Apr 22,2023 00:21

డముకు వారపు సంతలో చింతపండు విక్రయాలు


ప్రజాశక్తి -అనంతగిరి:
గిరిజనుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదు. ఎంతో శ్రమించి చింతపండును సేకరించి వారపు సంతకు తీసుకెళ్తున్నా దళారుల బారిన పడి మోసపోతున్నారు. దళారులు అంతా సిండికేట్‌గా మారి చింతపండును తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో, గిరిజనులకు రవాణా కూడా ఖర్చులు కూడా రాకపోవడంతో ఆర్థికంగా సతమతం అవుతున్నారు.
గిరిజన రైతులకు ఆదాయాన్నిచ్చే చింతపండు, జీడి పిక్కలకు గిట్టుబాటు ధర లభించ లేదు. దళారుల పెత్తనంతో గిరిజనులు మోస పోతున్నారు. జిసిసి ముందుకు వచ్చి డిఆర్‌ డిపోలు లేదా ప్రధానమైన వారపు సంతలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. మైదాన ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యాపారస్తులు గ్రామాలు, వారపు సంతలలో కేజీ చింతపండు రూ.20లకు కొనుగోలు చేయడమే కాకుండా కొలతలలో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. గిరిజనులకు తెలియకుండా 50 కేజీ తూనికల్లో . 15 నుండి 20 కేజీల వరకు మోసం చేస్తున్నారు. ఈ విధంగా గిరిజనుల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.
మండలంలోని పెద్దబిడ్డ, గుమ్మ, వాలసి, లుంగపర్తి, వెంగడ, అనంతగిరి, కొండిబా, బీంపోలు, గుమ్మకోట తదితర పంచాయతీ గ్రామాలలో ఒక్కొక్క రైతు 1000 నుండి 3000 కేజీలకు పైగా చింతపండు సేకరిస్తున్నారు. సేకరించిన చింతపండును రైతులు అనంతగిరి, డముకు, కాశీపట్నం, గుమ్మకోటలో వారపు సంతలలో విక్రయిస్తున్నారు. కిలో చింతపండు రూ.20లకు కొనుగోలు చేయడంతో గిరిజనుల కష్టానికి తగిన ఫతిఫలం లేకుండా పోతుంది.
ఇదిలా ఉండగా జీడి పిక్కలు కిలో రూ.90 నుండి 100ల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో కూడా తూనికలలో దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. బెట్టు కాటాలపై గతంలో గిరిజన సంఘాలు వారపు సంతల్లో పోరాటాలు నిర్వహించినప్పటికీ వాటిని సైతం లెక్క చేయకుండా ఇష్టాం రాజ్యంగా దళారులు వ్యవహరి స్తున్నారు. విజయనగరం, ఎస్‌.కోట, పెందుర్తి ఇతర మైదాన ప్రాంతాలకు చెందిన దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయవలసిన జిసిసి అధికారులు స్పందించక పోవడంతో దళారుల దందా కొనసాగుతుంది.