
ప్రజాశక్తి గుడిబండ : ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని రంగాల్లోనూ అత్యంత వెనుకబడిన ప్రాంతం మడకశిర నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని గుడిబండ, రొళ్ల, అగలి, అమరాపురం, మడకశిర, మండలాలు కర్నాటక రాష్ట్రం సరిహద్దు ప్రాంతాలకు ఆనుకుని ఉన్నాయి. ఈ ఐదు మండలాల్లో ఎక్కువ శాతం జనాభా ఉన్న యాదవ సామాజికవర్గం గొర్రెల మేపుకుంటూ జీవనం సాగిస్తోంది. గొర్రెలు మేపుకుంటూ వాటిని సంరక్షించుకోవడానికి వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారు ఒకసారి గొర్రెలను తీసుకొని మేపడానికి ఊరు వదిలి వెళితే సంవత్సరం తర్వాత గాని వారి గ్రామాలకు గొర్రెలతో పాటు రారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన గొర్రెల కాపర్లు జట్లు, జట్లుగా ఏర్పడి అక్కడక్కడ రైతుల పొలాల్లో రాత్రి వేళల్లో గొర్రెలను మందను ఏర్పాటు చేసుకొని ఉంటారు. 15 రోజుల నుంచి నెల దాకా రైతుల పొలాల్లో గొర్రెలు, గొర్రె పిల్లలకు స్థావరాలు ఏర్పరచుకొని రాత్రివేళలో కంటికికునుకు లేకుండా రాత్రంతా మేలుకొని గొర్రెలను, గొర్రె పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటారు. వీరు రైతుల ఇచ్చిన బియ్యం, పిండి, కూరగాయలతో వంటలు వండుకొని అక్కడే తిని పండుకుంటుంటారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాల్లో గొర్రెలను మేపుకుని తిరి సాయంత్రానికి గొర్రెల మంద స్థావరాలకు చేరుకొని అన్నం వండుకొని తిన్న తర్వాత రాత్రంతా మేలుకొని గొర్రెల్ని, గొర్రె పిల్లలకు కాపలాగా ఉంటారు. రాత్రి వేళల్లో వారు అడవుల్లో ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేక టార్చ్ లైట్లు వెలిగించుకొని జాగారణ చేస్తుంటారు. వాననకా, ఎండనకా అక్కడే కాలం గడుపుతుంటారు. ఇక వర్షాకాలంలో ఉరుములు, పిడుగులకు భయపడకుండా విష జంతువులు, ఎలుగుబంట్ల దాడుల నుంచి తమ గొర్రెలను రక్షించుకుంటూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అడవుల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం చేస్తుంటారు. చాలా సందర్భాల్లో రాత్రి వేళల్లో గొర్రెల మందపై చిరుతలు, వీధికుక్కలు దాడులు చేసి గొర్రె పిల్లల్ని మేక పిల్లల్ని చంపిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఇక గ్రామాల్లో ఎలాంటి పండుగలు పబ్బాలు జరిగిన గొర్రెల కాపర్లు వాటికి దూరమై సంవత్సరాల తరబడి తల్లిదండ్రులను, భార్య పిల్లల్ని, వదిలి వందలాది కిలోమీటర్ల దూరంలో జీవనం సాగిస్తుంటారు. రాత్రివేళల్లో గొర్రెల కాపర్లు విషపురుగులు, పాముకాటుకు గురై వారికి అడవుల్లో సరైన చికిత్స అందక ఎంతోమంది మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలా మృతిచెందిన గొర్రెల కాపరుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకున్న దాఖలాలు లేవు. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఎంత మంది ప్రజాప్రతినిధులు మారినా తమ గొర్రెల కాపరుల బ్రతుకులు మాత్రం మారలేదనీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మడకశిరనియోజకవర్గంలో యాదవ సామాజికవర్గానికి చెందిన ఇరువురు ముఖ్య నేతలు మాజీమంత్రి రఘురారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా గొర్రెల కాపర్ల సమస్యల పరిష్కారంపై దష్టి సారించకపోవడం శోచనీయమని గొర్రెలకాపరులు వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వాలు స్పందించి గొర్రెల కాపరుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని గొర్రెలకాపరులు కోరుతున్నారు.