ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్చంద సంస్థలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు కోరారు. దేశవ్యాప్తంగా క్షయ వ్యాధిని రూపుమాపేందుకు ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరం వద్ద క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కెనరా బ్యాంక్ రెండు లక్షల సిఎస్‌ఆర్ నిధులతో జిల్లాలో 500 మంది క్షయ వ్యాధి బాధితులకు పౌష్టికాహారం కిట్లను అందించేందుకు ముందుకురావడం అభినందనీయమన్నారు. జిల్లాలో రెండు వేల మంది క్షయ వ్యాధి బాధితులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.సమరం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యం సుహాసిని, జిల్లా టిబి కంట్రోలింగ్ అధికారి డాక్టర్ ఉషారాణి, కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ ఎ.సుధాకర్ పాల్గొన్నారు.










