ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు నెలల పాటు మెరుగైన పోషక విలువలు గల పౌష్టికాహరాన్ని అందించడం ద్వారా ఆరోగ్య పరిస్థితులలో సత్ఫలితాలు సాధించగలిగామని, 2025 నాటికి క్షయ వ్యాధిని సమూలంగా రూపు మాపేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. ప్రధాన మంత్రి నిక్షయ మిత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా క్షయ వ్యాధి నివారణ సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్‌లోని రెడ్‌క్రాస్ భవనంలో క్షయ వ్యాధి గ్రస్తులకు ఆరో విడత పౌష్టికాహార కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు ఒక్కొక్కరికి 700 రూపాయల విలువ గల పౌష్టికాహారాన్ని ఆరు మాసాల పాటు అందించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ జిల్లా అధ్యక్షలు డాక్టర్ జి.సమరం, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ ఉషారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ యం సుహాసిని, క్షయ వ్యాధి నివారణ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం.చిన్నికృష్ణ, రైడ్‌కాస్ర్ సోసైటీ మేనేజర్ సిహెచ్.శ్రీనివాస్‌రావు, డిజాస్టర్ కో-ఆర్డినేటర్ పి.రాధిక, అసిస్టెంట్ మేనేజర్ టి. సునీత తదితరులు పాల్గొన్నారు.










