May 17,2023 22:15

కరెంటు కోతలతో జనం విలవిల
గ్రామాల్లో ఐదు గంటలుపైనే కోత
పట్టణాల్లోనూ గంటలు తరబడి కోతలే
ప్రతిరోజూ 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు
ఉక్కపోతతో తల్లడిల్లుతున్న జనం
ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

కరెంటు కోతలతో జిల్లా ప్రజానీకం తల్లడిల్లుతున్నారు. రోజువారీ విద్యుత్‌ వినియోగం 22 మిలియన్‌ యూనిట్ల నుంచి 23.5 మిలియన్‌ యూనిట్లకు పెరిగిందంటూ లోడు రిలీఫ్‌ పేరుతో ఎడాపెడా కరెంటు కోతలు అమలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో రెండు జిల్లాల ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10 లక్షలకుపైగా గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. దీనిలో పేద, మధ్యతరగతి విద్యుత్‌ ప్రజల కనెక్షన్లే అధికం. గడిచిన మూడు రోజులుగా జిల్లాలో ప్రతిరోజూ 45 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులకు జనం విలవిల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎండలకు తట్టుకోలేక ఇంట్లో ఉన్న కరెంటు కోతలతో ఉపశమనం లేని పరిస్థితి ఏర్పడింది. లోడ్‌ రిలీఫ్‌ పేరుతో సమయం, సందర్భం లేకుండా ఇష్టానుసారంగా కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగర పరిధిలోని తంగెళ్లమూడిలో మంగళవారం రాత్రి 8.30 గంటలకు తీసేసిన కరెంటు తెల్లవారే వరకూ ఇవ్వని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించకపోవడంతో జనం రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఏలూరు పట్టణ కేంద్రంలోనూ అర్ధరాత్రి గంటకుపైగా కరెంటు కోత కొనసాగింది. భీమడోలు మండలం పొలసానిపల్లిలో నాలుగైదు గంటలు కరెంటు కోత పెట్టడంతో జనం అల్లాడిపోయిన పరిస్థితి నెలకొంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలోనూ కరెంటు కోతల బాధలు జనాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. గ్రామాల్లో అయితే ఇష్టానుసారంగా కరెంటు కోతలు అమలవుతున్నాయి. పలు గ్రామాల్లో రోజుకు నాలుగైదు గంటలు కోతలు కొనసాగుతుండగా, కొన్ని గ్రామాల్లో ఏడెనిమిది గంటలు సైతం కోతలు విధిస్తున్నారు. ఇన్వర్టర్లు ఉన్నవారు కొంత ఉపశమనం పొందుతుండగా, లేనివారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాత్రంతా నిద్ర లేకుండాపోతుంది. పగలూ రాత్రి ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉక్కపోతకు తాళలేక పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తుండటంతో వారిని బుజ్జగించడంతోనే రాత్రంతా గడిచిపోతుంది. బిల్డింగ్‌పైన సేదతీరుదామని వెళ్లినా దోమల ధాటికి తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. డెల్టా, మెట్ట ప్రాంతం అనే తేడా లేకుండా కరెంటు కోతలు అమలవుతున్నాయి. విద్యుత్‌ వినియోగం పెరగడంతో అనధికారికంగా లోడ్‌ రిలీఫ్‌ పేరుతో కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో వెంటాడుతున్న కరెంటు కోతలు జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరం
కరెంటు కోతలతో అక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో రొయ్యల సాగు కత్తిమీద సాములా మారింది. చెరువుల్లో ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గకుండా ఉండాలంటే నిరంతరం రేడియేటర్లు తిప్పాలి. రేడియేటర్లు ఆడించాలంటే కరెంటు ఉండాలి. కరెంటు కోతలతో జనరేటర్లతోనే రేడియటర్లు ఆడించాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసిమోపెడవుతుందని ఆక్వా రైతులు లబోదిబోమంటున్నారు. రెండు జిల్లాల్లోనూ దాదాపు రెండు లక్షలకుపైగా ఎకరాల్లో ఆక్వా సాగు సాగుతోంది. దీనిలో అత్యధికంగా రొయ్యల సాగే ఉంది. ఇప్పటికే సరైన ధరలేక రొయ్యల సాగు చేసే రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఇప్పుడు కరెంటు కోతలతో ఎకరాకు దాదాపు రూ.లక్ష వరకూ అదనపు పెట్టుబడి అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. వేసవి తీవ్రత ఇదేవిధంగా కొనసాగితే ఆక్వా రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారనుందని చెబుతున్నారు.