Jul 15,2023 20:32

సూచనలు చేస్తున్న ప్రవీణ్‌ ప్రకాష్‌

ప్రజాశక్తి - ఆదోని
క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ఆర్‌ఆర్‌ లేబర్‌ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాల, క్రాంతి నగర్‌లోని సంతపేట పురపాలక పాఠశాల, వెంకన్న గేరి పాఠశాల, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను పరుగులు పెట్టించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటగా ఆర్‌ఆర్‌ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పదో తరగతి 'ఎ' సెక్షన్‌లోని విద్యార్థుల దగ్గరికి వెళ్లి జగనన్న విద్యా కానుక కిట్లను పరిశీలించారు. విద్యార్థుల బ్యాగుల్లోని నోట్‌ పుస్తకాలను, పాఠ్యపుస్తకాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులను ఎంత మంది ఇక్కడ పని చేస్తున్నారని, ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ప్రశ్నించారు. 820 మంది విద్యార్థులకు పైగా ఉన్నారని, నలుగురే ఉపాధ్యాయులు ఉన్నారని, 6 నుంచి 10వ తరగతి వరకు వారే బోధిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదని ఆర్‌జెడి, డిఇఒను ప్రశ్నించారు. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో విస్మయానికి గురయ్యారు. వేల మందికి పదోన్నతులు కల్పిస్తున్నా ఇంకా ఉపాధ్యాయుల కొరత ఉంటే విద్యార్థులకు బోధన ఎలా ముందుకు సాగుతుందని, వెంటనే ఇక్కడ విద్యార్థులకు నిష్పత్తికి అనుగుణంగా 13 మంది ఉపాధ్యాయులను వారం రోజుల్లోపు నియమించి తనకు నివేదిక ఇవ్వాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశించారు. అక్కడి నుంచి సంతపేట పురపాలక ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. నేలపైనే కూర్చోవడంతో నాడు-నేడు కింద బెంచీలు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదంటూ ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఇంత మంచి వాతావరణం, పాఠశాలను రూపురేఖలు మారిస్తే అనవసరమైన వాటికి ఖర్చులు చేశారే, తప్ప విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పు పట్టారు. కొద్దిసేపు విద్యార్థుల వర్క్‌ బుక్‌ను పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయుడు వర్క్‌ బుక్‌ను కరెక్షన్‌ చేయకపోవడం, తప్పులు ఉండడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బడులు పునః ప్రారంభమై నెల రోజులైనా ఇంకా పుస్తకాలు కరెక్షన్‌ చేయకపోవడం మంచిది కాదని తెలిపారు. నిబద్ధతతో పని చేయాలంటూ చురకలు అంటించారు. ఉపాధ్యాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వారం రోజుల్లోపు తనకు ఆయన పని తీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు అందరూ నిర్దేశిత సమయంలో పాఠాలను విద్యార్థులకు బోధించాలని, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను విద్యార్థులు వారి క్లాస్‌ వర్క్‌లో రాసే విధంగా చూడాలని సూచించారు. వారు ఎదైనా తప్పులు కాస్తే వాటిని కరెక్షన్స్‌ చేసి విద్యార్థులకు మళ్లీ వాటి గురించి వివరించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎందుకు పర్యటించడం లేదని డిఇఒ రంగారెడ్డిని ప్రశ్నించారు.
పురపాలక అధికారులు, సచివాలయ సిబ్బందిపై అసహనం
వెంకన్న గేరిలో తన డాష్‌ బోర్డులో ఉన్న 15 మంది బడిబయట విద్యార్థులపై ఆచూకీ కోసం ఓ ఇంటికి వెళ్లారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పురపాలక అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జిఆర్‌ యాప్‌లో వారు ఎక్కడున్నారు చెప్పాలంటూ సూచించారు. వారు నీళ్లు నమిలారు. మొబైల్‌ యాప్‌పై అవగాహన లేకపోవడం, కనీసం బడిబయట ఉన్న విద్యార్థుల వివరాలు తెలియకపోవడం జీతాలు ఇవ్వడం దండగ అన్నారు. బడికి రాకపోతే వారి ఇంటికి వెళ్లి బడిలో ఉండే విధంగా చూడాలన్నారు.
నేలపై కూర్చోడంపై విస్మయం
ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు నేలపై కూర్చొని పాఠాలు వింటుండడంతో విస్మయానికి గురయ్యారు. నాడు-నేడు కింద ఒక్కరు కూడా కింద కూర్చోరాదని రూ.కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వృథాగా ప్రహరీకి, ఇతర వాటికి ఉపయోగించి అవసరమైన వాటికి వినియోగించకపోవడంపై ఇంటర్మీడియట్‌ బోర్డు డివిఇఒ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే వారికి బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు.
సబ్‌ కలెక్టర్‌పై అసహనం
రెవెన్యూ విభాగం ఒక్కటే కాదని, పరిధిలోని అన్ని శాఖల పనితీరును మెరుగుపరచాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌పై అసహనం వ్యక్తం చేశారు. తరచుగా తనిఖీలు నిర్వహించి పురోగతి వైపు అడుగులు వేయించాలని కోరారు. సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, డిఇఒ రంగారెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్‌ ఏపీడీ డాక్టర్‌ వేణుగోపాల్‌, శామ్యూల్‌ పాల్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు డివిఇఒ ఖాజా మోహిద్దీన్‌, ఎంఇఒలు శివరాములు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
ఆదోని మండలవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌కు వినతిపత్రం అందజేశారు. డివిజన్‌ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ... నాడు-నేడు పనులపై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యా సంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలన్నారు.