Jul 07,2023 00:04

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి సాగునే నమ్ముకున్న కౌలు రైతుల పరిస్థితి నానాటికీ దుర్బరంగా మారుతోంది. సెంటు భూమి లేకపోయినా కుటుంబ పోషణ నిమిత్తం భూమిని కౌలుకు తీసుకుని సాగు చేపడుతున్నారు. వారికి ఎలాంటి ఆదరణా లేక అప్పుల్లో కూరుకుపోతున్నారు. రైతుగా పొందాల్సిన ఏ మేలూ వీరు పొందలేకపోతున్నారు. పంటరుణాలు, పెట్టుబడి సాయం, నష్టపరిహారం ఇలా ఏ ఒక్కటీ వీరికి అందట్లేదు. ఫలితంగా అప్పులు ఊబిలో కూరుకుపోయి చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటి యజమానికి కోల్పోవడంతో ఆ కుటంబాలు రోడ్డున పడుతున్నాయి.
కాకినాడ జిల్లా కరప మండలం యండమూరుకు చెందిన వనుం త్రిమూర్తులు కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. నాలుగేళ్లుగా వరుస నష్టాలను చవి చూశాడు. ఈ సమయంలో రూ.6 లక్షల వరకూ అప్పు చేశాడు. ఇది తీర్చే దారి లేక ఈ ఏడాది మే 23న త్రిమూర్తులు (48) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎరువులు, పురుగుల మందుల ధరలు నానాటికీ పెరిగిపోయాయని, ధాన్యానికి గిట్టుబాటు ధర రావట్లేదంటూ తరచూ చెప్పేవారని భార్య లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు అడపిల్లలతో ఉన్న తమకు దిక్కు ఎవరూ లేరని వాపోయింది. కౌలుదారు కార్డు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే రూ.7 లక్షల పరిహారం రాదని అధికారులు చెబుతున్నారని ఆమె కన్నీటి పర్యంతమైంది.
ఇదే నెల 24న తాళ్లరేవు మండలం చొల్లంగికి చెందిన కౌలు రైతు బొడ్డు గంగాధరరావు (46) పురుగ మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం కలిసిరాకపోవడంతో రూ.5 లక్షల వరకూ అప్పులు చేశాడు. తీర్చే దారి లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారడంతో కొంతకాలం క్రితం తమ కుమార్తె ఇంటర్‌ చదువును మధ్యలో నిలిపివేశామని భార్య వరలక్ష్మి తెలిపింది. ఈ ఏడాది 18న కాజులూరు మండలం చేదువాడకు చెందిన గుండుపల్లి ఆంజనేయులు (41) అనే దళిత కౌలు రైతు కూడా రూ.10 లక్షల మేర అప్పులు ఉండటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 6 ఎకరాలు సాగు చేయగా ప్రతి పంట లోనూ నష్టం వచ్చింది. ఆయన మతితో భార్య దుర్గ, ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇదే మండలం దగ్గుదూరుకు చెందిన బొడా చిట్టిబాబు (46) అనే మరో దళిత కౌలు రైతు జూన్‌ 1న సాగు చేస్తున్న పొలంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాడు. నాలుగేళ్లుగా ప్రకృతి విపత్తులతో నష్టపోయాడు. పరిహారం కూడా అందకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా ట్రాక్టర్‌ను కొనుగోలు చేయగా రూ.14 లక్షలకు ప్రతినెల వాయిదాలు చెల్లిస్తున్నాడు. రూ.5 లక్షలు వరకూ అప్పులు ఉన్నాయి. తీర్చే వీలులేక మనస్తాపానికి గురై బలవన్మరణం పొందాడు.. తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ ఇబిసి కాలనీకి చెందిన బావిశెట్టి శ్రీనివాసరావు (43) అనే కౌలు రైతు కూడా ఈ నెల 2న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కౌలు చట్టంలో మార్పులతో సాయానికి దూరం
వైసిపి అధికారంలోకొచ్చిన తర్వాత కౌలు చట్టంలో మార్పులు తెచ్చింది. కొత్తగా వచ్చిన నిబంధనలు కౌలురైతులను నట్టేట ముంచుతున్నాయి. కౌలు రైతుకు సిసిఆర్‌ కార్డు జారీ కోసం భూ యజమాని అంగీకారం పత్రం ఇవ్వడం లేదు. ఈ నిబంధన తప్పనిసరి కావడంతో రైతు భరోసా, పంట నష్టపరిహారం, పంట రుణాలు, పంటల బీమా వంటి పథకాలను కోల్పోతున్నారు. చివరకు చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే రూ.7లక్షల పరిహారం కూడా అండడం లేదు. చనిపోయిన కౌలు రైతుల్లో నలుగురికి సీసీఆర్‌ కార్డులు జారీ కాలేదు. ఎరువులు,పురుగుల మందుల ధరలు,పెట్టుబడులు పెరిగడంతో అప్పులు కూడా రైతులకు పెరిగిపోతున్నాయి. పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
వాస్తవ సాగుదారులకు మొండి చేయి
వాస్తవ సాగుదారుల్లో నాలుగో వంతు మందికి కూడా సాగు హక్కు పత్రాలు అండడం లేదు. సిసిఆర్‌ కార్డులు అందించడంలో ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించడంలోనే లోపం కనిపిస్తుంది. కాకినాడ జిల్లాలో 2.20 మంది రైతులకు 1.76 లక్షల మంది అంటే 80 శాతం మంది కౌలు రైతులే వాస్తవ సాగుదారులుగా ఉన్నారు. అయితే ప్రభుత్వం 50 వేల లోపే సిసిఆర్‌సి కార్డులను ఇచ్చింది. భూ యజమాని అంగీకార పత్రం తప్పనిసరి అని ప్రభుత్వం నిబంధనలు విధించడంతోనే వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు అన్యాయం జరుగుతోంది.