Nov 02,2023 21:39

ప్రజాశక్తి - కాళ్ల
క్షేత్ర పరిశోధనలతో ఆక్వాకల్చర్‌ మరింత అభివృద్ధి చెందుతుందని పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేపల శాస్త్రవేత్త మోదడుగు విజరు గుప్తా అన్నారు. గురువారం పెదఅమిరంలో రాధాకృష్ణ కన్వెన్షన్‌ హాల్లో ఈ నెల 2, 3, 4 తేదీల్లో అక్వా ఎక్స్‌ ఇండియా ప్రదర్శనను కైకలూరు ఎంఎల్‌ఏ దూలం నాగేశ్వరరావు, శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శాస్త్రవేత్త విజరు గుప్తా మాట్లాడుతూ చేపల పెంపకానికి తక్కువ ఖర్చుతో జంతు మాంసకృత్తులు అందించడం, మానవాళి భవిష్యత్తు ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడంలో కీలకమన్నారు. కైకలూరు ఎంఎల్‌ఎ డి.నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు కళ్లల్లో ఆనందం ఉండాలంటే నాణ్యమైన సీడ్‌, ఫీడ్‌ ఉపయోగించాలన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఒడిదుడులతో సాగుతోందన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టాలన్నారు. సముద్రతీరంలో రొయ్య సాగు చేపట్టి గణనీయమైన ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలోనే ప్రధాన భాగంగా ఉందన్నారు. ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు మాట్లాడుతూ ఆక్వా సాగులో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి దిగుబడి పెంచేందుకు అనుసరించాల్సిన ఆధునిక విధానాలపై ఆక్వా అంతర్జాతీయ ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎంఎల్‌సి జయ మంగళ వెంకటరమణ మాట్లాడుతూ రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రికరణకు సంబంధించిన పరికరాలు ఒక చోట ప్రదర్శనగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి వెంకట శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఆక్వా రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి ఛైౖర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు, సదస్సు ఆర్గనైజర్‌ దంతులూరి వేణు, సికెఎన్‌ మూర్తి, పెనుమత్స విశ్వనాధరాజు, కాలవ వెంకట్రావు, స్టాల్స్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.