సహించాం! భరించాం!
మోకాళ్ళ మధ్య
తల పెట్టుకొని రోదించాం
ప్రార్ధించాం! ప్రాధేయపడ్డాం!
కనికరించలేదు ఈ కీచకరాజ్యం
మురిపించి
మరిపించి మాయచేసి
స్త్రీజాతి స్వాతంత్య్రాన్ని
తన చేతుల్లోకి తీసుకొని
ఉక్కుసంకెళ్లు బిగించి
ఆధిపత్య పతాకాన్ని ఎగరేసి
మిఠాయిలు పంచుకొంటోంది
ఈ రాక్షసరాజ్యం
న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి
ప్లీడర్లు బజారులో నిలబడ్డారు
శిక్షలు విధించకుండా మృగాళ్లకు
వత్తాసు పలుకుతున్నా సహించాం
పశుకాంక్షకు బలైన
అయిదు నెలల పసికందు ఊపిరి
నా చిరునామా
ఏదని ప్రశ్నిస్తుంటే...
వ్యూహాలు పన్నండి
మిమ్మల్ని మీరే రక్షించుకోండి
అని పిలుపునిస్తోంది
రాజకీయ నాయకుల అండతో
న్యాయం పొందని ''అయేషా''
ప్రసార మాధ్యమాల్లోనే కాదు
సామాజిక మాధ్యమాల్లో కూడా
ప్రకటనలివ్వండి
శంఖారావాన్ని పూరించండి
స్త్రీలపై దౌర్జన్యాలను అరికట్టండి
అంటూ డా.ప్రియాంకరెడ్డి
చైతన్యానిస్తుంది
''నిర్భయ చట్టం''
భరోసాగా నిలబడితే
''దిశ చట్టం''
దిశా నిర్దేశాలను చూపుతుంటే
స్త్రీజాతి అంతా
ఒక తాటిపై నిలబడి
శంఖారావం పూరిస్తుండగా..
ఎప్పుడో పాఠశాలలో నేర్చుకున్న
కుమారీశతకం
కూనిరాగమై వినిపించగా
మా ఒక్కరికేనా ఈ నీతులంటూ
దాని రచయిత నేనేనంటూ
పక్కి అప్పల నరసయ్య
ఫక్కున నవ్వినట్టనిపించింది
ఆకాశంలో మబ్బుల చాటునుంచి
నన్నెత్తుకుని
వెన్నముద్దలు తినిపించిన
అమ్మమ్మ
ఆక్రోశించకు, ఆవేశపడకు
వేచిచూడు అని సైగ చేస్తుంటే
పక్కనే ఉన్న తాతయ్య
విజయగర్వంతో
చేసిన మందహాసం
నన్ను దాటిపోలేదు
ఇంతలో వీరేశలింగం స్థాపించిన
బాలికోన్నత పాఠశాల
కళ్ళముందు కదిలింది
బాల్యవివాహాలు నిషేధించి
వితంతు వివాహానికి
ఆయన చేసిన కృషి
స్మరణకు వచ్చింది
సతీసహగమనం
రద్దుకై పాటుపడిన
రాజారామ్మోహన్ రారు
మదిలో మెదలగా
దహించుకుపోతున్న హృదిలో
క్షమాగుణం మెరిసింది
మాతృ హృదయం
వేణునాదమై వినిపించింది
క్షమామూర్తి అయిన స్త్రీజాతి
పురుషలోకాన్ని
తన పొత్తిళ్లలో పొదివిపట్టి
లాలించి, నిదుర పుచ్చింది
* గెద్దాడ జయకుమారి, 9441203455