ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ధరలు లేక తాము ఆర్థికంగా నష్ట పోతున్నా రైతులు తమ ఉదారతను చాటుకుంటున్నారు. కూరగాయలు ధరలు పడిపోయి కోత కూలి కూడా రాని పరిస్థితుల్లో వాటిని ఉచితంగానే కోసుకెళ్లాలని దారిన పోయే వారిని చెబుతున్నారు.
ఇటీవల కొంతకాలం కూరగాయలు ధరలు ఆశాజనకంగా ఉన్నా నెల రోజులుగా ధరలు పతనమవుతున్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరలను నిర్ణయించి రైతులేను దోచుకుంటున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కూరగాయల ధరలు పెరుగుతాయి. అయితే తొలకరి వర్షాలతో అన్ని ప్రాంతాల్లో కూరగాయలు ఎగుమ తులు, దిగుమతులతో తగ్గుముఖం పడతాయి. జూలై, ఆగస్టు నెల నాటికి కూరగాయల ధరలు సాధారణ స్థాయికి చేరుతాయి. అయితే ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. వర్షాలు అనుకూలించకున్నా ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తున్న రైతులు తాజా ధరలతో తమకు కోత కూలి కూడా రాదని వాపోతున్నారు. మరికొందరు రైతులతే పంటను కోయకుండా తోటలనే దున్నేయాలని చూస్తున్నారు.
నరసరావుపేట మండలంలో ఉప్పలపాడు, అర్వపల్లి, గురవాయపాలెం, తురకపాలెం, పమిడిమర్రు, కొండకావూరు తదితర గ్రామాలలో ఓగేరు వాగు నీటితో పాటు, అందుబాటులో నీటి వనరులు ఉన్న రైతులు బెండ, దొండ, టమాటా, మునగ, చిక్కుడు, సొర, గుమ్మడి, దోస తదితర కూరగాయల పంటలు 375 ఎకరాలకుపైగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాల్లేక వరి, పత్తి, మిర్చి సాగు చేసే రైతులు సైతం కొద్దిపాటి నీటితో సాగు చేసే కూరగాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. వీరంతా ఈ పంటను నరసరావుపేటలోని మార్కెట్‌లో కమీషన్ వ్యాపారులకు పంటను అమ్ముతుంటారు. ఈ క్రమంలో దళారులు ధరలను పడేయడంతో కూరగాయల సాగుకు రైతులు వెనకడుగేస్తున్నారు.
కూరగాయలు సాగు చేయాలంటే దుక్కి దున్నడం దగ్గర నుండి విత్తన కొనుగోలు వరకు, మొక్క పెరిగిన తర్వాత చీడ పీడలు, తెగుళ్ల బెడద, నీటి కష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ సవాళ్లనింటిని తట్టుకుని పంటను పండించిన రైతు చివరకు దళారి చేతిలో దోపిడీకి గురై అప్పుల పాలవుతున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్లో రూ.30-50 వరకూ వివిధ రకాల కూరగాయల ధరలు పలుకుతున్నాయి. ఇందులో పదో వంతు కూడా రైతులకు దక్కడం లేదు. దొండ రూ.3, బెండ రూ.6-7, టమాటా రూ.5-6 కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ.30 వరకూ ఉంది. రైతుకు మాత్రం రూ.10 కూడా దక్కడం లేదు. నెల కిందట దొండకాయ రూ.20 వరకు, బెండ కాయ రూ.18 వరకు, టమాటాలు రూ.15 వరకూ రైతులు అమ్ముకున్నారు. ఇప్పుడు అందులో సగం ధర కూడా దక్కడం లేదు. తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్నా బావులు, ఇంజిన్ల ద్వారా నానా కష్టాలు పడి పొలాలకు నీరు పెట్టుకున్నామని, రేయింబవళ్లు కంటికి రెప్పలా పైరును కాపాడుకున్నామని, పంట చేతికొచ్చే సరికి నష్టాలే ఎదురవుతున్నాయని రైతులు ఆవేదనకు గురవుతున్నారు.
ధర తక్కువంటే పంట కొనరు
చప్పిడి లక్ష్మయ్య, ఉప్పలపాడు.
రెండెకరాలు కౌలుకు తీసుకున్నాను. ఎకరాకు రూ.15 వేలు చొప్పున ముందుగానే కౌలుచెల్లించి దొండ, బెండ, వంగ తోటలు సాగు చేశాను. పంటను మార్కెట్‌లో వ్యాపారుల వద్దకు తీసుకెళ్తే 50 కిలోల దొండకాయలు రూ.150/-200కు, వంకాయలు రూ.250కు, బెండకాయలు రూ.300-350కు కొంటున్నారు. ఇంత తక్కువెందుకని అడిగితే అసలు కొనరు. ఈ ధరలతో కోత కూలి ఖర్చులు కూడా రావడం లేదు. ఇంకా రెండు నెలలపాటు బెండ పంట వచ్చే అవకాశం ఉన్నా దాన్ని దున్నేసి వేరే పంట వేద్దామని నిర్ణయించుకున్నా.
మాకు రూ.6.. జనాలకు రూ.30
సుశీల, ఉప్పలపాడు
కిలో బెండ విత్తనాలను రూ.4 వేలకు కొని 80 సెంట్లలో 4 కిలోల విత్తనాలు నాటాం. ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులకు రూ.60 వేలు వరకు పెట్టుబడులు అయ్యాయి. తీరా పంట చేతికొచ్చే నాటికి కిలో రూ.6కు మించి దక్కడం లేదు. బయట మార్కెట్లో మాత్రం జనాలకు రూ.30-50 వరకూ అమ్ముతున్నారు.
ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి
ఏపూరి గోపాలరావు, రైతు సంఘం, పల్నాడు జిల్లా కార్యదర్శి.
రైతు కష్టాన్ని, నష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా కూరగాయల సాగు చేస్తున్న రైతులను గుర్తించి ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకోవాలి. దళారీ వ్యవస్థ నియంత్రించాలి. రైతు బజారు ఏర్పాటు చేసి రైతుకు కనీస మద్దతు ధర దక్కేలా చూడాలి.










