* కమ్యూనిస్టు విలువలకు ప్రతిబింబం
* 80వ జన్మదిన సభలో కొనియాడిన వక్తలు
ప్రజాశక్తి - సోంపేట, పలాస: సిపిఎం సీనియర్ నాయకులు పాతిని కృష్ణమూర్తి భావితరాలకు మార్గదర్శి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోంపేట మండలంలోని మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కృష్ణమూర్తి 80వ జన్మదినోత్సవ సభను ఆదివారం నిర్వహించారు. కృష్ణమూర్తి జీవిత చరిత్ర 'ఉద్యమపథంలో నా జ్ఞాపకాలు' పుస్తకాన్ని, ప్రజాశక్తి వెలువరించిన జన్మదిన ప్రత్యేక సంచికను రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ బి.తులసీదాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ కృష్ణమూర్తి మాస్టారు ఉపాధ్యాయునిగా ఎంతోమందిని విద్యావంతులను చేశారని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే ప్రజా, ఉపాధ్యాయ ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. ప్రజల కోసం పోరాడి జైలు జీవితాన్ని అనుభవించారని గుర్తుచేశారు. కమ్యూనిస్టుగా ఉద్దాన ప్రాంత అభివృద్ధికి అన్నివిధాలుగా కృషి చేశారని కొనియాడారు.
కమ్యూనిస్టు విలువలకు ప్రతిబింబం
కమ్యూనిస్టు విలువలకు పాతిన కృష్ణమూర్తి ప్రతిబింబం అని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. ఆర్థిక పోరాటాలకే పరిమితం కాకుండా సామాజిక, సాంస్కృతిక రంగాల్లో కృషి చేశారని చెప్పారు. కమ్యూనిస్టులు వ్యక్తిగత, కుటుంబ జీవితం ప్రజా ఉద్యమంతో ఎలా మమేకం కావాలో ఆచరించి ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. ప్రజలను కదిలించడంలో, నలుగురిని మెప్పించడంలో ఆయన పాటించిన విలువల ప్రభావం కనిపిస్తుందన్నారు. పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారని తెలిసినా తనను తాను రక్షించుకునేందుకు నాయకుల పంచన చేరలేదని, పోలీసులను ఎదుర్కోవడానికే సిద్ధపడ్డారని చెప్పారు. ప్రజల కోసం జైలు జీవితాన్ని అనుభవించారు తప్ప పోలీసులకు లొంగిపోలేదన్నారు. పోలీసుల చిత్రహింసలు కమ్యూనిస్టుగా ఆయన అంకితభావాన్ని నీరుగార్చలేకపోయాయని తెలిపారు. ఉపాధ్యాయులు, రైతులు, కూలీల సమస్యలతో పాటు మామిడిపల్లిలో విద్య, వైద్యం, రవాణా, తాగునీరు తదితర సమస్యల పరిష్కారానికి ప్రజలను కదిలించి పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఉద్యమాల్లో కృష్ణమూర్తికి ఆయన సతీమణి రోహిణమ్మ తోడ్పాటును అందించారన్నారు.
కృష్ణమూర్తి జీవితం స్ఫూర్తిదాయకం
మామిడిపల్లిలో ఉద్యమ పున:నిర్మాణంలో కృష్ణమూర్తి కీలకపాత్ర పోషించారని ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ బి.తులసీదాస్ అన్నారు. మూఢాచారాలు, వెనుకబాటుతనం, బాల్య వివాహాలు వంటి సామాజిక సమస్యలపై ఉద్యమించారని తెలిపారు. ఆదర్శ వివాహాలు, గ్రామ బావిలో దళితులతో నీరు తోడించడం, సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసి కుల వివక్షను ఎదురించారన్నారు. కమ్యూనిస్టులు అంటే దైవ భక్తికి దూరంగా ఉండే వారని ప్రజలు భావిస్తున్న రోజుల్లో మామిడిపల్లిలో అమ్మవారి సంబరాలను నిర్వహించి, గ్రామస్తులందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చారని చెప్పారు. 1999 ఎన్నికల్లో సోంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సిపిఎం కోరినప్పుడు గెలుపోటములను చూడకుండా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి పోటీ చేశారని చెప్పారు. 56 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సిపిఎం అభ్యర్థులు ఉండడం మామిడిపల్లి ప్రత్యేకత అన్నారు. మామిడిపల్లి సర్పంచ్‌గా కృష్ణమూర్తి రెండుసార్లు ఎన్నికై ప్రజలకు సేవ చేశారన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. కృష్ణమూర్తి తనయుడు నరేంద్ర వర్మ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, పిరియా రాజారావు, ఎంపిపి నిమ్మాన దాసు, వాణిజ్య పనుల శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్ జుత్తు తాతారావు, మామిడిపల్లి సర్పంచ్ పాతిని శేషగిరి, ఎంపిటిసి దున్న మాధవరావు, రైతుసంఘం నాయకులు ఎస్.లకీëనారాయణ, ఎం.లోకనాథం, గొరకల లింగరాజు, గొరకల లక్ష్మీనారాయణ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.










