Aug 06,2023 23:08

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

* ఎమ్మెల్యే బెందాళం అశోక్‌
ప్రజాశక్తి - కవిటి: 
ఓటర్ల సర్వేలో క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌స్థాయి ఇన్‌ఛార్జీలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ సూచించారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ, నాలుగు మండలాల క్లస్టర్‌, యూనిట్‌ బూత్‌స్థాయి ఇన్‌ఛార్జీల సమావేశాన్ని స్థానిక కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21వ తేదీ వరకు ఓటర్ల సర్వే కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జి వినియోగించుకుని తమ పరిధిలోని ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కుళ్ళిపోయిన వ్యవస్థతో మనం పోరాడుతున్నామని, అందరూ సక్రమంగా ఉంటారని ఊహించుకోవద్దని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని సూచించారు. కష్టపడితే ఫలితం కచ్చితంగా ఉంటుందని, ప్రశాంతమైన ఇచ్ఛాపురం నియోజకవర్గం ఎప్పటికీ టిడిపి కంచుకోటేనని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. దాన్ని మరింత బలోపేతం చేసేందుకు అందరం కలిసి పనిచేయాలని సూచించారు. సమావేశంలో టిడిపి నాయకులు సదానంద రౌలో, మాదిన రామారావు, దక్కత ఢిల్లేశ్వరరావు, మణిచంద్ర ప్రకాష్‌, నాలుగు మండలాల ముఖ్య నాయకులు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జీలు పాల్గొన్నారు.