Oct 19,2021 06:36

''సావర్కర్‌జీ ని విడుదల చేయాలని మహాత్మా గాంధీ విజ్ఞప్తి చేశారు.'' అని రక్షణ మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నట్లుగా, సావర్కర్‌ విడుదల కోసం గాంధీజీ కోరినట్లు ఆ వ్యాసంలో ఎక్కడా లేదు. 'ప్రజా భద్రతకు' లేదా 'దేశానికి ప్రమాదం లేనందున' ప్రభుత్వం వారిని విడుదల చేయకపోవడాన్ని గాంధీజీ ప్రశ్నించారు. అంతేకానీ బ్రిటీష్‌ వారికి ఆయన విజ్ఞప్తి చేయలేదు. లేదా రక్షణ మంత్రి చెప్పినట్లుగా తన వ్యాసంలో ఎక్కడా గాంధీజీ ప్రస్తావించలేదు. మనం శాంతియుతంగా స్వాతంత్య్రం కోసం ఉద్యమం చేస్తున్నట్లుగానే ఆయన చేస్తున్నారని గాంధీజీ అన్నట్లు రక్షణ మంత్రి పేర్కొన్నారు. కానీ దీనికి విరుద్ధంగా, సావర్కర్‌ సోదరులు స్వాతంత్య్రం కావాలని కోరుకోవడం లేదు. వారు సంస్కరణల చట్టం కింద పని చేయాలని కోరుకుంటున్నారని గాంధీజీ నొక్కి చెప్పారు.

    'సావర్కర్‌కి వ్యతిరేకంగా చాలా తప్పుడు ప్రచారం సాగింద'ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించినట్లు ఈ నెల 13వ తేదీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. ''బ్రిటీష్‌ ప్రభుత్వానికి ఆయన అనేకసార్లు క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నారని పదే పదే పేర్కొంది. కానీ అసలు వాస్తవం ఏమంటే, తనను విడుదల చేయాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్లు దాఖలు చేయలేదు. సాధారణంగా క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసే హక్కు ఖైదీకి వుంటుంది. మీరు క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేయండి అని మహాత్మాగాంధీ ఆయన్ని కోరారు. గాంధీ సూచన మేరకు సావర్కర్‌ క్షమాభిక్ష పిటిషన్‌ వేశారు. సావర్కర్‌జీని విడుదల చేయాలని మహాత్మా గాంధీ కోరారు. స్వాతంత్య్రం కోసం మనం శాంతియుతంగా పోరాటం చేస్తున్నట్లుగానే సావర్కర్‌ కూడా చేస్తున్నారు.'' అని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ''మీకు అభిప్రాయ భేదాలు వుండవచ్చు గాక, కానీ ఆయన్ని అనుచితంగా చూడడం సరికాదు. దేశానికి ఆయన చేసిన సేవలను తక్కువ చేసి చూపడం సహించబోమని'' అన్నారు. (ఇక్కడ బెదిరింపును గమనించాలి. గాడ్సేకి గుడులు కట్టడం, ఆయన్ని ఒక హీరోలా ఆరాధించడాన్ని సహించగలరు, కానీ సావర్కర్‌ను విమర్శిస్తే సహించలేరు !)
 

                                                        అసలు వాస్తవాలేంటి ?

వి.డి.సావర్కర్‌, గణేష్‌ సావర్కర్‌ల సోదరుడు ఎన్‌.డి సావర్కర్‌ గాంధీజీకి రాసిన లేఖ, గాంధీజీ ఇచ్చిన సమాధానం, 'యంగ్‌ ఇండియా'లో గాంధీజీ రాసిన వ్యాసం...ఇలా 1920వ సంవత్సరానికి సంబంధించిన పత్రాల ఆధారంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ స్టేట్‌మెంట్‌ వుంది.
     రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వాదనలతో వాస్తవాలు కొంత భిన్నంగా వున్నాయి. సావర్కర్‌ దోషిగా నిర్ధారించబడిన మొదటి ఆరు మాసాల లోపే, అంటే వాస్తవానికి 9 సంవత్సరాలు ముందుగా 1911 లోనే వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో వరుసగా పలు పిటిషన్లు పెట్టుకున్నారు. 1913లో అండమాన్‌ జైలును హోం మెంబర్‌ సర్‌ రిజినాల్డ్‌ క్రాడాక్‌ సందర్శించినపుడు తనను విడుదల చేయాలని కోరుతూ సావర్కర్‌ వ్యక్తిగతంగా పిటిషన్‌ పెట్టుకున్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వానికి విశ్వాసపాత్రంగా వుంటానని కూడా చెప్పారు. ఆ పిటిషన్‌లో నుండి కొన్ని వాక్యాలు :
     ''ప్రభుత్వం వారి బహుళ ప్రయోజనాలతో, దయతో నన్ను విడుదల చేస్తే, రాజ్యాంగ పురోగతికి, ఆంగ్లేయుల ప్రభుత్వానికి విధేయుడిగా వుండగలనని బలంగా చెబుతున్నాను. వారు ఇష్టపడే ఏ హోదాలోనైనా పని చేయడానికి సిద్ధంగా వున్నాను. ఎందుకంటే నాలో వచ్చే మార్పు అనేది నా మనస్సాక్షికి అనుగుణంగానే వుంటుంది కాబట్టి భవిష్యత్తులో నా ప్రవర్తన కూడా అలానే వుండగలదని ఆశిస్తున్నాను. శక్తివంతుడు మాత్రమే దయతో ప్రవర్తించగలడు, తప్పిపోయిన కొడుకు తల్లిదండ్రుల దగ్గరకు తప్ప మరెవరి దగ్గరకెళ్ళగలడు?''
      పైగా, తమని గనక విడుదల చేస్తే సైన్యంలో చేరి బ్రిటీష్‌ సామ్రాజ్యానికి సేవ చేస్తామని, సంస్కరణల బిల్లును ఆమోదించిన తర్వాత, ఆ చట్టం విజయవంతం కావడానికి ప్రయత్నిస్తామని, శాంతి భద్రతల యంత్రాంగానికి కట్టుబడి వుంటామని సావర్కర్‌, ఆయన సోదరుడు 1915లో ఒకసారి, 1918లో మరోసారి ప్రభుత్వానికి పిటిషన్లు పెట్టుకున్నారని సావర్కర్‌ మద్దతుదారుడు జి.ఎస్‌.ఖొపార్డె 1920 మార్చి 22న ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో చెప్పారు. దానికి హోం మెంబర్‌ సర్‌ విలియం విన్సెంట్‌ సమాధానమిస్తూ, వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ నుండి రెండు పిటిషన్లు అందాయి. ఒక పిటిషన్‌ 1914లో, రెండోది 1917లో పోర్ట్‌బ్లెయిర్‌ సూపరింటెండెంట్‌ ద్వారా అందాయని ధృవీకరించారు. ఏ హోదాలోనైనా పని చేస్తూ యుద్ధ సమయంలో ప్రభుత్వానికి సేవలందిస్తానని సావర్కర్‌ ప్రతిపాదించారు. రాజకీయ ఖైదీలందరికీ సార్వత్రిక క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. రెండో పిటిషన్‌లో ఈ ప్రతిపాదన మాత్రమే వుంది.
     ఆ రకంగా, గాంధీజీ నుండి ఎలాంటి సూచన, సలహాలు లేకుండానే 1911, 1920 మధ్య సావర్కర్‌ అనేక పిటిషన్లు పెట్టుకున్నారని, బ్రిటీష్‌ ప్రభుత్వానికి విశ్వాసపాత్రుడిగా వుంటానని, అవసరమైతే ఏ హోదాలోనైనా పని చేయడానికి కూడా సుముఖంగా వున్నానని చెప్పినట్లు చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. అందువల్ల సావర్కర్‌ తనంత తానుగా క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకోలేదని, గాంధీజీ సలహా మీదనే పెట్టారంటూ రక్షణ మంత్రి చేసిన ప్రకటన వాస్తవ చారిత్రక రికార్డుల ప్రకారం సరికాదని తెలుస్తోంది.
     అటువంటపుడు గాంధీజీ అసలు కథ లోకి ఎలా ప్రవేశించారు? 1920 లోనే, జైల్లో వున్న ఇరువురు సావర్కర్‌ సోదరుల చిన్న తమ్ముడైన ఎన్‌.డి.సావర్కర్‌...గాంధీజీ సలహా కోరుతూ లేఖ రాశారు. బ్రిటీష్‌ వారు ప్రకటించిన రాయల్‌ ప్రొక్లెమేషన్‌ ఆఫ్‌ క్లెమెన్సీ కింద విడుదలయ్యే ఖైదీల జాబితాలో తన సోదరుల పేర్లు లేకపోవడం చూసి ఎన్‌.డి.సావర్కర్‌ గాంధిజీని సంప్రదించారు. గాంధీజీ సమాధానమిస్తూ సలహా ఇవ్వడం కష్టమన్నారు. అయితే, అతను పిటిషన్‌ను క్లుప్తీకరించవచ్చని సూచించారు. దీనికి తోడు, 1920 మే 26న ఆయన 'సావర్కర్‌ బ్రదర్స్‌' శీర్షికతో 'యంగ్‌ ఇండియా'లో ఒక వ్యాసం కూడా రాశారు. రాయల్‌ ప్రొక్లెమేషన్‌ ఆఫ్‌ క్లెమెన్సీని గాంధీజీ ప్రస్తావిస్తూ, అనేకమంది రాజకీయ ఖైదీలు విడుదలవుతుండగా, సావర్కర్‌ సోదరులు విడుదల కాలేదని చెప్పారు.
     ''ఇరువురు సోదరులు తమ రాజకీయ అభిప్రాయాలను వెలిబుచ్చారు. తమకెలాంటి విప్లవాత్మక ఆలోచనలు లేవని ఇరువురూ చెప్పారు. ఒకవేళ తమని విడుదల చేస్తే, సంస్కరణల చట్టం (గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ ఆఫ్‌ 1919) కింద పని చేయడానికి సిద్ధంగా వున్నామ''ని కూడా చెప్పారని గాంధిజీ పేర్కొన్నారు. ''బ్రిటీష్‌ వారి నుండి స్వాతంత్య్రం పొందాలన్న ఆకాంక్ష కూడా తమకు లేదని వారు స్పష్టంగా చెప్పారు. ఇందుకు విరుద్ధంగా, బ్రిటీష్‌ వారితో కలిసి భారతదేశ గమ్యాన్ని రూపొందించవచ్చునని వారు అభిప్రాయపడ్డారు.''
     ''సావర్కర్‌జీ ని విడుదల చేయాలని మహాత్మా గాంధీ విజ్ఞప్తి చేశారు.'' అని రక్షణ మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నట్లుగా, సావర్కర్‌ విడుదల కోసం గాంధీజీ కోరినట్లు ఆ వ్యాసంలో ఎక్కడా లేదు. 'ప్రజా భద్రతకు' లేదా 'దేశానికి ప్రమాదం లేనందున' ప్రభుత్వం వారిని విడుదల చేయకపోవడాన్ని గాంధీజీ ప్రశ్నించారు. అంతేకానీ బ్రిటీష్‌ వారికి ఆయన విజ్ఞప్తి చేయలేదు. లేదా రక్షణ మంత్రి చెప్పినట్లుగా తన వ్యాసంలో ఎక్కడా గాంధీజీ ప్రస్తావించలేదు. మనం శాంతియుతంగా స్వాతంత్య్రం కోసం ఉద్యమం చేస్తున్నట్లుగానే ఆయన చేస్తున్నారని గాంధీజీ అన్నట్లు రక్షణ మంత్రి పేర్కొన్నారు. కానీ దీనికి విరుద్ధంగా, సావర్కర్‌ సోదరులు స్వాతంత్య్రం కావాలని కోరుకోవడం లేదు. వారు సంస్కరణల చట్టం కింద పని చేయాలని కోరుకుంటున్నారని గాంధీజీ నొక్కి చెప్పారు.
      ఈ మొత్తం అధ్యాయంలో వింతైన వ్యంగ్యం వుంది. సావర్కర్‌ జాతీయాభిమానాన్ని స్పష్టంగా చెప్పేందుకు మహాత్మా గాంధీని రంగం లోకి తీసుకువచ్చారు. అది కూడా ఇటువంటి సంకుచితమైన ప్రాతిపదికలపై! గాంధీజీ, సావర్కర్‌ ఇరువురూ సన్నిహితమైన సంబంధాలను కలిగివున్నారనే భావనను ప్రజల్లో కలిగించేందుకు చేసిన ప్రయత్నమే ఇది. క్షమాభిక్ష పిటిషన్లు వంటి కీలకమైన అంశాలపై గాంధీజీ సలహాలు సావర్కర్‌ తీసుకున్నారని చెప్పడమే ఇది. పైగా ఆయన విడుదల కోసం గాంధీ స్వయంగా విజ్ఞప్తి చేశారని చెప్పే ప్రయత్నమే ఇది. పైగా అనేకమంది జాతీయవాదులు క్షమాభిక్ష కోరడానికి తిరస్కరించిన సమయంలో, తనకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలంటూ గాంధీజీ డిమాండ్‌ చేసిన నేపథ్యంలో సావర్కర్‌ క్షమాభిక్ష కోసం యాచించిన పరిస్థితులను సాధారణమే అని చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఇదని స్పష్టంగా అర్ధమవుతోంది.

/'మనం మరిచిపోవాలనుకుంటున్న వాస్తవాలేంటి?' రేపటి సంచికలో/
మృదులా ముఖర్జీ,
ఆదిత్య ముఖర్జీ,
సుచేతా మహాజన్‌