Mar 04,2023 00:12

సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి

ప్రజాశక్తి - కశింకోట
కశింకోట మండలంలో జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి శుక్రవారం పర్యటించారు. కశింకోట పంచాయతీ పరిధిలో భూముల సర్వేలో భాగంగా హద్దురాళ్ళు వేయడాన్ని పరిశీలించారు. హద్దురాళ్ళు వేయటానికి ఎంతమంది కూలీల అవసరం ఉంటుంది, రోజుకు ఎన్ని సర్వే పాయింట్లు ఇవ్వగలరు తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తీడ గ్రామపంచాయతీలో అమృత్‌ సరోవర్‌లో భాగంగా జరుగుతున్న మాలపాటి చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎంత మంది ఉపాధి కూలీలతో పని చేస్తున్నారో సిబ్బందిని అడిగారు. ఉపాధి హామీ పథకం ఎంత గిట్టుబాటు వస్తుందో తెలుసుకున్నారు. చెరువు మొత్తం రూ.14.50 లక్షలతో అభివృద్ధి చేయడం జరిగిందని, సుమారుగా 150 ఎకరాలు భూమికి నీరు అందుతుందని, చెరువుగట్టుపైన 80 కొబ్బరి మొక్కులను పెంచుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు పథక సంచాలకులు రోజారాణి, ఎంపిడిఓ కొంకి అప్పారావు, ఇన్‌ఛార్జి తహశీల్దారు సురేష్‌ నాయుడు, ఏపిఓ శివ పాల్గొన్నారు.