కడప అర్బన్ : రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కుల్ని వైసిపి ప్రభుత్వం హరిస్తుంటే అధికారులు వంత పాడుతున్నారని, గడిచిన 'బాబు' పాలనపై రంద్రాన్వేషణ చేస్తున్న వైసిపి ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించి, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేసిన విధానం సరైంది కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం పాత బస్టాండ్‌లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో నగర కార్యదర్శి రామ మోహన్ అధ్యక్షతన పెరిగిన విద్యుత్ ఛార్జీలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు అసలు కన్నా, కొస చాలా ఎక్కువగా ఉందన్నారు. ఫిక్స్‌డ్, సర్వీస్, కస్టర్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ప్రీ పెయిడ్ స్మార్ట్‌మీటర్ల నిర్వహణ ఖర్చు, నష్టాల భారం, భవిష్యత్తు అవసరాల ఖర్చు, డొమెస్టిక్ బిల్లులో కనపరిచి వసూలు చేస్తున్నారన్నారు. 2021లోనే రూ.369 వేల కోట్లు వసూలు చేశారని పేర్కొన్నారు. ఈ వసూళ్లు చట్టం విరుద్ధమన్నారు. భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు సెల్‌ఫోన్‌లో మనం ఎలా రీఛార్జు చేసుకుంటున్నామో అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పారు. రాష్ట్రల పరిధిలో ఉన్న విద్యుత్తు ఉత్పత్తి, విద్యుత్ రవాణా, విద్యుత్ వినియోగం, విద్యుత్తు బిల్లులు, 2022 విద్యుత్ సంస్కరణ బిల్లు పేరిట కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్, ప్రయివేటీకరణ చేయబోతుందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ ఫెడరల్ విధానానికి విరుద్ధమని విమర్శించారు. రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, కడప జిల్లాలో ఇప్పటికే రైతులు ఖరీఫ్ పంట నష్టపోయారని తెలిపారు. రబీ పంట కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా ఆర్‌బికెల్లో ఇవ్వాల్సిన ఎరువులను ప్రయివేట్ దుకాణాల డీలర్లకు గుండు గుత్తగా అమ్ముతున్నారని తెలిపారు. దీన్ని అధికారులు, పాలకులు అడ్డుకోవడం లేదన్నారు. కౌలు రైతులను జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని, రైతులకు ఇచ్చే పథకాలు అన్ని కౌలు రైతులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తార్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.మనోహర్, జి.శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాసులు రెడ్డి, వి.అన్వేష్, బి.దస్తగిరిరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డబ్ల్యూ రాము, సిపిఐ. (ఎం.ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి రమణ, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసులు, లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు కష్ణ, బిసి సంఘం జిల్లా అధ్యక్షులు అవ్వరు మల్లికార్జున, హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సి.ఆర్.వి.ప్రసాద్, సిపిఎం నగర కమిటీ సభ్యులు ఓబులేసు, చంద్రారెడ్డి, జనసేన నాయకులు మాలె శివ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి










