ప్రజాశక్తి - జామి : 'కలిసుంటే కలదు సుఖం' అన్నారు పెద్దలు. అలాగే కష్టం వచ్చిందంటే... బద్ద శత్రువులైనా కలిపోవడం మానవ సహజం. కానీ తెలుగు తమ్ముళ్లకు ఇవేవీ పట్టినట్టు కనిపించడం లేదు. శృంగవపుకోట నియోజకవర్గంలో టిడిపి నాయకుల తీరును పరిశీలిస్తే... వారికి టికెట్ తప్ప పార్టీ మనుగడ ముఖ్యం అన్నట్లు కనిపించడం లేదు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జైల్లో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో టిడిపి నాయకులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా గ్రూపుల బల ప్రదర్శనలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపడుతున్న కార్యక్రమాల్లోనూ గ్రూపులుగా విడిపోయారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఎస్.కోట పట్టణంలో నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న ఎన్‌ఆర్‌ఐ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ పోటీగా మరో నిరసన శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా ప్రతి కార్యక్రమంలోనూ రెండు గ్రూపులుగా టిడిపి నాయకులు విడిపోయిన పరిస్థితి. ఎన్నికల్లో టిక్కెట్ సంగతి అటుంచితే, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా గ్రూపుల పోటీలు, బల ప్రదర్శనలు ఏమిటని పార్టీ కార్యకర్తలు కలవరపడుతున్నారు. టిక్కెట్ ఎవరికి వచ్చినా, పార్టీ గెలుపే ముఖ్యమని బయటకు చెబుతున్న ఈ ఇరువురు పార్టీ కార్యక్రమాల్లో మాత్రం వర్గ విభేదాలు వీడడం లేదు.
రెండుగా చీలిపోయిన టిడిపి
శృంగవరపుకోట నియోజకవర్గం టిడిపి కంచుకోటగా చెప్పొచ్చు. అత్యధిక సార్లు గెలుపు బావుటా ఎగురవేసిన సందర్భాలు ఉన్నాయి. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోళ్ల కుటుంబానికి టిడిపి అధినాయకత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల పార్టీలో చేరిన ఎన్‌ఆర్‌ఐ గొంప కృష్ణ పార్టీ టిక్కెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి. ఆయనకు చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో ఒకరైన భరత్ ఆశీస్సులు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఎవరికి వారే టిక్కెట్ ఖాయమని చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఐదు మండలాల్లో పూర్వం నుంచి కలిసున్న టిడిపి నాయకత్వం రెండుగా చీలిపోయింది. జామి, ఎస్.కోట, వేపాడ, కొత్తవలస, ఎల్.కోట మండలాల నాయకులు రెండు గ్రూపులుగా నిరసన శిబిరాల్లో పాల్గొంటున్నారు. పార్టీ అధినేతతోపాటు రాష్ట్ర నాయకత్వం కష్టకాలంలో నానా అవస్థలు పడుతుంటే, ఎస్.కోటలో టిడిపి ఢ అంటే ఢ అంటూ కొట్టుకుంటున్న పరిస్థితి. ఇదే అధికార పార్టీకి కలిసొచ్చిన అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కోట టిడిపి నాయకుల తీరు మార్చుకుంటారో? లేక గ్రూపుల గోల ముదిరి పాకాన పడుతుందో అన్నది కాలమే తేల్చాల్సి ఉంది.










