వినుకొండ: ఆత్మ హత్య నివారణ దినోత్సవం సందర్భంగా పట్ట ణంలోని విశ్వ సాయి జూనియర్ కళాశాలలో ఆదివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆవేశానికి లోనై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, కుటుంబం గురించి, పొందబోయే అద్భుతమైన జీవితం గురించి ఆలోచించాలని స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెక్రటరీ నాగాంజనేయులు, వినుకొండ బీఈడీ కళాశాల డైరెక్టర్ గాలి శ్రీనివాసరావు విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. క్షణిక ఆవేశాలకు లోనై అందమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని, చిన్న వయసులో ఓటమిని పొందిన వాడే గొప్ప విజేతగా నిలుస్తాడని అన్నారు. ఎందరో మహానుభావులు ఇలాగే ఆదర్శవంతులుగా మారారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు జీవన లక్ష్యం సాధించేందుకు ఎంతో తోడ్పాటు అందిస్తాయని విద్యార్థులు సంస్కారవంతమైన విద్యను అభ్యసిస్తూ అందరికీ ఆదర్శవంతులుగా మీరు మారాలని కళాశాల డైరెక్టర్ తెలియజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపాల్ శ్రీవల్లి పావని, కళాశాల ఇతర అధ్యాపకుల విద్యార్థులు పాల్గొన్నారు.










