ప్రజాశక్తి - ఆరిలోవ : గుండెపోటుతో ఈ నెల 19న మృతి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు వి.కృష్ణమూర్తి కుటుంబాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పరామర్శించారు. బుధవారం ఆరిలోవలోని కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి ఆయన భార్య అన్నపూర్ణ, కుమార్తె శార్వాణి, కుమారుడు మోహన్, అల్లుడు కృష్ణ, కోడలు లావణ్యలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈసందర్భంగా కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణమూర్తి మరణ వార్త తనకు ఆలస్యంగా తెలిసిందని ఆవేదన వెలిబుచ్చారు. విశాఖకు ఎప్పుడు వచ్చినా తనను ఎంతో ఆప్యాయతగా చూసేవారని గుర్తు చేసారు. విశాఖ జిల్లా సిపిఎం కార్యాలయంలో అకౌంట్స్ నిర్వహణను ఎంతో బాధ్యతలో నిర్వహించారని కొనియాడారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా జీవనం సాగించిన కృష్ణమూర్తి, తమ పిల్లలిద్దరికీ కులాంతర వివాహాలు చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. మరణానంతరం తన కళ్లను దానం చేశారని, దేహాన్ని వైద్య విద్యార్ధుల పరిశోధనల కోసం ఆంధ్రామెడికల్ కాలేజీకి ఇవ్వడం గొప్ప విషయమన్నారు. కృష్ణమూర్తి మరణం వారి కుటుంబానికే కాకుండా పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. శ్రీనివాసరావు వెంట సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్, జోన్ కార్యదర్శి వి.నరేంద్రకుమార్ పాల్గొన్నారు.
గాజువాక : ఈనెల ఒకటిన మరణించిన సిపిఎం సీనియర్ నాయకులు, కార్మికనేత జి.సుబ్బారావు కుటుంబాన్ని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బివి. రాఘవులు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. నరసింగరావు పరామర్శించారు. బుధవారం షీలానగర్‌లోని సుబ్బారావు ఇంటికి వెళ్లి ఆయన సతీమణి, మహిళా సంఘం నేత జి.మణి, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. సుబ్బారావు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మణి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుమారులు, వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా విశాఖ ఉద్యమంలో జి.సుబ్బారావుతో కలసి పనిచేసిన అనుభవాన్ని, స్మృతులను నెమరువేసుకున్నారు. సుబ్బారావు మృతి జిల్లా కార్మికోద్యమానికి, కుటుంబానికి తీవ్ర లోటన్నారు.
అలాగే ఇటివల తీవ్ర అనారోగ్య ంపాలై తల్లిని కోల్పోయిన పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు, మాజీ కార్పొరేటరు బొట్టా ఈశ్వరమ్మ, కాలుకు ఆపరేషన్ చేయించుకున్న పార్టీ సీనియర్ నేత కె.స్వతంత్ర కుమార్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కమలమ్మలను పరామర్శించారు. అనంతరం కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న అమృతవల్లిని పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా నేతలు ఎం.రాంబాబు, వై.సత్యవతి, జి.రమణ, ఒ.అప్పారావు, అప్పలరాజు, సోమేశేఖర్, యుఎస్‌ఎన్.రాజు, ఈశ్వరరావు, గౌరీష్, ఎ.నూకేశ్వరరావు, డి. అప్పారావు, జయలక్షి వున్నారు.










