Nov 19,2023 23:43

భర్త వినాయకరావుతో సుజాత

* చీము పట్టి కాలు పోగొట్టుకున్న భర్త
* రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారుడు
* ఒంటరి పోరాటం చేస్తున్న మాతృమూర్తి
ఇద్దరు పిల్లలతో ఆ కుటుంబం సాఫీగా సాగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలో కొడుకు ప్రాణాలు కోల్పోతే, కాలికి తగిలిన గాయం వ్యాధిగా మారి చివరికి భర్త కాలునే తొలగించాల్సి వచ్చింది. మరోవైపు వృద్ధాప్య దశలో ఉన్న అత్త మంచానికే పరిమితమైంది. దీంతో అటు ఆస్పత్రిలో భర్త, మంచంపై ఉన్న అత్తకు సపర్యలు చేస్తుంది ఆ ఇల్లాలు. కనీసం ఇల్లు నడిపేందు కూ డబ్బులు లేక ఆర్థిక సమస్యలు ఎదు ర్కొంటోంది. ఓవైపు కన్న కొడుకు పోయాడన్న దు:ఖం లో ఉండ గానే, ఇటు భర్త కాలూ తీసివేయడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. అటు వారిని చూసుకోలేక ఇటు ఎవరి వద్ద చేయి చాచలేక దాతల సాయం కోసం ఎదురుచూపులు చూస్తోంది ఆ మాతృమూర్తి.
ప్రజాశక్తి- కవిటి: 
వివరాల్లోకి వెళ్తే... కవిటి మండలం వరకకు చెందిన ఎన్ని వినాయకరావు ఉపాధి నిమిత్తం విశాఖపట్నంలో ఓ ప్రయివేట్‌ పాఠశాలలో బస్సు డ్రైవరుగా పనిచేస్తుండగా, అతని భార్య సుజాత మరో ప్రయివేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయనిగా పనిచేస్తుండేవారు. తమకు వచ్చిన ఆదాయంతో వినాయకరావు తల్లి, తమ ఇద్దరు పిల్లలతో సంసారం సాగిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు దూరమయ్యాడు. అక్కడికి కొద్ది రోజులకే వినాయకరావు కాలుకు తగిలిన చిన్న గాయం పెద్దదిగా మారి పుండుగా తయారైంది. కాలును పరీక్షించిన వైద్యులు కాలు తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని వినాయకరావు కాలు తొలగించారు. దీంతో వినాయకరావు తల్లి ఇటు ఇంట్లో పరిస్థితులు, అటు వృద్ధాప్య సమస్యలతో మంచం పట్టింది. అప్పటి నుంచి అటు ఆస్పత్రిలో ఉన్న భర్త, ఇంట్లో మంచంపై ఉన్న అత్తకు సుజాతే దిక్కైంది. ఓవైపు ఊపిరి సలపని ఒత్తిడి, మరోవైపు ఉపిరాడనివ్వని ఆర్థిక సమస్యలు సుజాతను చుట్టుముట్టాయి. ఇప్పటి వరకూ తనకాళ్లపై తాను నిలబడి కుటుంబానికి చేయూతనిచ్చిన ఆమెకు ఇప్పుడు వేరేవారిని ఆశ్రయించేందుకు మనసు అంగీకరించడం లేదు. కానీ, అటు ఆస్పత్రి ఖర్చులు, ఇటు అత్తకు మందులతో పాటు పూట గడవడం కూడా కష్టంగా మారింది. 'కార్యేషు దాసి.. కరణేషు మంత్రి' అంటూ చెప్పినట్టు భర్త, అత్తకు సపర్యలు చేస్తున్న సుజాత ఆర్థిక వనరులకు దూరమై ప్రస్తుతం దాతల సాయం కోసం భారమైన హృదయంతో ఎదురుచూస్తోంది. దయార్థ్ర హృదయాలు తమ ఎస్‌బిఐ అకౌంట్‌ నంబరు 1644706499 (ఐఎఫ్‌ఎస్‌సి 0010574)కు కానీ, ఫోన్‌ పే నంబరుకు 7780578629 కానీ ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటోంది.