ప్రజాశక్తి - సాలూరు : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను నిర్ధేశిత గమ్యానికి క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత కార్మికులదేనని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్.ద్వారకాతిరుమలరావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ డిపోను ఆయన పరిశీలించిన అనంతరం కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో 1500 కొత్తబస్సుల కొనుగోలుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. అన్ని డిపోలకు కొత్త బస్సులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో సంస్థ 332మంది కార్మికులను కోల్నోయిందన్నారు. కారుణ్య నియామకం కింద 884మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. కార్మికుల పిఎఫ్ బకాయిలు రూ.960 కోట్లు చెల్లించామని తెలిపారు. సంస్థ లాభాల బాటలో నడవడానికి కార్మికులు కృషి చేయాలని కోరారు. కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకు ముందు డిపో యూనియన్ నాయకులు ఎంఎస్ నారాయణ, బిఎ రావు ఎండి ద్వారకాతిరుమలరావుకి స్వాగతం పలికారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎమ్ డి ద్వారకాతిరుమల రావుని మర్యాదపూర్వకంగా కలిశారు.










