Jul 10,2023 00:14

ప్రజాశక్తి-గుంటూరు: పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్‌వాడీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. చాకిరి బారెడు, జీతం మూరెడు అనే చందంగా వీరి పరిస్థితి ఉంది. సమస్యల పరిష్కారానికి ఎన్నో వినతులు, ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వాల చెవికి ఎక్కట్లేదు. పేరుకు ప్రభుత్వం ఉద్యోగం అయినా కనీస వేతనాలుగానీ, రిటైర్మెంట్‌ బెన్ఫిట్స్‌గానీ ఏమీ అమలు కావట్లేదు. జాబ్‌చార్ట్‌తో సంబంధం లేని అనేక పనులను వీరితో చేయిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం అయ్యాయి. సంక్షేమ పథకాలూ వర్తింప చేయట్లేదు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీలు పోరాటానికి సన్నద్ధమయ్యారు. సోమ, మంగళవారాల్లో కలెక్టరేట్‌ వద్ద 36 గంటల నిరసన చేపట్టారు.
గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ రక్తహీనత నివారించటంలో, పిల్లలు ప్రైమరీ విద్యకు సన్నద్ధం చేయటంలో అంగన్‌వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పేద మహిళలు, పిల్లల సంక్షేమం కోసం పనిచేస్తున్న అంగన్‌వాడీల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రతి ఏటా బడ్జెట్‌లో ఐసిడిఎస్‌కు నిధులు కుదిస్తూ నిర్వీర్యం చేయాలని చూస్తోంది. చట్టాలు సాధించుకోవటంతోపాటు, ఉన్న చట్టాలు అమలు చేయించుకోవటానికీ పోరాడాల్సి వస్తోంది.
విభజిత గుంటూరు జిల్లాలో ఆరు ప్రాజెక్టుల పరిధిలో 1500 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిల్లో 3 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పని చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో 2006 సెంటర్లున్నాయి. వీటిల్లో 4020 మంది టీచర్లు, ఆయాలు పని చేస్తున్నారు. టీచర్లకు రూ.11500, ఆయాలకు రూ.7 వేలు ఇస్తున్నారు. అంటే రోజుకు టీచర్లకు రూ.383, ఆయాలకు రూ.233 మాత్రమే వస్తోంది. ప్రస్తుత జీవన ప్రమాణాలు, పెరుగుతున్న నిత్యావసర ధరల ప్రకారం చూస్తే రోజువారీ కూలీలకు ఇచ్చే కూలిలో సగం వేతనం కూడా అంగన్‌వాడీలు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వం ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వేతనాలు ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో అమలు చేయనేలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్లకు రూ.13500, ఆయాలకు రూ.10 వేలు ఇస్తున్నారు.
సంక్షేమం అందని ద్రాక్ష
అంగన్‌వాడీల సంక్షేమం కలగానే మిగిలింది. సామాజిక భద్రత కల్పించే చర్యలు శూన్యం. 2008లో కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు రూ.1500 వేతనం పెంచుతున్నట్లు ప్రకటించినా ఇంకా అమలు చేయనేలేదు. 25 ఏళ్లకుపైగా సేవలు అందించిన వీరికి రిటైర్మెంట్‌ బెన్ఫిట్స్‌ కింద ఎంగిలి మెతుకులు విదిల్చినట్లు టీచర్లకు రూ.50 వేలు, ఆయాలకు రూ.20 వేలు ఇస్తున్నారు. వీటిని రూ.5 లక్షలకు పెంచాలని సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు. మెడికల్‌ లీవులు లేవు. ఏదైనా అనారోగ్యం వస్తే సెలవులు పెట్టుకుంటే ఆయా రోజులకు వేతనాలు కట్‌ చేస్తున్నారు. నెలలో రెండుసార్లు ప్రాజెక్ట్‌, సెక్టార్‌ మీటింగ్‌లకు అంగన్‌వాడీలు హాజరు కావాలి. అయితే అందుకు టిఎ బిల్లులు ఇవ్వాల్సి ఉన్నా 2017 నుండి ఇవ్వట్లేదు. దీంతో ఆ భారం కూడా అంగన్‌వాడీలు వారి వేతనాల నుంచే భరించాల్సి వస్తోంది. వేతనాలు కూడా సకాలంలో రావట్లేదు. రెండు నెలలకోసారి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంక్షేమ పథకాలు ఒక్కటీ వీరికి వర్తించడం లేదు. పథకాలకు దరఖాస్తు చేసుకుంటే సచివాలయాల్లో మీరు ప్రభుత్వ ఉద్యోగులని, మీకు ఏ పథకమూ వర్తించదని చెబుతున్నారని అంటున్నారు. అంగన్‌వాడీల పిల్లలకు అమ్మఒడి, జెవికె కిట్లు దక్కట్లేదు. చేయూత, 200 యూనిట్లలోపు వినియోగించుకున్న వారికి ఉచిత విద్యుత్‌ పథకం, ఇతర పధకాలు ఏవీ అమలు కావట్లేదు. చనిపోయిన అంగన్‌వాడీలకు కనీసం మట్టిఖర్చులు కూడా ఇవ్వట్లేదు.
ఉత్తర్వులున్నా పథకాలు అమలు చేయట్లేదు
దీప్తి మనోజ, అంగన్‌వాడీ యూనియన్‌ గుంటూరు జిల్లా కార్యదర్శి

గతంలో చేసిన అనేక ఆందోళనల వల్ల అంగన్‌వాడీలకూ సంక్షమ పథకాలు వర్తింపజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉత్తర్వులు ఇచ్చినా అమలు కావట్లేదు. పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మా పేర్లను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, కనీస వేతనాలు అమలు చేయాలి. ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తే రానున్న కాలంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం.
ప్రభుత్వం చర్చలకు పిలవాలి
గుంటూరు మల్లేశ్వరి, అంగన్‌వాడీ యూనియన్‌ పల్నాడు జిల్లా కార్యదర్శి

తెలంగాణ ప్రభుత్వం కంటే రూ.వెయ్యి అదనంగా వేతనం ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలు గ్రాట్యుటీ ఇవ్వటానికి ఉత్తర్వులు ఇచ్చాయి. ఏపీలో కూడా అమలు చేయాలి. ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచాలి. స్కూల్‌ పిల్లలకు ఇచ్చినట్లు యూనిఫాం, షూస్‌ ఇవ్వాలి. పిల్లల్ని ఆడించాల్సిన అంగన్‌వాలకు ఫోన్లు ఇచ్చి, రకరకాల యాప్‌లతో వేధింపులు ఆపాలి. సమస్యలపై చర్చలకు పిలవాలి.