నగర కమిషనర్ అరుణ తనిఖీలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
ఓటరు నమోదు, తొలగింపు, సవరణల కోసం అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని కమిషనర్, ఏఈఆర్వో డాక్టర్ జె.అరుణ బిఎల్‌ఓలను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 150 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరుగుతున్న దరఖాస్తు పరిశీలన కార్యక్రమాన్ని ఆదివారం కమిషనర్ అరుణ ఆకస్మితంగా తనిఖీలు చేశారు. ఎమ్జీఆర్ వీధి, మిట్టూరు, శాంతినగర్ తదితర ప్రాంతాల పరిధిలో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. బిఎల్వోల వద్దనున్న ఫారం 6, 7, 8 దరఖాస్తులు, దరఖాస్తులకు జతచేసిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, సదరు దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ -2024 కార్యక్రమం డిసెంబర్ 9వ తేదీ వరకు జరుగుతుందని, ఈ సమయంలో కొత్తగా ఓటు హక్కు నమోదుతో పాటు, తొలగించడం, మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నట్లు వివరించారు. ఇదే విషయాన్ని బిఎల్వోలు పోలింగ్ కేంద్రం స్థాయిలో విస్తతంగా అవగాహన కల్పించాలన్నారు. దరఖాస్తులతో పాటు అందిన ధ్రువీకరణ పత్రాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పరిశీలన ద్వారా తనిఖీ చేయాలన్నారు. అన్ని సక్రమంగా ఉంటే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. డిసెంబర్ 2, 3వ తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమంపై పోలింగ్ కేంద్రాల స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సీఎంఎం గోపి, బిఎల్వోలు పాల్గొన్నారు.
దరఖాస్తులను సకాలంలో అప్లోడ్ చేయాలి
బిఎల్వోలు క్షేత్రస్థాయిలో స్వీకరించిన ఓటరు నమోదు, సవరణలు, తొలగింపు దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సకాలంలో లాగిన్‌లో అప్లోడ్ చేయాలని ఈఆర్‌ఓ, ఆర్డీవో చిన్నయ్య, ఏఈఆర్వో కమిషనర్ డాక్టర్ జె.అరుణ చెప్పారు. ఆదివారం కార్యాలయం నుండి బిఎల్వోలు, సూపర్వైజర్ అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఆర్‌ఓ ఏఈఆర్వోలు మాట్లాడుతూ బిఎల్వోలు ఇప్పటివరకు స్వీకరించిన ఫారం -6, 7, 8 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పక్కాగా విచారించాలన్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం, నిబంధనల మేరకు సక్రమంగా ఉన్న దరఖాస్తులను బిఎల్వో లాగిన్‌లో అప్లోడ్ చేయాలన్నారు. దరఖాస్తులు అప్లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరబాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మేనేజర్ ఉమామహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.