఏంటి?' కళ్లు నులుముకుంటూ లేచాను. ఈయన లేచి ఉదయపు నడక కోసం వెళ్లినట్లు ఉన్నాడు. బ్రష్‌ మీద పేస్ట్‌ వేసుకుని, కుడిచేత్తో పళ్లు తోముకుంటూ, ఎడంచేత్తో గిన్నెలో నీళ్లు పట్టి స్టౌపై పెట్టి, గ్యాస్‌ స్టౌ వెలిగించాను. నిద్ర లేవగానే కాఫీ, టీ కాకుండా వేడినీళ్లు తాగడం నాకు అలవాటు. బ్రష్‌ చేసుకుని, పుక్కిలించుకుంటుంటే మళ్లీ అరుపులు వినిపించాయి.
'అంతా జల్లెడేసి పట్టండి. ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టి, చంపండి' పెద్ద గొంతుకలతో అరుపులు, ఆ వెనువెంటనే కర్రలతో నలుగురైదుగురు ఎదురింటివైపు దూసుకుపోయారు.
'ఏం ఘోరం జరిగిందో ఏమిటో.. ఎవరికి ఏ ఆపద వొచ్చిందో.. కాస్త కంగారు వేసింది నాకు. నిరుపమ్‌ ఇంకా పడుకునే ఉన్నాడు. వాడు యూనిట్‌ టెస్ట్‌ పరీక్షలని, రాత్రి చాలాసేపు చదువుతూ ఆలస్యంగా నిద్రపోయాడు. గాఢనిద్రలో ఉన్న వాడిని లేపడానికి మనసొప్పలేదు నాకు. గబగబా వంటింట్లోకి వెళ్లి గ్యాస్‌ స్టౌ కట్టేసి, మొబైల్‌ తీసుకుని, వాకిలి తలుపుకు గొళ్లెం పెట్టి, ఎదురింటి వైపుకు వెళ్లడానికి రోడ్డు దాటాను.
ఏమిటో ఈ మధ్య ఏ ఘోరం జరిగినా విచారణ జరిగి, దోషికి చట్టపరంగా శిక్ష పడేలోగానే 'ప్రజాగ్రహాన్ని గౌరవించాలి!' అంటూ అనుమానితుడిని ఏదో ఒక రూపంలో చంపేస్తున్నారు. చేసింది తప్పే, ఘోరమే కావచ్చు, కానీ పశ్చాత్తాపం పడే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు.
ఆలోచిస్తూ ఎదురింటిలోకి అడుగు పెట్టాను. హాల్లో ఓ మూల ఉన్న మంచమ్మీద ఆంజనేయులు, ఆయన భార్య నర్సమ్మ గజగజా ఒణుకుతూ కనిపించారు. మరో పక్క ఎత్తుగా ఉన్న కుర్చీ మీద వాళ్ల కూతురు మౌనిక బిత్తరగా దిక్కులు చూస్తూ ఉంది. కర్రలతో వచ్చిన నలుగురు ఇల్లంతా కలియదిరుగుతూ దేనికోసమో వెదుకుతున్నారు.
'ఆంటీ ఏమైంది? ఎందుకు మీరు అలా భయపడుతున్నారు? వీళ్లు ఏం వెతుకుతున్నారు?' నా ప్రశ్నలతో కొరకొరా చూశాడు, ఆ ఇంటి యజమాని ఆంజనేయులు. మరి వారంక్రితం నాకూ ఆయనకూ మధ్య జరిగిన గొడవ ఇంకా మర్చిపోయినట్లు లేరనుకున్నాను.

                                                                ***

దీపావళి రోజు సాయంత్రం మన సంస్కృతి, సాంప్రదాయాలను పిల్లలు మర్చిపోకూడదు. అదే సమయంలో మన చర్యలు సమాజానికీ హాని చేయకూడదు అని ఇంటి ముందు వరండాలో ప్రమిదల్లో నూనె దీపాలు వెలిగించి చాలా కొద్దిగా, ఎక్కువ పొగరాని చిన్నచిన్న టపాకాయలను మా చిట్టితండ్రి నిరుపమ్‌తో కాల్పిస్తున్నాను.
ఎదురింటి నుంచి చెవులు చిల్లులు పడేలా శబ్దాలు, విపరీతమైన పొగ.. వీధి అంతా వ్యాపిస్తోంటే ఓర్చుకోలేక వాళ్ల ఇంటిముందుకు వెళ్లాను.
'అన్ని టపాకాయలు కాలుస్తున్నారు మీరు. విపరీతమైన శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం అవుతోంది. పండుగ సరదాకి కొన్ని కాల్చవచ్చు, కానీ అన్ని కాల్చి, డబ్బు దండగ. మరోపక్క పర్యావరణ కాలుష్యమూ, ఇతరులకూ ఇబ్బంది కదా?' అని అన్నాను. దీంతో వారికి కోపం వచ్చింది.
'మా ఇంటి ముందు, మా ఇష్టం వొచ్చినట్లు కాలుస్తాం. అడగడానికి నువ్వెవరు? పెద్ద సంఘ సంస్కర్త బయలుదేరింది' అంటూ గొడవపడ్డారు వాళ్లు.
నేనెప్పుడో అది మర్చిపోయాను. ఆయన ఇంకా మరువనట్లు ఉంది.
'శారదక్కా.. మరి.. మరి.. ఇంట్లోకి పాము దూరింది. నువ్వు జాగ్రత్త అక్క!' భయపడుతూ కుర్చీలో మరింత ముడుచుకుని కూర్చుంది మౌనిక.
'అయ్యో. ఇంట్లోకి పాము వచ్చిందా! మీరు భయపడకండి. మనకి పాము అంటే ఎంత భయమో, పాముకూ మనుషులంటే అంతే భయం. ఇక్కడే ఎక్కడో దాగి ఉంటుంది అరుపులకు. నేను ఇప్పుడే స్నేక్‌ స్నాచర్‌ వాళ్లకి ఫోన్‌ చేస్తాను. వాళ్లు వచ్చి పాముని పట్టుకుని, తమతో పాటు తీసుకువెళతారు' అంటూనే సిటీలో ప్రముఖ సినీనటులు సాయికిరణ్‌ వాళ్లు నడుపుతున్న స్నేక్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ వాళ్ల నెంబర్‌కి ఫోన్‌చేసి విషయం చెప్పి, లొకేషన్‌ షేర్‌ చేశాను.
ఆంజనేయులు నా వైపు చీదరింపుగా చూస్తూ 'ఆ నువ్వు ఫోన్‌ చేయగానే వాళ్లు వచ్చేస్తారు.. వాళ్లు వచ్చే లోపల ఆ పాము బయటికి వచ్చి, ఎవరినో ఒకరిని కాటు వేస్తుంది. దాన్ని పట్టి, చంపేస్తే కానీ, నా మనసుకు శాంతి ఉండదు.' ఇంకా వణుకుతూనే మంచం కోడు మరింత గట్టిగా పట్టుకున్నాడు.
'అంకుల్‌.. ఒక్క పది నిముషాలు ఓర్చుకోండి!' అంటూ పాముని వెదుకుతున్న నలుగురితో పాటు ఇల్లంతా తిరుగుతున్నాను నేను. స్నేక్‌ స్నాచర్లు వచ్చేవరకూ, ఆ పాము కనబడకూడదని, లేకుంటే అది విషరహిత పాము అయితే అనవసరంగా ఓ ప్రాణిని చంపినట్లు అవుతుందన్న ఆందోళనతో.
అంతలోనే వంటింటి అటక మీద నుంచి ఇస్తరాకుల కట్ట కింద పడింది. అందరం అటక మీదికి చూశాం. నల్లగా, అక్కడక్కడా గోధుమరంగు మచ్చలతో ఇంత పొడుగు పాము మెలికలు తిరుగుతూ, రెండుగా చీలినట్లున్న పొడవైన నాలుకను బయటపెడుతూ, 'హిస్‌ హిస్‌' మంటూ బుస కొడుతోంది. ఒక్క క్షణం అందరినీ భయం ఆవరించింది.
'పా.. పా.. పాము.. అదిగో అటక మీద.. కింద పడుతుంది. కొట్టండి..! చంపండి..!!' అంటూ అరుస్తున్నారందరూ గోల గోలగా.
స్నేక్‌ స్నాచర్లు త్వరగా వస్తే బాగుండు. అది విషసర్పం అయితే ఎవరికైనా ప్రమాదం జరుగుతుంది. నాలో కూడా ఆందోళన మొదలైంది.
అది అటక మీదే మెలికలు తిరుగుతోంది. 'ఇంకా ఆలోచిస్తారేంది.. పాము కనిపించింది కదా కొట్టండి.. చంపేయండి' అంటూ హాల్లోనించి అరుస్తున్నాడు ఆంజనేయులు.
పాము అటక మీద నుంచి కిందపడి, చూస్తుండగానే క్షణాల్లో మెలికలు తిరుగుతూ హాల్లోకి వెళ్లింది. పాముని చూడగానే నర్సమ్మ, ఆంజనేయులు వాళ్ల పైప్రాణాలు పైనే పోయాయి. వచ్చిన వాళ్లు హాల్లోకి పరుగెత్తి కర్రలతో పాముని కొట్టబోయే క్షణంలో 'ఆగండి..' అని అరుస్తూనే సరిగ్గా ఇంటి ద్వారం ముందు పడగవిప్పి, ఉన్న మూడు అడుగుల పాముని పడగ కింద ఓ చేత్తో, తోకని మరో చేత్తో గట్టిగా పట్టుకుని, ఒడుపుగా నల్లటి పెద్ద ప్లాస్టిక్‌ కవర్లో వేసి, క్షణాల్లో కవర్‌ని గట్టిగా పురికొస తాడుతో బిగించి కట్టేశారు. వాళ్లు వచ్చిన వాహనం డిక్కీలో పెట్టి డిక్కీ మూసేశారు.. స్నేక్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ నుంచి వచ్చిన ఇద్దరు మనుషులు.
అదంతా అవాక్కై చూస్తున్న ఆంజనేయులు దంపతులు కొద్దిసేపటికి తేరుకున్నారు. అతనికి ఇంకా గుండె దడ తగ్గలేదు.
'సమయానికి మాకు ఫోన్‌ చేసి మంచిపని చేశారు మేడం. లేకుంటే ఆ పాము ప్రాణాలు తీసేవాళ్లు. అసలు పాము కాటు వేసి, చనిపోయిన వారి కంటే, పాము అంటే భయంతో గుండె ఆగి చనిపోయినవారి సంఖ్యే ఎక్కువ. ఎప్పుడు పాములు కనిపించినా కాస్త ధైర్యంగా, మరికాస్త సంయమనంతో మాకు ఫోన్‌ చేస్తే, మేము చాలా త్వరగా స్పందించి, వచ్చేస్తాం' అన్నారు వాళ్లు నా వంక అభినందన పూర్వకంగా చూస్తూ.
ఇక తప్పదన్నట్లు ఆంజనేయులు కూడా వారికి కృతజ్ఞతలు తెలిపాడు. వాళ్లు స్నేక్‌ ఫ్రెండ్స్‌ విజిటింగ్‌ కార్డు ఆంజనేయులుకి ఇచ్చి, వాళ్ల వాహనంలో వెళ్లిపోయారు. ఆ పాముని దూరంగా అడవుల్లో వొదిలేస్తారని వాళ్ల మాటల్లో తెలిసి, సంతోషం కలిగింది నాకు.
ఆంజనేయులు నా వంక ముభావంగా చూస్తూ ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఆయన భార్య నర్సమ్మ మాత్రం 'వాళ్లకి ఫోన్‌ చేసి, మంచిపని చేశావు తల్లీ' అంటూ ఓ కృతజ్ఞతా చూపు నా వైపు విసిరి వెళ్లింది.
వాళ్ల చూపులను పట్టించుకోకుండా ఇంటికి వచ్చేశాను నేను. ఎందుకో ఈ రోజు ఓ ప్రాణిని కాపాడాను అనే తృప్తి కలిగింది.
నాకెవరితోనూ పనిలేదు అంటూ కాలం ముందుకు పోయి, వారం రోజులను గతంలోకి నెట్టేసింది.

                                                              ***

పొద్దున్నే లేచి స్నానాదులు కానిచ్చి, దేవుడి గదిలో దీపం అగరొత్తులు వెలిగించాను. ఆయన హాల్లో నిరుపమ్‌కి త్రికోణమితి లెక్కలు చెప్తూ ఉన్నాడు. నిరుపమ్‌కి బూస్ట్‌, ఆయనకి కాఫీ ఇచ్చి, నేనూ కాఫీ తెచ్చుకుని దినపత్రిక చూస్తూ నింపాదిగా కాఫీ తాగాను.
తలస్నానం చేసిన జుట్టు తడి ఆర్పుకొని, దువ్వి, రబ్బర్‌ బ్యాండ్‌ వేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో నుంచి రెండు పాల పాకెట్లు తీసి కవర్లో వేసి, కత్తెర, టెంకాయ, కొన్ని పూలు కూడా కవర్లో వేసుకుని, ఆయనకి చెప్పి, ఇంటి నుండి బయట పడ్డాను.
నేను వెళ్లేటప్పటికే గుడి బయట వరకూ పెద్ద క్యూ కట్టి ఉన్నారు. అందరూ చేతిలో పాల పాకెట్లతో నాలుగు చాంతాళ్లంతా పొడవున్న క్యూని చూడగానే నీరసం ఆవరించింది. కానీ తప్పదు. వరుసలో నిలబడ్డాను. చిన్నప్పుడు అమ్మ నాగులచవితి రోజు ఉపవాసం ఉండి, పుట్టకు వచ్చి పాలు పోసి, నాగేంద్రస్వామికి మొక్కేది. అమ్మతో పాటు నేనూ పుట్ట దగ్గరకు వెళ్లేదాన్ని.
అప్పుడే నేను 'పుట్టలో ఇంతమంది పోసే పాలు పాము తాగుతుందా అమ్మ? పాము అక్కడ ఉంటే నాగులచవితి రోజే ఎందుకు పోస్తారు? మిగతా రోజుల్లో దానికి ఆకలి కాదా? రోజూ ఎందుకు పాలు పోయరు?' ఇలా అడిగేదాన్ని.. దానికి అమ్మ కోప్పడేది.
'నమ్మకంతో ఈ రోజు పుట్టలో పాలు పోస్తే, నాగేంద్రస్వామి పసిబిడ్డలను కాపాడతాడంట. నువ్వు నాతో వితండవాదం చేయకుండా నాగులచవితి రోజు పుట్ట దగ్గరకు వచ్చి, పాలు పొయ్యి. ఇది నువ్వు చేసే ఇష్టమైన పని నాకు. నువ్వు ప్రతి నాగులచవితికీ పుట్టకు వచ్చి, పాలు పోస్తానని మాట ఇవ్వు' అని అమ్మ నా దగ్గర మాట తీసుకోవడం, అమ్మ మనసు నొప్పించలేక నేను మాట ఇవ్వడం వల్ల.. ఈ రోజు నేను ఈ వరుసలో నిలబడాల్సి వచ్చింది.
క్యూ లైన్‌ ఏమాత్రం తరగడం లేదు. వెనక్కి వెళ్లలేను.. ముందుకి పోలేను. ఇంతలో పెద్దగా 'కాస్త త్వరగా ముందుకు పోండి. పాలు పోసేసినోళ్లు పుట్ట దగ్గరే నిలబడకుండా కదలండి' అని వినపడడం, సరిగ్గా అదే సమయానికి అతను వెనక్కి తిరిగి, నన్ను చూడడం జరిగింది.
అతన్ని చూడగానే నాకెందుకో నవ్వు వచ్చింది. వారం క్రితం.. పామును చంపవద్దు. స్నేక్‌ స్నాచర్లు చంపకుండా పట్టుకుపోతారు అన్న నేను, పాము కాటుకు భయపడి పామును కర్రలతో కొట్టండి, చంపేయండి.. అన్న మా ఎదురింటి ఆంజనేయులు ఇద్దరం ఒకే వరుసలో ఉన్నాం మరి.
అతను కొరకొరా చూస్తున్నాడు నా వంక. నేను పుట్ట దగ్గరకు రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అతనికి, ఆయన భార్య నర్సమ్మకి. వాళ్ల దృష్టిలో నేను దేవుడిని నమ్మని హేతువాదిని మరి.
పాల పాకెట్లు అక్కడే కత్తిరించడం, పుట్ట మీద పాలు కుమ్మరించడం, నేల పాలైన పాలతో పుట్ట చుట్టూరా మట్టినేల చిత్తడి చిత్తడిగా తయారైంది. పాలతో పాటు పసుపు, కుంకుమ పాకెట్లు కత్తిరించి, పుట్టమీద వేసేస్తున్నారు. ఖాళీ పాల కవర్లు, పసుపు, కుంకుమ కవర్లు, టెంకాయ పీచు, గుట్టలు గుట్టలుగా కొన్ని, చెల్లాచెదరుగా మరికొన్నిటితో పుట్ట చుట్టూ ఉన్న ప్రాంతమంతా నిండిపోయింది. సాంబ్రాణికడ్డీల పొగ దట్టంగా అలుముకుంటోంది.
ఊపిరాడక నాకు దగ్గు వచ్చింది. త్వరగా పాలు పుట్టలో పోసేసి పోదామనుకుని ఇద్దరు, ముగ్గురిని దాటుకుని, ముందుకు వెళ్లబోయాను. ఎదురింటాయన అమాంతం నన్ను వెనక్కి తోసేశాడు. చిత్తడి నేలలో కాలుజారి పడబోయి, అతికష్టం మీద నిలదొక్కుకున్నాను.
'ఏమ్మా.. నీకు భక్తి లేదు, ముక్తి లేదు. పుట్టలో పాలు పోసేదానికి వచ్చావా? మేము గంట నుంచి వరుసలో నిలబడి ఉన్నాం. మా కంటే ముందు పోవాలంటే యెట్లా నువ్వు?' ముఖానికి గంటు పెట్టుకుని అన్నాడు ఆయన.
ఇక ఓర్చుకోలేక 'ఆ రోజు పాము కనిపిస్తే కొట్టండి, చంపండి అన్నది మీరు కదా..! మీరు మహాభక్తులా?' అన్నాను.
'మరి పాము కనిపిస్తే చంపకుండా ఉంటామా? పాము పామే.. భక్తి భక్తే' అని అతని మాటలకి కొందరు వంత పాడారు.
వాళ్ల విచిత్ర ధోరణికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు నాకు. మాటకు మాట పెరిగింది. మరి వాళ్లని అని నేను చేస్తున్నది ఏమిటి? ఏదో తెలియని విరక్తి కలిగి, గిరుక్కున వెనక్కి తిరిగి, ఇంటికి వచ్చేశాను. పాము తన పాత చర్మం కుబుసాన్ని వదిలి వేసినట్లు.. ఆ రోజుతో నాలో ఉన్న కొన్ని భ్రమలను వదిలి వేశాను.
పాల పాకెట్లతో వచ్చిన నన్ను చూసి ఆయన 'ఏంటి శారద..! పుట్టలో పాలు పోయలేదా..? ఇంటికి తెచ్చేశావు' పేపర్‌లో నుంచి ఒకసారి తల బైటపెట్టి మళ్లీ పేపర్లో తల దూర్చేశాడు తాబేలులా.
నేను ఏం జవాబు చెప్పకుండా ఫ్రిడ్జ్‌ తీసి, ఇంకో రెండు పాల పాకెట్లు తీశాను. మొత్తం ఓ పెద్ద గిన్నెలో పోసి పాలు కాచి, మరోపక్క స్టౌపై మూడు కేజీల బియ్యం కుక్కర్లో పెట్టి అన్నం వండాను. సగం అన్నంలో పాలుపోసి బెల్లం, యాలుకుల పొడి, పచ్చ కర్పూరం, ముంతమామిడి పప్పు, కిస్మిస్‌ వేసి పొంగలి చేశాను. మిగతా అన్నంలో పెరుగు వేసి, కలిపి ఆవాలు, ఇంగువ, మినపప్పు, మిర్చి, కరివేపాకు తిరగమోత వేసి దద్దోజనం చేశాను.
ఇంట్లో ఉన్న పార్సిల్‌ కవర్లలో పొంగలి, దద్దోజనం పెట్టి దారాలు కట్టాను. పది ప్యాకెట్లు అయ్యాయి. పది ప్యాకెట్లు ఓ సంచిలో వేసుకుని, ఆయనకి చెప్పి నిరుపమ్‌తో సహా బయటకు వెళ్లాం.
వీధులన్నీ తిరుగుతూ, అక్కడక్కడా ఏ దిక్కూలేక రెక్కలు తెగిన ఒంటరి పక్షుల్లా, అభిమానం చంపుకుని ఆకలితో చేయి చాపుతున్న ముసలివారి చెంతకు వెళ్లి పొంగలి, దద్దోజనం పాకెట్లు ఇచ్చాను. కొంత డబ్బులు వారి చేతికి నిరుపమ్‌ చేత ఇప్పించాను. వాళ్ల కళ్లల్లో కనపడిన తృప్తిలో నాకు చల్లగా దీవించే దేవుడు కనిపించాడు.

వంజరి రోహిణి
90005 94630