Dec 24,2022 23:22

రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న దృశ్యం

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట
కశింకోట-బంగారుమెట్ట రోడ్డు విస్తరణకు మోక్షం కలిగింది. రెండు రోజుల క్రితం మండలంలోని నీలకంఠాపురం గ్రామం వద్ద రోడ్డు విస్తరించడానికి రహదారికి ఒకవైపు గల రోడ్డు మార్జిన్‌ను తవ్వి పనులు ప్రారంభించారు. కశింకోట నుండి బంగారుమెట్టు జంక్షన్‌ వరకు 24 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం గత ఏడాది రూ.32 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయి. రెండు నెలల క్రితం బంగారుమెట్ట జంక్షన్లో స్థానిక శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ రోడ్డు విస్తరణ పనులను లాంచినంగా ప్రారంభించారు. కశింకోట-బంగారుమెట్ట రోడ్డులో సుమారు 13 కిలోమీటర్లు బుచ్చయ్యపేట మండల పరిధిలో ఉంది. ఇప్పుడు మండల పరిధిలోని రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ఎంతోకాలంగా రోడ్డు విస్తరణ కోసం ఎదురుచూసిన మండల వాసులకు రోడ్డు పనులు ప్రారంభం కావడం ఒకరకంగా సంతోషమని చెప్పాలి. ఈ రోడ్డులో నిత్యం వందలాది వాహనాలు అనకాపల్లికి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ రహదారిలో ఎక్కువగా మలుపులు ఉండడం, రోడ్డు ఇరుక్కుగా ఉండటంతో వాహనాలు పలుమార్లు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఎట్టకేలకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కావడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.