Oct 04,2023 19:44

సిబ్బందికి సూచనలు చేస్తున్న కమిషనర్‌

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఇక నుండి ఇంజినీరింగ్‌ సిబ్బంది ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కమిషనర్‌ ఆర్‌.శ్రీరాములునాయుడు ఆదేశించారు. ఇందులో భాగంగా బుధవారం వివిధ ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి పనుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. విటి అగ్రహారం, బిసి కాలనీలో నిర్మితమవుతున్న వాటర్‌ ట్యాంకు నిర్మాణాలను పరిశీలించారు. మజ్జిపేట, బిసి కాలనీలో సిసి రోడ్లు, కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా బిసి కాలనీలో నిర్మితమవుతున్న సిసి రోడ్డు నాణ్యతా లోపాన్ని గమనించారు. తక్షణమే ఇంజనీరింగ్‌ అధికారులను పిలిచి సిసి రహదారి నిర్మాణ విషయంలో మరోసారి నాణ్యతా ప్రమాణాలను పునపరిశీలించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాలలో కొంతమేర ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. 24 గంటల్లోపు ఆక్రమణలు తొలగించే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ అమ్మాజీరావును ఆదేశించారు. రహదారులను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు కావడం ఇబ్బందికర పరిస్థితని కమిషనర్‌ అసహనం వ్యక్తం చేశారు. రహదారులపై ఆక్రమణలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇఇ శ్రీనివాసరావు, ఎసిపి అమ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు.