Jan 07,2023 22:16

         మహిళలకు అణువణువునా రక్షణ కల్పించేందుకు దిశ చట్టం తీసుకొచ్చామని ప్రజాప్రతినిధుల ఆర్భాటపు ప్రచారం.. దిశ యాప్‌తో మహిళల రక్షణకు కృషి చేస్తున్నామని పోలీసు అధికారుల హడావుడి.. అంతా బాగుంది. మరి 'అర్ధరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డుపై తిరగగలిగిన నాడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు' అని మహాత్ముడు చెప్పిన మాట అటుంచి అర్ధరాత్రి ఆడది ఇంటి వద్ద తన కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా ఉంటే చాలనుకునే పరిస్థితి కొండ్రుప్రోలు ఘటన తెరపైకి తీసుకొచ్చింది.
తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు ఘటన మన వ్యవస్థలో లోపాలను తేటతెల్లం చేస్తోంది. గ్రామాల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా వాలంటీర్ల వ్యవస్థ, మహిళలకు సంబంధించి రక్షణకు మహిళా సంరక్షణ కార్యదర్శుల (మహిళా పోలీసులు)ను నియమించామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా ఒక ఉన్మాది దాడిని నిలువరించకపోవడంలో వైఫల్యం వ్యవస్థలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తోంది. యువతిని కొంతకాలంగా ఉన్మాది వేధిస్తుండటం, ఈ విషయంపై ఆమె తండ్రి ఆ ఉన్మాదిని హెచ్చరించడం అందరికీ తెలియకపోవచ్చు. అయితే దానికి ప్రతీకారంగా ఆ ఉన్మాది బాధిత కుటుంబానికి చెందిన గడ్డివామి తగులబెట్టడం ఆ గ్రామంలో అందరికీ తెలిసిందే. మరి గ్రామంలోని అధికార వ్యవస్థ దృష్టికి ఈ ఘటన రాలేదా. వస్తే దీని వెనుక ఉన్న వాస్తవాలేమిటని పరిశీలిస్తే వేధింపుల అంశం బయటకు వచ్చేది. వెనువెంటనే పోలీసు శాఖ అప్రమత్తమై బాధిత కుటుంబంతో మాట్లాడటం, అదే సమయంలో ఆ ఉన్మాదిని తీవ్రంగా హెచ్చరించి ఉంటే దాడికి తెగబడే ధైర్యం సన్నగిల్లే అవకాశం ఉండేది. ధైర్యంగా ఇంట్లో ఉన్న యువతిని బయటికి రప్పించేలా ఆ ఇంటికి విద్యుత్‌ సరఫరా నిలిపివేసి విచక్షణారహితంగా దాడి చేశాడంటే ఎంతటి ఉన్మాదో స్పష్టమవుతోంది. గతంలో తణుకు ప్రాంతంలో కృపారాణి అనే మహిళ వేధింపుల ఫలితంగా బలవన్మరణానికి పాల్పడింది. అప్పటికీ ఈ దిశ చట్టం లేదు. యాప్‌ కూడా లేదు. మరి ప్రస్తుతం అవి అందుబాటులో ఉన్నా వాటిపై ప్రజల్లో.. ప్రధానంగా మహిళల్లో సరైన అవగాహన, నమ్మకం లేదని తాజా ఘటన రుజువు చేస్తోంది. వాలంటీర్లను వెంటబెట్టుకుని ఒక కానిస్టేబుల్‌, లేదా మహిళా పోలీసులకు టార్గెట్‌ పెట్టి జనసమ్మర్థ ప్రాంతాల్లో అందరి స్మార్ట్‌ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించడంపై పెడుతున్న శ్రద్ధ అభినందనీయమే. అయితే యాప్‌ డౌన్‌లోడ్‌తోనే అంతా అయిపోతుందనుకుంటే మహిళలపై ఎందుకు ఇంకా అత్యంత భయంకరంగా అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయనేది ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు పరిశీలించాలి. యాప్‌ ద్వారా సాయం కోరిన మహిళకు రక్షణ అందించడమే కాకుండా నేరుగా పోలీసు స్టేషన్‌కు వచ్చిన బాధితురాలి వివరాలు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకునే దగ్గర నుంచి, బాధితురాలి ఫిర్యాదుపై శల్య ప్రశ్నలు, అవమాన, ఇబ్బందికర ప్రశ్నలు మాని దర్యాప్తుపై దృష్టి సారించి మృగాళ్ల ఆటకట్టిస్తే ఎంతోకొంత అధికార వ్యవస్థపై నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు చేసి మరో కొత్త సమస్య తెచ్చుకోవడం ఎందుకనే అభిప్రాయం చాలా మందిలో నెలకొనడానికి పోలీసు శాఖ తీరే కారణం. కనీసం దిశ పోలీసు స్టేషన్‌లోనైనా అధికారులు మహిళలు అయ్యి ఉంటే కొన్ని సమస్యలు, ఇబ్బందులను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఘటన జరిగినప్పుడు, ప్రభుత్వం పేరు కోసం పాకులాడుతూ హడావుడి, ఆర్భాటపు ప్రచారం వల్ల బాధితులకు ఒరిగేదేమీ ఉండదని, దాడులు కొనసాగుతూనే ఉంటాయని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే తప్ప జనం రోడ్లపైకొచ్చి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా వారి గొంతు నొక్కేలా జిఒ నెం.1 వంటి వాటిని తీసుకురావడం ఆపి మృగాళ్ల కట్టడికి ఇంకేమి జిఒలు తీసుకురావాలి, అధికార యంత్రాంగంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలనే దానిపై దృష్టి సారించాలని మహిళా లోకం కోరుతోంది.
-విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌