Mar 12,2023 23:37

మీడియాతో మాట్లాడుతున్న చిత్ర యూనిట్‌ సభ్యులు

ప్రజాశక్తి- కలెక్టరేట్‌, విశాఖ : దండమూడి బాక్స్‌ఆఫీస్‌ పతాకంపై దండమూడి అవనీంద్ర కుమార్‌ నూతనంగా నిర్మించిన కథ వెనుక కథ చిత్రం యూనిట్‌ నగరంలో సందడి చేసింది. నగరంలోని ఓ హోటల్లో ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్ఫ్లుయెన్సర్‌స్‌తో చిట్‌ చాట్‌ చేశారు. అనంతరం చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ, కథ వెనుక కథ చిత్రం ఈనెల 24న విడుదలకు సిద్ధమైందని తెలిపారు. ఆద్యంతం అందరినీ ఆకట్టుకునే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందించమని చెప్పారు. అన్ని తరగతుల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దినట్లు తెలిపారు. అనంతరం చిత్ర హీరో (ఓ పిట్టకథ ఫేమ్‌) విశ్వంత్‌ మాట్లాడుతూ, తన కెరియర్లో ఈ చిత్రం ఒక మైలురాయిలుగా నిలుస్తుందన్నారు. ఇంతకుముందు ఎప్పుడూ చెయ్యని వినూత్నమైన పాత్రను ఇందులో పోషించానన్నారు. కమెడియన్‌ మధునందన్‌ మాట్లాడుతూ పలు చిత్రాల్లో నటించిన తాను, ఈ చిత్రంలో వైవిధ్యభరితమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య, హీరోయిన్లు శ్రీజిత ఘోష్‌, శుభశ్రీ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.