Aug 30,2023 00:21

గంగమ్మతల్లికి పూజ చేస్తూ నీటిని విడుదలచేస్తున్న అప్పలనాయుడు

ప్రజాశక్తి- పద్మనాభం : మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన సాగునీటి కాలువకు వైసిపి రైతు విభాగం అధ్యక్షుడు ఎం.అప్పలనాయుడు మంగళవారం నీరు విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది కాలువ పూడికతీతకు రూ.2 లక్షలు సొంత నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2019-20లో కూడా సొంత నిధులు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఏటా ప్రభుత్వం నిధులు ఇచ్చి తవ్వకాలు చేస్తే 1600 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని పూడికతీత తీయకుంటే కాలువ పూర్తిగా పూడుకుపోయి కనుమరుగవుతుందన్నారు. దీనివల్ల నాలుగు గ్రామాలకు చెందిన 1600 ఎకరాలు బీడు భూములుగా మారిపోతాయని తెలిపారు. నీరు విడుదల సందర్భంగా గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు సమర్పించారు. రైతులకు, కూలీలకు భోజన సౌకర్యం కల్పించారు.