Jul 09,2023 23:52

స్వాధీనం చేసుకున్న తుపాకీని చూపుతున్న పోలీసులు

ప్రజాశక్తి-పాడేరు:క్షణికావేశంతోనే గిరిజన యువకుడు కొండపల్లి కొండలరావు తన నాటు తుపాకీతో మెడ వద్ద కాల్చుకొని ప్రాణాలు బలి తీసుకున్నాడని పాడేరు పోలీస్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ సుధాకర్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌ లక్ష్మణ్‌ వెల్లడించారు. మండలంలోని దేవాపురం పంచాయతీ ఢకొీత్తూరు గ్రామంలో శుక్రవారం రాత్రి తుపాకీ తూటాకు గిరిజన యువకుడు కొండపల్లి కొండలరావు బలైన సంగతి విధితమే. ఈ సంఘటనపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పాడేరు పోలీసులు విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ సంఘటనపై శనివారం గ్రామానికి వెళ్లి పరిశీలించి గ్రామస్తుల ద్వారా వివరాలు సహకరించినట్లు తెలిపారు. హతుడు కొండలరావు శుక్రవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటలకు ఢకొీత్తూరు గ్రామానికి కొంత దూరంలో ఉన్న కొండపై చీపురు మొక్కలు నాటడానికి వెళ్ళాడని, అదే సమయంలో ఇదే గ్రామానికి చెందిన కొండపల్లి లక్ష్మి మేకలను తోలుకొని వెళుతుంది. కొండలరావు నాటుతున్న మొక్కలను మేకలు వేయడంతో ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగిందని తెలిపారు. తరువాత అదే రోజు సాయంత్రం కొండపల్లి లక్ష్మి గ్రామంలో అందరి వద్దకు వెళ్లి కొండలరావు తనను చెయ్యి పట్టుకొని లాగి బలాత్కారం చేయబోయాడని, ఈ విషయమై గ్రామంలో రచ్చబండ వద్దకు సమావేశానికి రావాలని చెప్పింది. ఈ విషయం కొండలరావు తెలుసుకొని రాత్రి 10 గంటల సమయంలో తన వద్ద ఉన్న నాటు తుపాకీ పట్టుకొని లక్ష్మీ ఇంటి వద్ద కు వెళ్లి తనపై ఊరందరికీ చెప్పి పరువు తీస్తున్నావని ఆమెతోనూ, ఆమె భర్త రామకృష్ణ తోను గొడవపడ్డాడని, తన నాటు తుపాకీతో మెడ వద్ద కాల్చుకొని చనిపోయాడని వారు స్పష్టం చేశారు. కొండలరావును లక్ష్మీ ఆమె భర్త రామకృష్ణ కలిసి తుపాకీతో కాల్చి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ కొండలరావు కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేశారని, దీనిపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసుకు సంబంధించి తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదని వెల్లడించారు.