Nov 20,2022 22:07

ప్రజాశక్తి - ఏలూరు
             కేరళలోని శబరిమల యాత్రకు వెళ్లొస్తూ ప్రమాదానికి గురైన వారి కుటుంబ సభ్యులను తక్షణం క్షతగాత్రుల వద్దకు పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలను సిపిఎం బృందం ఆదివారం పరామర్శించింది. కేరళ బస్సు ప్రమాదంలో గాయపడిన మాదేపల్లి కాలనీకి చెందిన ప్రసాదం గోపీ, తరగర్ల రాజేష్‌, పాసెం మణికంఠ, బత్తిన రాజశేఖర్‌ కుటుంబాలను నేతలు కలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఎంఎల్‌ఎ, మంత్రి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన చికిత్స అందించేలా పర్యవేక్షించారన్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కుటుంబ సభ్యులంతా తమ వారు ఎలా ఉన్నారని అల్లాడుతున్నారని, ఇప్పటికైనా ఎంఎల్‌ఎ, జిల్లా అధికారులు స్పందించి క్షతగాత్రుల కుటుంబ సభ్యులను కేరళ పంపే ఏర్పాట్లు చేయాలని కోరారు. బృందంలో సిపిఎం నగర కార్యదర్శి పి.కిషోర్‌, నేతలు పివి.రామకృష్ణ, కె.రామాంజనేయులు, వివివిఎన్‌.ప్రసాద్‌, లెనిన్‌, జి.కోటేశ్వరరావు, ఎల్‌.సత్యనారాయణ, జి.రవి తదితరులు పాల్గొన్నారు.