ప్రజాశక్తి - చిలకలూరిపేట, పెదనందిపాడు : కౌలురైతు చట్టాన్ని సవరించి భూ యజమాని సంతకం ఉంటేనే కౌల్దారుకు సిసిఆర్‌సి (గుర్తింపు) కార్డు ఇస్తామనే నిబంధనను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజార జాతా నెల్లూరు జిల్లా కొట్టిపాలెంలో ప్రారంభమై గురువారం గుంటూరు జిల్లా నాగులపాడు, పెదనందిపాడు పాలపర్రులో పర్యటించింది. అనంతరం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని వేలూరుకు చేరింది. ఆయా గ్రామాల్లో కౌలురైతులతో నాయకులు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది జనాభా వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్నారని, వ్యవసాయంలో 70 శాతం భూమిని కౌలురైతులే సాగు చేస్తున్నారని అన్నారు. అయితే ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల వ్యవసాయంలో వస్తున్న నష్టాలనూ కౌలురైతులే భరిస్తున్నారని చెప్పారు. రుణపరపతి లేకపోవడం, ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు పెరుగుదల, పెట్టుబడి ఖర్చు పెరగడం తదితర భారాలన్నీ కౌలురైతుల మీదే పడుతోందన్నారు. ఇంత చేసిన ప్రకృతి విపత్తులు సంభవించి పంట దెబ్బతింటోందని, అయినా పంటల బీమా, ఇతర పరిహారాలు కౌలురైతులకు దక్కడం లేదని అన్నారు. రిజర్వ్‌బ్యాంక్ నిబంధన ప్రకటన రూ.1.6 లక్షల వరకు హామీ లేకుండానే పంట రుణాలివ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదని చెప్పారు. గతంలో సాగు ధ్రువ పత్రాలు కౌల్దార్లకు కొంత అక్కరొచ్చినా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేసిందని చెప్పారు. భూయజమాని సంతకాన్ని తప్పనిసరి చేస్తూ కొత్తగా చట్టాన్ని తెచ్చిందని, దీని ప్రకారం కౌలురైతులు కార్డులు పొందడమే కష్టమైందని ఆవేదన వెలిబుచ్చారు. ఫలితంగా రుణాలు, పంటల బీమా, నష్టపరిహారాలు, రైతు భరోసా, రాయితీలు, సబ్సిడీలన్నీ కౌలు రైతులకు దూరమయ్యాయని వివరించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో అప్పులపాలైన కౌల్దార్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కౌల్దార్ల ఆత్మహత్యల్లో రాష్ట్ర దేశంలోనే రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్న కౌలురైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరల ప్రకారం రైతు భరోసాను రూ.25 వేలకు పెంచాలని, కేరళ తరహా రుణ విముక్తి చట్టాన్ని తేవాలని, దేవాదాయ భూముల కౌలు రైతులందరికీ కార్డులు, రుణాలు ఇవ్వాలని కోరారు. ఓసీలైన కౌలురైతులకూ గుర్తింపు కార్డులిచ్చి రైతు భరోసాను వర్తింపజేయాలన్నారు. కౌలురైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం 12న విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజీ మీదగా మంగళగిరిలోని సిపిఎల్‌ఎ కార్యాలయం వద్దకు ధర్నా ఉంటుందని, కౌల్దారంతా హాజరవ్వాలని కోరారు. యాత్రలో భాగంగా పాలపర్రులో పాతబాపట్ల తాలూకా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు జి.లక్ష్మీపతి, కె.శివనాగేశ్వరరావు, బి.శంకరయ్య, కె.వెంకటశివరావు, కె.వెంకట సుబ్బారావు, డి.రమేష్‌బాబు, సిహెచ్.యానాదులు, జె.రామారావు, ఎం.వెంకటేశ్వర్లు, బి.కామేశ్వరరావు, ఎ.భాస్కరరావు, బి.గోవిందు, ఎ.శ్రీనివాసరావు, బి.అంకమ్మ, జి.అమ్మయ్య, బి.రాంబాబు, జి.ఏడుకొండలు, కె.దామోదరం, పి.వెంకటేశ్వర్లు, ఎస్.బాబు, కె.రోశయ్య, ఎం.విల్సన్, జయపాల్, బి.నతానియేలు, సుధాకర్, సామ్యేలు, కె.విజరుకుమార్, ఎం.లక్ష్మయ్య పాల్గొన్నారు.










