Mar 12,2023 01:18
క్షుద్ర పూజలు చేసిన ప్రదేశం

ప్రజాశక్తి-అద్దంకి: బాపట్ల జిల్లా అద్దంకి పట్టణ సమీపంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అద్దంకి నుంచి కలవకూరు వెళ్లే రోడ్డులో ఇటుక బట్టీల సమీపంలోని సింగరకొండ పాలెం వెళ్లే రోడ్డులో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు దర్శనమిచ్చాయి. రోడ్డుపై ముగ్గు వేయడంతో పాటు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉండటంతో అటుగా ప్రయాణించేవారు ఆందోళన చెందుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు ఆ మార్గంలో తిరుగుతూ ఉంటాయి. అలాంటి రోడ్డుపై ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో అటుగా ప్రయాణించా లంటేనే వాహనదారులు, ప్రజలు హడలెత్తిపోతున్నారు. గతంలో కూడా అదే ప్రదేశంలో ఇలాంటి సంఘటన జరిగాయని స్థానికులు చర్చించుకుంటున్నారు, ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.