
పుట్టగానే ఎవరూ నేరస్తులు కాదు. జీవితంలో కొన్ని స్థితిగతుల వల్ల.. దుష్పరిణామాల వల్ల.. నేరస్తులవుతారు. ఫలితంగా జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. కుటుంబసభ్యుల ప్రేమానురాగాలకు దూరమవుతారు. తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతూంటారు. జైళ్లల్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. తెలిసీ తెలియనితనంలో.. క్షణికావేశంలో.. చేసిన తప్పులకు ఒక్కోసారి జీవితకాలం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఓవైపు నా అనే వారికి దూరమై శిక్ష అనుభవిస్తూ ఉంటే.. మరోవైపు కనీస సౌకర్యాల లేమితో దుర్భర పరిస్థితులనుభవిస్తుంటే.. ఆ మహిళా ఖైదీల బాధలు వర్ణనాతీతం. కొందరు మహిళా ఖైదీల ఆవేదనభరితమైన అంతరంగాలను ఆవిష్కరించే ప్రయత్నమే ఈ వారం 'అట్టమీది కథ' చదవండి..
క్షణికావేశంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవించే వారే జైళ్లలో ఎక్కువగా ఉంటారు. అందులోనూ మహిళల పరిస్థితి మరింత దారుణం. జైలు జీవితాన్ని గడిపే మహిళలు నిత్యం ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కొంటున్నారో కొందరు మహిళా ఖైదీలు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌లోని అధికారులు ఒక నివేదిక విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం.. ఒక గదిలో 45 మంది ఖైదీలు ఉండొచ్చనీ, ఒక ఫ్యాన్, లైట్ సరిపోతుందనీ చెప్పారు. వాస్తవానికి ఆ గదుల్లో అంతమంది నిద్రపోవడం అసాధ్యం. ఒక్క ఆక్యుపెన్సీలోనే కాదు... ఇలా ప్రతి విషయంలోనూ మహిళా ఖైదీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
1. అపరిశుభ్రతతో సహవాసం
అపరాజిత బోస్ తన భర్త హత్య కేసులో 2000 నుంచి 2013 వరకు జైలు జీవితాన్ని గడిపింది. చివరకు కోల్‌కతా హైకోర్టు, సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ఆ నాలుగు గోడల నుంచి విముక్తి లభించిందామెకు. మొదటి ఎనిమిదేళ్లూ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌లో శిక్ష అనుభవించింది. అక్కడి మహిళా ఖైదీల దుస్థితిని ఆమె వివరించింది.
'మా గదిలో 44 మంది ఖైదీలం ఉండేవాళ్లం. అందరికీ ఒకే టాయిలెట్. నెలసరి సమయంలో ఎక్కువ మంది శానిటరీ ప్యాడ్స్‌ను డస్ట్‌బిన్స్‌లో కాకుండా నేరుగా టాయిలెట్‌లో పడేసేవారు. ఈ సమస్య గురించి సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అపరిశుభ్రతతోనే సహవాసం చేసేవాళ్లం. నెలసరి సమయంలో ఉపయోగించుకోవడానికి కేవలం 12 శానిటరీ ప్యాడ్స్‌ను ఇచ్చేవారు. ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది ప్యాడ్స్ సరిపోవడం లేదని చెబితే.. గాజుగుడ్డ (బ్యాండేజ్ క్లాత్), దూది ఇచ్చి మమ్మల్నే తయారుచేసుకోమని చెప్పేవారు. ప్యాడ్స్ పారవేయడానికి కేవలం ఒకే డస్ట్‌బిన్ ఉండేది. దానిని రోజూ శుభ్రం చేసేవారుకాదు. దాని నుంచి వచ్చే దుర్గంధం భరించలేకపోయేవాళ్లం. మహిళా విభాగం పురుషుల జైలులో ఉన్నందున మాకు ఇచ్చే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ అంటూ ఏమీ ఉండేది కాదు. తరచూ కూరల్లో, అన్నంలో పెద్ద పెద్ద పురుగుల్ని చూసేవాళ్లం. అక్కడి భోజనంతో పోల్చుకుంటే నేను చివరగా శిక్ష అనుభవించిన అలిపోర్ కరెక్షనల్ హోమ్‌లో ఆహారం బాగుంటుంది. నిజానికి నా అత్తింటివాళ్లు అన్యాయంగా నన్ను కేసులో ఇరికించారు. జయంత నారాయణ్ ఛటర్జీలాంటి నిజాయితీ గల న్యాయవాది ఉండబట్టే ఇప్పటికైనా నిర్దోషినని తేలింది. ఆయన నాలాగా అన్యాయంగా జైళ్లలో మగ్గిపోయే ఎంతోమందిని గుర్తించారు. అలాంటి వారికోసం హ్యుమన్ రైట్స్‌లా నెట్‌వర్క్ (హెచ్‌ఆర్‌ఎల్‌ఎన్) అనే ఎన్జీఓను స్థాపించారు. దానిద్వారా ఉచిత న్యాయ సహాయం అందించడమే కాకుండా, అక్షరాస్యతను ప్రోత్సహిస్తున్నారు. వాస్తవానికి ఎక్కువమంది జీవిత ఖైదీలను సమాజమూ, కుటుంబమూ దగ్గరకు రానివ్వదు. అలాంటివారికి ఈ ఎన్జీఓ ఎంతో సహాయం చేస్తుంది. ప్రస్తుతం నేను ఇందులో భాగస్వామినయ్యా'.
2.కళంకితగా..
'నేను ఎప్పుడూ నిశ్శబ్దాన్ని కోరుకుంటాను. కానీ మా గది వాతావరణం అందుకు పూర్తి భిన్నం. ఒకవైపు కొంతమంది ఖైదీల ఏడుపులు.. మరోవైపు ఖైదీలను తిడుతూ సిబ్బంది అరుపులు.. ఇంకోవైపు కొందరు ఖైదీల పిచ్చాపాటి మాటలు.. వీటన్నింటితో విసుగెత్తిపోతాం. ఒక్కమాటలో చెప్పాలంటే చెవిలో దోమ దూరితే వచ్చే శబ్దం ఎంత నరకంగా ఉంటుందో.. మా గది వాతావరణం అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది. ఎండాకాలం (2003లో) చాలా ఇబ్బందులు పడ్డాం. నీళ్లు సరిగా ఉండేవి కాదు. నాలుగైదు రోజులకోసారి స్నానం చేసేవాళ్లం. అదీ ముగ్గురుకి కలిపి బకెట్ నీళ్లు మాత్రమే ఇచ్చేవారు. ఎంతసేపటిలో స్నానం చేసి బయటికి రావాలో సిబ్బందే చెప్తారు. అక్కడా మాకు స్వేచ్ఛ లేదు. వరకట్న సంబంధిత కేసులో నేను, నా కొడుకు నాలుగేళ్లు జైలు జీవితాన్ని గడిపాం. కేవలం మొదటి ఏడాది మాత్రమే మా కుమార్తె, సోదరుడు నన్ను చూడటానికి వచ్చారు. ఎందుకంటే నేనుండే జైలుకు మా గ్రామం నుంచి ఏడు గంటల ప్రయాణం. దాంతోపాటు బస్సు ఛార్జీలు భరించే శక్తి నా కుటుంబానికి లేదు. జైలుకెళ్లిన మహిళలంటే సమాజంలో చులకన భావం. చివరకు కుటుంబాలూ వాళ్లని అనాథలుగా వదిలేసిన సంఘటనలు కోకొల్లలు. ఒక్కసారి జైలుకెళితే జీవితాంతం కళంకితగా మిగిలిపోవాల్సిందే' అంటోంది షాజహాన్‌పూర్ జిల్లా జైలులో శిక్ష అనుభవించిన మహిళా ఖైదీ మీనా.
3. ఒక అడుగు ముందుకు..
ఒకప్పుడు ముంబై బైకుల్లా జైల్లో శిక్ష అనుభవించిన మహిళా ఖైదీ లీలా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆమె మాటల్లోనే..
'మీకు తెలుసా? ఒకానొక సమయంలో మహిళల గదుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, జైలు సిబ్బంది నిర్ణయించుకున్నారు. మాలో చాలామందిమి వ్యతిరేకించాం. మీరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి అనుకుంటే ముందుగా మీ అధికారుల కార్యాలయాల్లో ఏర్పాటు చేయండి అన్నాం. ఎందుకంటే అక్కడే ఖైదీలపై హింస జరిగేది, లంచాలు తీసుకునేది. మేము గది బయటకు వచ్చినప్పటి నుంచి సీసీటీవీ పర్యవేక్షణలోనే ఉంటాం. కానీ గదిలోపలా సీసీటీవీ పెడితే ఎలా? వేసవిలో గదిలో చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి మేం తక్కువ దుస్తులతో నిద్రిస్తుంటాం అని చెప్పినా వినలేదు. దీంతో నిరసనకు దిగక తప్పలేదు. దీనంతటికీ నేనే కారణం అని అధికారులు భావించారు. నన్ను ఒక గదిలో నిర్భంధించారు. ఆ విషయం ఐదు రోజుల తర్వాత పత్రికల్లో వచ్చింది. దాంతో జైలును పరిశీలించడానికి ఒక న్యాయమూర్తి వచ్చారు. అంతే అధికారులు రూముల్లో సీసీ కెమెరాల కోసం ఏర్పాటు చేసిన పైపులైన్లను తొలగించారు.
మన శరీరం మీద మనకు ఎలాంటి హక్కులూ లేవనే విషయం జైలుకొచ్చిన తర్వాతనే తెలిసింది. మీరు ఊహించని సంఘటనలెన్నో ఇక్కడ జరుగుతాయి. మేము అప్పుడప్పుడూ కోర్టుకు వెళ్లి రావాల్సి ఉంటుంది. ఆ సమయంలో మహిళా గార్డుల ముందు మేము వివస్త్రగా నిలబడాలి. వాళ్లు మా శరీరంలోని కొన్ని ప్రదేశాలను తాకుతూ.. ఎంత ఇబ్బందిపెట్టినా నిస్సహాయంగా భరించాలి. నెలసరిలో ఉన్నా సరే లోదుస్తుల్నీ తీయమని అడుగుతారు. ఆ సమయంలో మేము మానసికంగా ఎంత క్షోభను అనుభవిస్తామో మీరు ఊహించలేరు. మాపై జైలులో అడుగడుగునా వివక్ష చూపుతారు. అందుకు ఉదాహరణ డిసెంబర్ 26, 2011లో మహారాష్ట్ర జైలు మాన్యువల్ ప్రకారం మహిళా ఖైదీలకు పురుషుల కంటే తక్కువ రొట్టెలు ఇవ్వాలని ఉంది. ఇదెక్కడి న్యాయం? అప్పట్లో నేనుండే జైలులో బెంగాలీ ముస్లిం మహిళలు ఎక్కువగా ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డారని వారిమీద కేసులు నడుస్తున్నాయి. వారు రొట్టెలు తినరు. అన్నం తినడమే అలవాటు. వాళ్లకు బియ్యం ఇవ్వాలనేదీ మా నిరసనలో ఒక డిమాండ్. ప్రతిరోజూ మాకు ఆహారం అందించే ముందు జైలు వైధ్యాధికారికి రుచి చూపించేవారు. ''ఇన్కే ప్లేట్ కా ఖానా తోహ బోహోట్ అచ్ఛా లగ్తా థా, ఏక్దం ఘర్ కే ఖానే కే జైసే (అధికారి రుచి చూసే ఆహారం ఇంట్లోని భోజనంలా ఉంటుంది)''. కానీ ఖైదీలకు ఆహారం చేరేటప్పటికి నాణ్యత పూర్తిగా లోపిస్తుంది. అందుకే ఒకరోజు జైలులో మహిళా ఖైదీలం నిరాహారదీక్ష చేశాం. మా నిరసన విజయవంతమైంది. అప్పటి నుంచి ఆహార నాణ్యతలో చాలా మార్పులు వచ్చాయి.
మనదేశంలోని జైళ్లలో అసమానతలు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. ముంబై పెద్ద నగరం కాబట్టి ఇక్కడి ఖైదీలు వాళ్ల హక్కుల గురించి పోరాడి, సాధించుకోగలిగారు. నేను నాగ్‌పూర్ జైల్లో ఉన్నప్పుడు అక్కడి ఖైదీలు వీరిలా పోరాడలేరు. వాస్తవానికి చట్ట ప్రకారం ఖైదీలు చేసిన నేరాలను బట్టి గదులు కేటాయించాలి. కానీ ప్రస్తుతం మతం, సాంప్రదాయం, రాజకీయ పలుకుబడి ఆధారంగా గదులను కేటాయిస్తున్నారు. ఇది కరెక్టు కాదు. నేను ముంబై బైకుల్లాలో ఉన్నప్పుడు జయఛేడా అనే ఆమె భర్తను హత్య చేసి వచ్చింది. సిబ్బంది, ఇతర ఖైదీలు ఆమెను గౌరవంగా చూసుకునేవారు. తోటివారు రోజూ ఆమెకు మసాజ్ చేసేవారు. వైద్యం సాకుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమె బయటకు వెళ్లి వచ్చేది.
4.రాష్ట్రాలే భరించాలి
ఎన్‌సిఆర్‌బి ప్రకారం, జైళ్లు తమకు కేటాయించిన డబ్బులో సగం ఆహారం కోసం ఖర్చు చేస్తాయి. ప్రతి ఖైదీకి ఎన్ని కేలరీలు ఆహారం పెట్టాలో 2016 మోడల్ ప్రిజన్ మాన్యువల్ తెలియజేసింది. పురుషులకు రోజుకు 2,320 నుంచి 2,730 కిలో కేలరీలు, మహిళలకు రోజుకు 1900 నుంచి 2,230 కిలో కేలరీలు కేటాయించాలి. అందులోనూ గర్భిణీ, పాలిచ్చే మహిళలకు ఇతరులకన్నా ఎక్కువ ప్రొటీన్లు, ఖనిజాలు అందేలా చూడాలి. కానీ అలా జరగడం లేదు. జైళ్లలో ఖైదీలకు పెట్టే ఆహారాన్ని ఆ రాష్ట్రాలే భరించాల్సి ఉన్నందున నాణ్యతాలోపం ఎక్కువగా ఉంది. కాబట్టి నేటికీ ఖైదీలు తరచూ ఆహార నాణ్యత, పరిమాణం పెంచాలని పోరాటం చేస్తూనే ఉన్నారు.
5. సెక్స్ వర్కర్స్ మనుషులు కాదా?
బీనా ఒక సెక్స్ వర్కర్. 2020, డిసెంబర్ 10న గదిలో ఆమె ఒంటరిగా కూర్చుని ఉంది. అదే సమయంలో పోలీసులు ఆ ప్రాంతంపై దాడి చేశారు. సుమారు 81 మంది మహిళలను అరెస్టు చేశారు. 'నేను రెండు నెలల గర్భవతిని. నా దగ్గర ప్రస్తుతం ఎవరూ లేరు అని ఎంతచెప్పినా వినకుండా, పోలీసులు నన్ను గది బయటకు ఈడ్చుకుని వచ్చారు. పోలీసుస్టేషన్‌కు తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ''యే రాండి ఖానా నహీ హై (ఇది వేశ్యాగృహం కాదు)'' అని చెబుతూ ''రాండి (వేశ్యా)'' అని పిలుస్తూనే ఉన్నారు. అంతేనా మా పిల్లలతో, వృద్ధులతో చాలా దారుణంగా ప్రవర్తించారు. అక్కడ మేం రెండు రాత్రులు గడిపాం. తర్వాత మమ్మల్ని కోవిడ్-19 కేంద్రంలో మూడు వారాలు ఉంచారు. అక్కడ సిబ్బంది చాలా మొరటుగా ఉన్నారు. మాకు శుభ్రం తక్కువని తిడుతూనే ఉన్నారు. వాస్తవానికి ఆ కేంద్రంలో ఉండే వారందరికీ కలిపి కేవలం మూడు బాత్‌రూమ్‌లే ఉన్నాయి. అలాంటప్పుడు శుభ్రంగా ఉండటం ఎలా కుదురుతుంది?' అంటోంది బీనా.
బీనాతో పాటు అరెస్టయిన వారందరిపై పిత (ూ×ుA - ూతీవఙవఅ్‌ఱశీఅ శీట ఱఎఎశీతీaశ్రీ ్‌తీaటళషసఱఅస్త్ర), పోక్సో చట్టాల కింద కేసులు పెట్టారు. నిజానికి అక్కడున్న పిల్లలను సెక్స్‌వర్కర్స్ రక్షించారు. కానీ వారిపై వ్యతిరేకంగా కేసులు పెట్టారు. 'కోవిడ్ కేంద్రానికి వచ్చిన పదిరోజుల తర్వాత నా కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. సిబ్బందికి చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ వారు పట్టించుకోలేదు. రెండు గంటల తర్వాత తీవ్రంగా రక్తస్రావం జరిగింది. నా తోటి ఖైదీలు సిబ్బందిని ఎంత పిలిచినా ఎవరూ రాలేదు. వాళ్లంతా కలిసి సీసీటీవీ కెమెరాల ముందుకెళ్లి, నాకు వైద్యసేవలు అందించమని అభ్యర్థించారు. చివరకు సిబ్బంది నా దగ్గరకు వచ్చారు. రక్తస్రావాన్ని అరికట్టడానికి శానిటరీ ప్యాడ్స్ ఇచ్చారు. నేను చాలా బలహీనంగా ఉన్నాను. నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని ఎంతగానో ప్రాధేయపడ్డాను. కానీ వారు పట్టించుకోలేదు. ఆ తర్వాత రోజు నా అభ్యర్థన మేరకు దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ రోజు శనివారం కావడంతో మెయిన్ డాక్టర్ లేరు. జూనియర్ డాక్టర్ సోనోగ్రఫీ చేసి, అబార్షన్ అయ్యిందని చెప్పారు. బిడ్డని కోల్పోయి కన్నీరుమున్నీరు అవుతున్న నా మీద సిబ్బంది కనీసం జాలైనా చూపలేదు. ఎలాంటి మందులూ ఇవ్వలేదు. మరలా నన్నెప్పుడూ చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. సెక్స్‌వర్కర్స్ మనుషులు కాదా? వారి పిల్లలవి ప్రాణాలు కాదా? మా పట్ల ఎందుకీ వివక్ష? కొన్నిరోజుల తర్వాత నన్ను నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకు మార్చారు. మోడల్ ప్రిజన్ మాన్యువల్ నిబంధనలను అనుసరించి, మమ్మల్ని ఇతర ఖైదీలకు దూరంగా రెండు గదుల్లో ఉంచారు' అంటోంది బీనా.
6.సమస్య లేదు.. సృష్టిస్తున్నారు..!
మనదేశంలో 1350 జైళ్లు ఉన్నాయి. వాటిలో 31 జైళ్లను మహిళలకు కేటాయించారు. అవి 15 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. మహిళా జైళ్లు చాలా తక్కువగా ఉన్న కారణంగా పురుషుల జైళ్లలోనే కొంత భాగాన్ని మహిళలకు కేటాయిస్తుంటారు. వారి గ్రామాలు ఒకచోట, జైళ్లు ఎక్కడో ఉండటంతో శిక్షా సమయంలో కుటుంబ సభ్యులు వెళ్లేదీ తక్కువే. పురుష ఖైదీలతో పోలిస్తే కుటుంబాలకు దూరమై, మానసిక వేదన ఎక్కువగా అనుభవించేది మహిళా ఖైదీలే.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి), 2019 డేటా ప్రకారం 56.09 శాతమే మహిళలు ఉన్నారు. ఉదాహరణకు దేశంలోని 410 జిల్లా జైళ్లలో సగటున 129.71 శాతం మహిళా ఖైదీలు ఉన్నారు. తాజా డేటా ప్రకారం మహిళా జైళ్లలో 6,511 మంది మహిళా ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉంది. కానీ 3,652 మంది మాత్రమే ఉన్నారు. ఇతర జైళ్లలో (పురుషుల జైళ్లలో) 76.7 శాతం మహిళలకు కేటాయిస్తున్నారు. అంటే దీనినిబట్టి జైళ్లలో స్థల సమస్య లేనేలేదు. అయినా ఎందుకు ఇరుకుగదుల్లో ఎక్కువమందిని ఉంచి, కనీస సౌకర్యాలు అందకుండా చేస్తున్నారు. కావాలనే సమస్యను సృష్టిస్తున్నారని అనిపించడం లేదూ?!
ఒక్కొక్కరిదీ ఒక్కో కథ!
మీనా, లీలా, అపరాజిత, బీనా ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. వాస్తవానికి మహిళల జైళ్లలో సౌకర్యాల కన్నా, పురుషుల జైళ్లలో వసతులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లుతెరిచి, మహిళా ఖైదీలకు ఇవ్వాల్సిన ఆహారాన్ని, కనీస సౌకర్యాల్ని అందించాలని కోరుకుందాం. జైలులో ఉన్నప్పుడే వారికి తగిన మానసిక చికిత్స, జీవనోపాధి పొందేలా శిక్షణ ఇవ్వాలి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మహిళా ఖైదీల పునరావాసాలకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తే బాగుంటుంది.
గోప్యత కోసం ఈ కథనంలోని పేర్లను మార్పు చేశాం.