Oct 18,2020 07:33

- రాజాబాబు కంచర్ల

9490099231

న్ని పనులున్నా... పొద్దున్నే పేపర్‌ చదవడం నారాయణకు అలవాటు. రైతులు, వ్యవసాయం... దీనికోసం ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా... వంటి విషయాలను మాత్రం చదువుతాడు. అందులో తాను అర్థం చేసుకున్నది ముందు తన భార్యకు, ఆ తర్వాత మిగతా రైతులకు చెబుతాడు.
'ఇయ్యాల ఏంటి రాసేరేంటి పేపర్లో' అంటూ నారాయణకు కాఫీ అందించి, తనకో గ్లాసుతో ఆయనకు ఎదురుగా పీట మీద కూర్చుంది ఆయన భార్య లచ్చమ్మ. ఇది రోజువారి దినచర్య వాళ్లకి.
'ఏటుందే... వ్యవసాయ బిల్లులు తెచ్చేడంట ఆ మోడీ. ఇప్పుడు మన పంటలు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చంట'..
'బాగానే వుంది సంబడం. ఇక్కడ అమ్ముకోడానికే గతిలేదు. ఇంక దేశమంతా యాడకెల్లి అమ్ముతాం. కళ్లంలో అమ్మితేనేమో... ఆ షావుకారు బేరాలాడతాడు. సగానికి సగం తెగ్గొస్తాడు. ఆ మార్కెట్టుకు తీసుకుపోతే... ఎప్పుడు కొంటారో తెల్వదు. ఎన్నిరోజులు పడిగాపులు పడాలో తెల్వదు. ఇంతాజేత్తే.. చేతికొచ్చేదెంత..? పంట కోసం చేసిన అప్పులు తీరవాయె...' అని దీర్ఘం తీసింది.
'కానీ... ఇందులో ఏదో తిరకాసుందే... అర్థమై చావట్లేదు...'
'ఇట్టాంటియన్నీ చెప్పడానికి ఆ మేస్టార్‌ వున్నాడుగా ఎల్లెల్లు... ఇంకా చేనెందుకు... పనెందుకు..' అంటూ లోపలికి వెళ్లింది లచ్చమ్మ.
నారాయణకి అంతా గందరగోళంగా వుంది. 'పంజాబులో రైతులంతా టాక్టర్ల మీదొచ్చి ధర్నాలు చేత్తన్నారంట. మన రాష్టంలో ఎవరూ అట్టా చెయ్యడంలేదెందుకో..? పొద్దు కుంగినాక ఇదేదో మేస్టారునే అడగాలి. ముందైతే పొలం బోవాలా...' అనుకుంటూ లేచాడు నారాయణ.


***


ప్రభాకర్‌ మాస్టారంటే ఆ ఊరిలో అందరికీ గౌరవం. ఈ పల్లెటూరి స్కూల్లో వుండే ఒకే ఒక్క మాస్టార్‌ ఆయన. పిల్లలకీ ఆయనంటే ఇష్టమే. మనుషుల గురించి, దేశం గురించి, దేశ రాజకీయాల గురించి, ఉద్యమాల గురించి మంచి మంచి కథలు చెప్తాడాయన.
ఆ ఊరిలో చిన్న చిన్న గొడవల్ని కూడా ఆయనే సర్దుబాటు చేసి, రాజీ కుదిర్చి పంపిస్తుంటాడు. ఇది ఆ ఊరి పెత్తందార్లకు కడుపుమంటగానూ వుంటుంది. అయితే, ఆయన కమ్యూనిస్టు అని, పట్టణం వెళ్లినప్పుడల్లా... వాళ్ల నాయకుల్ని కలిసొస్తాడని గుసగుసలాడుతుంటారు. అలగా జనాన్నేసుకొని తిరుగుతుంటాడంటూ గుర్రుగా వుంటారు. ఇది తెలిసినా మాస్టారు తన పని తాను చేసుకుంటూ పోతాడు.
కమ్యూనిజాన్ని, అభ్యుదయ భావాలను అణువణువునా జీర్ణించుకున్న ప్రభాకర్‌.. పార్టీ సభ్యుడనే విషయం చాలామందికి తెలియదు. ప్రతివారం సిటీకి వస్తాడు... నాయకుల్ని కలుస్తాడు. సాయంత్రం సమయంలో ఏదోక పుస్తకం చదువుకుంటూ ఇంటిపట్టునే వుంటాడు. అందుకే ఆయనకోసం వచ్చే రైతులు, ఇతర జనాలు ఆ సమయంలోనే వస్తుంటారు.
పొలం పనులు ముగించుకొని తాపీగా వచ్చిన నారాయణ... 'నమస్కారం మేస్టారు' అంటూ ప్రభాకర్‌ కుర్చీ పక్కనే వున్న బెంచి మీద కూర్చున్నాడు.
చదువుతున్న పుస్తకం పక్కనపెట్టి.....'నమస్తే.. నమస్తే... ఏంటి నారాయణ... ఏంటి విషయం?' అన్నాడు.
'పొద్దున పేపర్‌ చదివినకాడ్నించి పెద్ద గందరగోళంగా వుంది సారూ బుర్ర.'
'అదేం... ఏం చదివావేంటి?'
'అదే... సారూ వ్యవసాయ బిల్లులు ఏవో ఆమోదించారంట. ఇక రైతులంతా పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చంట. ఈ తిరకాసేంటో అర్థమవలేదయ్యా... పైగా ఇక్కడ అమ్మితేనే సరైన ధర రాదు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు కూడా తీరడంలా అన్నాడు నారాయణ.
'నేనూ దాని గురించే ఆలోచిస్తున్నా... మీ అందరికీ ఈ విషయం ఎలా చెప్పాలా అని'.
ఈలోపు మరో నలుగురైదుగురు వచ్చారు. వాళ్లలో పట్టణంలో చదువుకుంటున్న ఇద్దరు యువకులు కూడా వున్నారు. వీరిద్దరూ ఒక విద్యార్థి సంఘం కార్యక్రమాల్లో తిరుగుతుంటారు.
మాస్టారు ఇంకా ఏమీ చెప్పక ముందే...
'అవునన్నా... స్వేచ్ఛా మార్కెట్‌ పేరుతో మొత్తం చిన్నాచితక రైతుల్ని బిచ్చగాళ్లను చేయాలని చూస్తున్నారు' అంటూ కాస్త ఆవేశంగా చెప్పాడు వాళ్లల్లో ఒక యువకుడు.
ఆ మధ్య రాత్రికి రాత్రే నోట్ల రద్దు అంటూ రచ్చ చేశారు. మళ్లీ ఏ ఉప్రదవం వచ్చిపడుతుందోననే ఆందోళన, మాస్టారు ఏమి చెబుతాడోననే ఆతృత అక్కడున్న వారి ముఖాల్లో కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
'అవును మీ ఆందోళన నిజమే... ఇప్పుడు మొత్తం వ్యవసాయ రంగమే సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి రాబోతోంది' అన్నాడు ప్రభాకర్‌ కాస్త గంభీరంగా...
'ఇట్టా అయితే... ఈ రైతులు, కూలిజనం ఏంగావాలన్నా..? మనందరం ఒకటి రెండెకరాల రైతులమే. ఏదో మట్టిమీద మమకారంతో దాన్నే నమ్ముకున్నోల్లం. పండే నాలుగ్గింజల్ని అమ్ముకోడానికి ఊరుకాని ఊరు పోవాలా? ఇదెట్టా సాధ్యం అన్నా..?' అన్నాడొక యువ రైతు.
'నీ ఆందోళన నిజమే రాజన్నా... మీకులా ఒకటి రెండెకరాలు భూమి వున్న రైతులు మన దేశంలో 85 శాతం మంది వున్నారు. ఇప్పుడు ఈ రైతులంతా బజారున పడతారు. అంతంత మాత్రంగా వున్న మన మార్కెట్‌ యార్డులు కూడా నిర్వీర్యం అయిపోతాయి. రైతులు పంట అమ్ముకోడానికి వున్న ఈ కాస్త ఆసరా కూడా స్వేచ్ఛా మార్కెట్‌ పేరుతో లేకుండా పోతుంది. ఇదంతా రైతుల్ని భూమి నుండి గెంటేసే ప్రయత్నం...
రైతులకు స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇచ్చి, మీకు ఆధారంగా వున్న మార్కెట్‌ యార్డులు పీకెయ్యడం, సబ్సిడీలు ఎత్తేయడం, విత్తనాలు, ఎరువుల ధరలు పెంచడం చేస్తారు. వ్యవసాయ బోర్లుకి మీటర్లు పెట్టి, మీరు వాడే నీటికి కూడా బిల్లులు వసూలు చేస్తారు. మీ అంతట మీరే వ్యవసాయం చెయ్యలేక భూముల్ని వదిలేసి పొయ్యేలా చెయ్యడానికే ఇవన్నీ...
ఈ స్వేచ్ఛా మార్కెట్‌ కూడా అంతే... రైతులకు ఎలాంటి రక్షణ, భరోసా కల్పించకుండా, దేశంలో ఎక్కడైనా నీకు నచ్చిన రేటుకు నీ ధాన్యం అమ్ముకోవచ్చు అంటే... గిట్టుబాటు ధర కోసం నువ్వు ఎంత దూరం వెళ్లగలవు? నీ ధాన్యం అమ్ముడయ్యే వరకు ఎక్కడ నిల్వ చేయగలవు? ఇదంతా నీలాంటి చిన్నా చితకా రైతుల్ని దివాళా తీయించి, వ్యవసాయం నుండి గెంటేసే ప్రయత్నం. స్వేచ్ఛా మార్కెట్‌ అంటే... సింహాలు యధేచ్ఛగా తిరిగే అడవిలాంటిది. ఈ అడవిలో సింహాలకు, మేకలకు ఒకే రకమైన స్వేచ్ఛనిస్తే... అది ఎవరికి ఉపయోగం... సింహాలకే కదా! మరి మేకలకు రక్షణ ఎక్కడుంటుంది? మేకలను రక్షించాలంటే... సింహాలకైనా కంచె వెయ్యాలి, మేకలకైనా కంచె వెయ్యాలి. బలవంతులూ, బలహీనులూ వున్న ఈ సమాజంలో ఒక సమన్యాయం అమలు కావాలంటే, బలవంతులకు కొన్ని ఆంక్షలు వుండాలి. బలహీనులకు కొంత రక్షణ వుండి తీరాలి. అప్పుడు బలహీనులకు న్యాయం జరుగుతుంది. దోపిడీ నుంచి, ఆటవిక న్యాయం నుంచి విముక్తి కలుగుతుంది.'
'దేశానికి అన్నం పెట్టే రైతుని వ్యవసాయం నుండి దూరం చేస్తే... ప్రభుత్వానికి ఉపయోగం ఏంటి సారూ..?' అన్నాడు నారాయణ.
'ఎందుకు లేదు... చాలానే వుంది. ఈ ప్రభుత్వాల్ని వెనకుండి నడిపించే కార్పొరేట్లకు లాభం. లక్షల కోట్ల ఆస్తులున్న కార్పొరేట్లు ఒకపక్క.... లక్షల్లో అప్పులున్న కోట్లాదిమంది రైతులు ఇంకోపక్క వున్న సమాజం మనది. ఈ అసమానతల్ని సరిచేయడానికి బదులు... దేశంలోని వనరులను, ప్రజల శ్రమను దోచుకోడానికి, స్వేచ్ఛ అనే పదాన్ని, ఆ భావనను ఒక ముసుగులా వాడుతున్నారు మన పాలకులు. రైతులు పండించే ధాన్యానికి బదులు పవ్వులు, పండ్లు, వాణిజ్య పంటలు పండించి, విదేశాలకు ఎగుమతి చేసి, డాలర్లు సంపాదిస్తారు. ఇంకా చెప్పాలంటే రెండు పంటలు పండే భూములను రొయ్యల చెరువులుగా మార్చి, అవి సాధారణ పంటలకు పనికిరాకుండా చేసినట్లే... ఇప్పుడు ధాన్యం పండే భూముల్లో కార్పొరేట్‌ వ్యవసాయం చేస్తారు.'
'అయ్యా... ధాన్యం పండించకపోతే, మరి ఈ జనానికి అన్నం ఎట్టా..?' ఇంకో రైతు ఆవేదనగా
అడిగాడు.
'ధాన్యం కోసం ఇతర దేశాలపై ఆధారపడతారు. దిగుమతి చేసుకుంటారు. ఈ క్రమంలో మనలాంటి బక్క ప్రాణాలు అంత రేటు భరించలేక కడుపులు కాల్చుకోవడమే. కార్పొరేట్లు మాత్రం ప్రభుత్వాల అండతో కోట్లాది రూపాయలు కూడబెట్టుకుంటారు. అందుకే మనమంతా ఈ వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకించాలి. రైతులు తాము పండించిన పంటకు రైతే గిట్టుబాటు ధర నిర్ణయించుకునే పరిస్థితి రావాలి. నిజమైన స్వేచ్ఛ అంటే... దోపిడీ నుంచి, వర్గ అణచివేత నుంచి, వర్గ వైరుధ్యాల నుంచి విముక్తి కలిగించడం. కానీ, ప్రభుత్వం చెబుతున్న స్వేచ్ఛ దీనికి విరుద్ధం. అందుకే మనమంతా రైతుల్ని కూడగట్టి, వారిని కదిలించాలి. జరుగుతున్న అన్యాయం వారందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. సాధారణ ప్రజల మద్దతు సంపాదించాలి' అని ఆవేశంగా వారికి అర్థమయ్యేలా చెప్పాడు.
మాస్టారు మాట్లాడుతుండగానే మరో పదిమంది వరకూ రైతులు పోగయ్యారు. వారంతా ఆసక్తిగా విన్నారు. యువకులైతే మాస్టారి ప్రసంగానికి ఊగిపోయారు.

***


మాస్టారి ఇంటి దగ్గర రైతులంతా సమా వేశమైన సంగతి ఆ ఊరి భూస్వాములకు తెలియనే తెలిసింది. ఆ గ్రామంలోని నలుగురైదుగురు పెద్ద రైతులు ఆ రాత్రే సమావేశమయ్యారు. గ్లాసులు నిండుతున్నాయి... ఖాళీ అవుతున్నాయి... ఎవరూ ఏమీ మాట్లాడటంలేదు. గ్లాసులు ఖాళీ అయ్యే కొద్దీ కిక్కుతో పాటు మాస్టారి మీద కోపం కూడా తారాస్థాయికి చేరుతోంది.
చేతిలోని గ్లాసును నేలకేసి కొట్టి.... పళ్లు నూరుతూ... 'ఈ పంతులుగాడ్ని ఏదోకటి చెయ్యాలి. ప్రతి పనికీ మనకు అడ్డొస్తున్నాడు' అన్నాడు పెద్దిరెడ్డి.
'అవును... వాడ్ని ఏదోకటి చెయ్యాలి. కానీ మన చేతులకు మట్టి అంటకూడదు' అన్నాడు వెంకన్న చౌదరి.
మిగతా వాళ్లు ... అంతే అంతే అంటూ తలలూపారు.
మరోవైపు మాస్టారుని కలిసినవారితో పాటు కొందరు.. ఆ ఊరిలోని రైతులతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ వారం రోజుల పాటు తిరిగారు. రైతుల్ని కూడగట్టారు. రైతులంతా కలిసి తమ ఎడ్లబళ్లు, నాగళ్లతో రోడ్లపైకి రావాలని, పెద్దఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించారు.


***


తెల్లవారితే రైతులంతా రోడ్లపైకి రావాలి. ఎవరెవరు ఎక్కడ ఎలా రావాలి, ఏం చేయాలనేది పక్కగా ప్లాన్‌ సిద్ధం చేశాడు ప్రభాకర్‌. దానికి తగ్గట్టుగానే ధర్నాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సాయంత్రం పోలీసు బెటాలియన్‌ ఒకటి మాస్టారి ఇంటిని చుట్టుముట్టింది. దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించి... లోపలున్న రైతుల్ని, యువకుల్ని బయటకు చెదరగొట్టేశారు. మాస్టార్ని బయటికి లాక్కొచ్చారు.
రైతుల్ని రెచ్చగొడుతున్నారంటూ అక్కడున్న జనం అందరిముందే మాస్టార్ని లాఠీలతో తీవ్రంగా కొట్టారు. 'ఢిల్లీ అల్లర్లలో నీ పాత్ర కూడా వుందని మా దర్యాప్తులో తేలింది. సోషల్‌ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నావు' అంటూ పోలీసులు ప్రభాకర్‌ మీద దాడి చేశారు. అంతమంది పోలీసుల్ని ఒక్కసారిగా చూసిన రైతులు, గ్రామస్తులు బెదిరిపోయారు.
'దయచేసి ఆగండి... మీరు చెబుతున్నట్లు నేను చేసిన నేరాలకు సాక్ష్యాలేంటో చూపించండి!' అంటూ ప్రభాకర్‌ గట్టిగా అరవడంతో క్షణకాలం అంతా నిశ్శబ్ధర ఆవరించిందక్కడ.
'నీకు సాక్ష్యాలు కావాలా..? అయితే పోలీస్‌స్టేషన్‌కి నడువ్‌... అక్కడ చూపిస్తాం సాక్ష్యాలు' అంటూ ఒక పోలీస్‌ అధికారి ప్రభాకర్‌ మెడపై చెయ్యేసి, గట్టిగా నెట్టాడు.
ఈ హఠాత్పరిణామానికి తూలి కిందపడిన ప్రభాకర్‌ మాస్టార్ని పోలీసులు బరబరా ఈడ్చుకెళ్లి జీపులో పడేశారు. అప్పటికే ఆ ఊరి జనమంతా అక్కడ గుంపుగా చేరారు.
'ఇదేం అన్యాయం సార్‌... మాస్టార్ని అలా లాక్కెళతారు?' అని అడ్డురాబోయిన నారాయణపై నాలుగైదు లాఠీలు హూంకరించాయి. ఆ దెబ్బలకు కింద పడిపోయిన నారాయణను పక్కకు లాగేశారు. దీంతో ఇంకెవ్వరూ ప్రశ్నించే సాహసం చేయలేదు.
కానీ, అక్కడున్న జనం అందరికీ తెలుసు... పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, వారు చెప్పే నేరాలకు, మాస్టారుకి ఏం సంబంధం లేదని. ఈ పని ఎవరు చేయించారో కూడా వారికి తెలుసు.
ఆ గుంపు చివరలో నుండి ఒక యువ కంఠం గర్జించింది. గట్టిగా నినదించింది. 'మాస్టార్ని లాక్కెళితే అన్యాయం న్యాయం అయిపోదు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోదు...' అంటూ పిడికిలి బిగించింది...
అవును... అసలు కథ ఇప్పుడే మొదలైంది....