ప్రజాశక్తి - నరసరావుపేట : కుబేరులకు కోట్ల రాయితీలు ఇస్తూ పేదలపై పన్నుల భారాలు మోపుతున్న బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ పిలుపునిచ్చారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారభేరీని గురువారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని చంద్రబాబు నాయుడు కాలనీలో నిర్వహించారు. విజరు కుమార్ మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం దేశంలో బిజెపి మత చిచ్చు పెడుతోందని, విధ్వేషాలు రగిలిస్తున్న మతోన్మాద బిజెపికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. బిజెపి పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ కూటమి విచ్ఛిన్న రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని అన్నారు. బిజెపి అధికారంలోకి రాకముందు రాష్ట్రానికి అనేక హామీలనిచ్చినా అధికారంలోకి వచ్చాక విస్మరించిందని విమర్శించారు. బిజెపి విచ్ఛిన్నకర విధానాలకు వ్యతిరేకంగా సాగే పోరాటాల్లో ప్రజలంతా కలిసి రావాలని ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో శుక్రవారం నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. సభకు రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఇతర నాయకులు హాజరవుతారని తెలిపారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు మాట్లాడుతూ దేశంలోని అన్ని రంగాల ప్రజలను మోడీ మోసం చేశారని అన్నారు. కేంద్రం ఆదేశాలతో రాష్ట్రంలోనూ ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం చెత్త పనులు వేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి షేక్ సిలార్ మసూద్, జిల్లా కమిటీ సభ్యులు డి.శివకుమారి, నాయకులు నాగమ్మ భారు, సుభాష్ చంద్రబోస్, మస్తాన్‌వలి, హుస్సేన్, సిపిఐ పట్టణ కార్యదర్శి వి.వెంకట్, నాయకులు యు.రంగయ్య, రాజు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-బెల్లంకొండ : సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారభేరీలో భాగంగా ఆదివారం క్రోసూరులో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు క్రోసూరు, బెల్లంకొండ మండలాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. రవిబాబు మాట్లాడుతూ నిరంతరం దేశభక్తి గురించి మాట్లాడే బిజెపి ప్రభుత్వం దేశ ప్రజానీకానికి ద్రోహం చేస్తు కార్పొరేట్లకు ఉడిగం చేస్తోందని విమర్శించారు. బిజెపి ద్రోహాన్ని ప్రజలు గుర్తించి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు టి.హనుమంతరావు, చిన్నం పుల్లారావు, షేక్ ముస్తఫా, సిహెచ్.ఆంజనేయులు, ఎం.సాయి, టి.జగన్నాథం పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు: మోడీ పాలనలో భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికపరంగా ప్రమాదంలో పడిందని సిపిఎం, సిపిఐ నాయకులు ఆందోళ వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచారభేరిలో భాగంగా గురువారం స్థానిక మంగళగిరి రోడ్డులోని గడ్డిపాడు వద్ద బహిరంగ సభ నిర్వహించారు. సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్, సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్ మాట్లాడుతూ మోడీ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి దేశ సార్వభౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని పణంగా పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలను విమర్శించిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మనుధర్మాన్ని అమలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనం వెలికి తీస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ధరలు అదుపు చేస్తామని ప్రజలకు ఇచ్చిన పలు హామీలు విస్మరించి, ప్రజలపై ఇంకా భారాలు మోపారని మండిపడ్డారు. మోడీని గద్దె దించి, దేశాన్ని కాపాడుకోవటానికి ప్రజలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, అరుణ్‌కుమార్, సిపిఎం నాయకులు కె.శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు, ఎంఎ చిష్టీ, రాధా పాల్గొన్నారు.










