Apr 13,2023 22:26

24 ఏళ్ల తర్వాత డిఎస్‌సి అభ్యర్థికి పోస్టింగ్‌
ప్రజాశక్తి - పోలవరం

జీవితానికో భరోసా, ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న కల నెరవేరిన వేళ.. వచ్చే సంతోషం ఎలా ఉంటుందో చెప్పలేం.. అలాంటి ఘటనే డిఎస్‌సి 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థిలో కనిపించింది. 24 ఏళ్ల తర్వాత పాఠశాలలో పోస్టింగ్‌ రావడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వివరాలిలా ఉన్నాయి. డిఎస్‌సి 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల్లో కొణతాల నాగేంద్రప్రసాద్‌ ఒకరు.. 24 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఉపాధ్యాయ పోస్టింగ్‌కు ఆయన ఎంపికయ్యారు. మండలంలోని రేపల్లివాడ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించే అవకాశం దక్కింది. గురువారం ఉదయం ఆయన పాఠశాలకు వెళ్లి పాఠాలు చెప్పారు. దీంతో నాగేంద్రప్రసాద్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 24 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తమ కల నెరవేరిందని, మొదటి రోజు పాఠశాలకు వెళుతుంటే తన ఒళ్లు పులకించిందని ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని అన్నారు.ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తానన్నారు. డిఎస్‌సి 1998 ఉపాధ్యాయులుగా ఎంపికై తమతోపాటు పాఠశాలలో చేరిన తోటి ఉపాధ్యాయులకు కొణతాల నాగేంద్రప్రసాద్‌ శుభాకాంక్షలు తెలిపారు. 1998 డిఎస్‌సి క్వాలిఫైడ్‌ అభ్యర్థుల కోసం నిరంతరం కృషిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కతజ్ఞతలు తెలిపారు.