Dec 10,2021 06:57

ఖరీఫ్‌ సీజనంతా తుఫానులు, వరదలు, తెగుళ్లు, నాశిరకం, కల్తీ విత్తనాలతో మొత్తం నష్టపోయారు. రబీలో వేసిన సెనగ, మినుము పంటలు కుడా దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని చెప్పి చేతులు దులుపుకొంది. వాస్తవానికి దెబ్బతిన్న పంటలను సాగు చేస్తున్నది 90 శాంతం కౌలురైతులే. వీరిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రణాళికలే లేవు.

    ఒకవైపు తుఫానులు, వరదలు...మరోవైపు కల్తీ, నాశిరకం విత్తనాలతోపాటు అంతు చిక్కని తెగుళ్ల వలన రాష్ట్ర రైతాంగం కుదేలు అవుతున్నది. తుఫానులు, వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమైనాయి. కల్తీ, నాశిరకం విత్తనాలతో పంటలు దెబ్బతిన్నాయి. తామర పురుగు రావటంతో మిరపను దున్నేస్తున్నారు. ఎకరానికి లక్షలాది రుపాయల పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయానికి ప్రకతి విపత్తుల వలన పంటలన్నీ ధ్వంసం అయినాయి. కౌలురైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నవంబర్‌లో వచ్చిన వానల వలన 13.27 లక్షల ఎకరాల్లో ఆహార, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. రూ.3300 కోట్ల నష్టం జరిగింది. వరి పంట ఊడ్చుకుపోయింది. సెనగ పోలంలోనే కుళ్ళిపోయింది. మినుము, మొక్కజొన్న తదితర పంటలు లక్షల ఎకరాల్లో చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎకరానికి రూ.5 నుండి రూ.7 వేల వరకు సాగు ఖర్చులు పెరిగాయి. ఎకరానికి రూ.40 వేలు పెట్టుబడి పెట్టారు. భూ యజమానికి 25 బస్తాల కౌలు ఇవ్వాలి. సార్వ పంట వరదల పాలైంది. దాళ్వ పంటకు నీరు ఇచ్చేది లేదని ప్రభుత్వం చెబుతున్నది. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి కౌలు వ్యవసాయం చేస్తున్న మధుర సాయిబాబుకు చెందిన పంట మొత్తం నీట మునిగి పోవడంతో అప్పుల బెంగతో గుండె పోటుతో మరణించాడు. భార్యాబిడ్డలు దిక్కులేని వారయ్యారు. రూ. 15 లక్షల అప్పు ఉంది. ఈ విధంగా డెల్టా ప్రాంతాల్లో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం పరిహారం కూడా వచ్చే దిక్కు లేదు. కౌలురైతు గుర్తింపు కార్డులేదు. రైతు భరోసా రాదు. పంట రుణాలు ఇవ్వటంలేదు. ఇవిగాక, ఇ-క్రాప్‌ బుకింగ్‌ భూ యజమాని పేర చేశారు. దాంతో కౌలురైతుల జీవితాలు సుడిగుండంలో చిక్కుకున్నాయి. తడిసిన ధాన్యం కొనటంలేదు. గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర మాయమైపోతున్నది. మార్కెట్‌ ధర దిక్కైంది.
    వరి పంటతోపాటు ఇతర పంటలను పరిశీలిస్తే ఊహకు అందని విషాదం కౌలు రైతాంగంలో ఉంది. వాణిజ్య పంటలో ప్రధాన పంట పత్తి. ఈ సంవత్సరం కూడా గూలాబి రంగు పురుగు పత్తి పంటను మింగేసింది. దీనికి తోడు అధిక వర్షాల కారణంగా పత్తి రంగు మారింది. సీజన్‌ ప్రారంభంలో క్వింటా రూ.8 వేలు ఉంది. రంగు మారిందని, గుడ్డి పత్తని చెప్పి రేటు తగ్గించి కొంటున్నారు. ఎకరానికి రెండు లేక మూడు క్వింటాలు వచ్చే పరిస్థితి లేదు. ఇది ఇలా ఉండగానే కావేరి కంపెనీకి చెందిన ఈ జాదు వెరైటీ విత్తనం ఫెయిల్‌ అయింది. కర్నూలు జిల్లాలో పత్తి పంట పూత, కాయ లేకుండా పోయింది. ఎకరానికి రూ.50 వేలు పెట్టుబడైంది. కౌలు మరో రూ.30 వేలు పైనే. అది కూడా ముందస్తు కౌలు చెల్లింపు కావడంతో కౌలురైతులు నిండా మునిగిపోయారు. మిరప రైతుల గోడు వినేవాడే లేడు. గత సంవత్సరం మిర్చికి రేటుందని ఈ సంవత్సరం సాగు పెరిగింది. గత సంవత్సరం 3.47 లక్షల ఎకరాలు సాగు చేయగా ఈ సంవత్సరం 4.59 లక్షల ఎకరాలకు విస్తరించింది. అంటే 1.11 లక్షల ఎకరాలకు పెరిగింది.
     గుంటూరు జిల్లాలో 2.41 లక్షలు, ప్రకాశం జిల్లాలో 94 వేలు, కర్నూలు జిల్లాలో 58 వేలు, కష్ణా జిల్లాలో 35 వేలు ఎకరాలు సాగు అయింది. గత కొన్నేళ్లుగా జెమిని వైరస్‌ (బొబ్బర తెగులు) మిరప పంటను నమిలేస్తున్నది. దీనికి తోడు తామరపురుగు తోడైంది. లక్షలాది ఎకరాల్లో మిరప పంట తామరపురుగు తినేసింది. పంటను దున్నివేయడం తప్ప మరో మార్గం కౌలురైతులకు కనపడటం లేదు. కొన్ని ప్రాంతాల్లో కోతుల బెడద ఉంది. మందలకు మందలు పోలాల్లో పడి పంటలను దూసివేస్తున్నాయి. ఎకరానికి రూ.80 వేల నుండి రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. కౌలు రూ.40 వేల పైమాటే. బొబ్బరను తట్టుకొనే రకాలని కల్తీ, నాశిరకం విత్తనాలు, మిరపనారు అమ్మకం విచ్చలవిడిగా జరుగుతున్నది. ఈ సంవత్సరం నాశిరకం విత్తనాలు అంటగట్టారు. ఆశ్చర్యం ఎమిటంటే ఈ కంపెనీలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'రైతు భరోసా' కేంద్రాల్లో ఉన్నాయి. ఇంతవరకు ఒక్కరి పైన కూడ కేసులు పెట్టలేదు. ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. ఖరీఫ్‌ సీజనంతా తుఫానులు, వరదలు, తెగుళ్లు, నాశిరకం, కల్తీ విత్తనాలతో మొత్తం నష్టపోయారు. రబీలో వేసిన సెనగ, మినుము పంటలు కుడా దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని చెప్పి చేతులు దులుపుకొంది. వాస్తవానికి దెబ్బతిన్న పంటలను సాగు చేస్తున్నది 90 శాంతం కౌలురైతులే. వీరిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రణాళికలే లేవు.
     ఎన్యుమరేషన్‌ సందర్భంగా కౌలు రైతులను గుర్తించి వారిని ఆదుకోవడానికి తక్షణమే ముందుకు రావాలి. వరదలు, తుఫాన్లు, తామర పురుగు, నకిలీ విత్తనాల వలన పంట నష్టపోయిన కౌలు రైతులను గుర్తించి పంటల వారీగా నష్టపరిహారం చెల్లించాలి. ఎన్యుమరేషన్‌ సందర్భంలో ఇ-క్రాప్‌ బుకింగ్‌తో సంబంధం లేకుండానే కౌలు రైతుల పేర్లను నమోదు చేసి వారికే బ్యాంకు ఖాతాలో డైరెక్టుగా పరిహార సొమ్మును జమ చేయాలి. తడిసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. పదే పదే నాసిరకం విత్తనాలు అమ్ముతున్న కంపెనీలపై, యాజమాన్యంపై కొరడా ఝుళిపించాలి. క్రిమినల్‌ కేసులు పెట్టి తక్షణమే అరెస్ట్‌ చేయాలి. అటువంటి కంపెనీలను రైతు భరోసా కేంద్రాల నుండి తొలగించాలి. కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్లో విత్తనాలు అమ్మకుండా నిషేధించాలి. ఇ-క్రాప్‌ బుకింగ్‌ చేయించుకున్న కౌలు రైతులకు రైతు భరోసా, పంట రుణాలు తక్షణమే అందించి ఆదుకోవాలి. మిరప, అరటి తదితర పంటలకు వాతావరణ బీమా పథకాన్ని వర్తింపచేసి కౌలు రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.
 

/ వ్యాసకర్త:ఎ.పి కౌలురైతుల సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి /
పి.జమలయ్య

పి.జమలయ్య