Nov 15,2022 22:39

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
         క్షౌరవృత్తిలోకి రిలయన్స్‌ సంస్థను అనుమతించొద్దంటూ పట్టణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ నుండి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ సంఘం జెఎసి అధ్యక్షులు తాడికొండ నరసింహరావు మాట్లాడుతూ కార్పొరేట్‌ సంస్థ అయిన రిలయన్స్‌ క్షౌర వృత్తిలోకి రావడం బాధాకరమని, దీన్నిరాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకోవాలని కోరారు. తరతరాల నుంచి గ్రామాల నుంచి పట్టణ స్థాయి వరకు క్షౌర వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నామని, కార్పొరేట్‌ ముసుగులో కడుపు కొట్టడానికి రిలయన్స్‌ సంస్థ ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాయీ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు ద్రాక్షవరపు సూరిబాబు మాట్లాడుతూ కులవృత్తిపై ఆధారపడి రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయని, వారు జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిలయన్స్‌ను తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో పట్టణ నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పరిటాల వీరాస్వామి, ఉపాధ్యక్షులు కిన్జంగి రాజు, వడ్డేపల్లి కిషోర్‌చంద్ర, నందీశ్వరరావు, వేల్పుకొండ వీరభద్రరావు, కార్మికులు పాల్గొన్నారు.