ప్రజాశక్తి-చీరాల
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను గొంతు నులిమి భర్త హత్య చేసిన సంఘటన వేటపాలెం మండలం, కొత్తపేట పంచాయతీ పరిధిలోని రోశయ్య కాలనీలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తిప్పాలకట్ట గ్రామానికి చెందిన అమర్తలూరి డేవిడ్, పండు దంపతుల కుమార్తె రోహిణి (28)కి వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ రోశయ్య కాలనీకి చెందిన డక్కుమళ్ల పవన్ కళ్యాణ్‌తో గత ఏడాది సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ తరచూ గొడవ పడుతూ అలానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల పెద్దలు సర్ది చెప్పి భార్యాభర్తలిద్దరినీ మందలించారు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు అరుచుకొని ఘర్షణ పడ్డారు. ఘర్షణలో భార్య రోహిణిని గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిపారు. హత్య విషయాన్ని కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ తెలియజేసి వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సమాచారం అందుకున్న డిఎస్పి ప్రసాద్ ఆధ్వర్యంలో రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి హత్య జరిగిన ప్రాంతంలో వివరాలు సేకరించారు. అయితే తమ కూతురిని భర్త, కుటుంబ సభ్యులు వివాహం జరిగినప్పటి నుంచి అనుమానిస్తూ వివాహేతర సంబంధాన్ని అంటగడుతూ నిత్యం వేధించేవారని తమతో అనేకసార్లు చెప్పిందని అన్నారు. హత్యకు ముందు కూడా తమతో ఫోన్లో ఏడుస్తూ మాట్లాడిందని, తమ బిడ్డను అత్త ఇంటి వారే భర్తతో కలిసి హత్య చేసారని పోలీసుల ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు వాపోయారు. తమ కుమార్తెను చంపిన పవన్‌కల్యాణ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి పోలీసులు, వైద్యుల సమక్షంలో మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. టూ టౌన్ ఎస్‌ఐ చంద్రావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










