వైద్యాధికారులకు జిల్లా క్షయ నియంత్రణ అధికారి ఆదేశం
ప్రజాశక్తి -సీలేరు
క్షయ వ్యాధి పట్ల మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ విశ్వేశ్వరనాయుడు సీలేరు, ధారకొండ వైద్యాధికారులు డాక్టర్ సౌమ్య, డాక్టర్ హిమబిందును ఆదేశించారు. జీకే వీధి మండలం సీలేరు, ధారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించి తనిఖీలు చేశారు. ఆయా పిహెచ్‌సిల్లో క్షయ వ్యాధిగ్రస్తులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యటిస్తూ టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని, రెండు వారాలకు మించి జ్వరం, దగ్గు, బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలున్న వారికి కళ్లే పరీక్ష నిర్వహించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయితే వారికి తక్షణమే వైద్య సేవలు అందించాలని, రోగి క్రమం తప్పకుండా మందులు వాడుతున్నారా లేదా అనేది వైద్య సిబ్బంది, టీబీ సూపర్వైజర్లు తెలుసుకోవాలని చెప్పారు. క్షయ నిర్ధారణ పరీక్షలు పెంచాలని, వ్యాధిగ్రస్తులకు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారం తీసుకునే విధంగా ప్రోత్సహించాలని, పౌష్టికాహారం తీసుకోపోతే జరిగే నష్టంపై వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. టీబీ రోగుల సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి జిల్లా అధికారులకు సమాచారం చేరవేయాలని సూచించారు. వ్యాధిగ్రస్తులు ఆరు నెలలు మందులు వాడిన తర్వాత వారికి పరీక్షలు నిర్వహించి తగ్గిందో లేదో చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్ డాక్టర్ విగేష్, డిటిసి శ్రీనివాసరావు, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్య, సీలేరు హెల్త్ సూపర్వైజర్ త్రినాథ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










